తాడేపల్లి: మెగా డీఎస్సీ పేరుతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్రీడా కోటా ఉద్యోగాలను తన అనుచరులకు పప్పుబెల్లాల మాదిరిగా పంచుకున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. డీఎస్సీ నిర్వహణ సందర్భంగా ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అంతులేని అరాచకాలు చేసిందని ఆయన వెల్లడించారు. డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల కాకముందే, అభ్యర్థుల అటెస్టేషన్ చేయడం.. అంతకు ముందు.. అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ తేదీకి ముందే సర్టిఫికెట్లపై కూన రవికుమార్ సంతకాలు చేశారని తెలిపారు. కేవలం సాధారణ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతోనే అసోసియేషన్ సభ్యుల కుటుంబీకులు ఫ్యామిలీ కోటా కింద పోస్టులు కొట్టేశారని మండిపడ్డారు. వయసుతో సంబంధం లేకుండా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అర్హులైన నిరుద్యోగుల గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటినీ నిలదీయడానికి ఈనెల 21న ‘శాప్’ కార్యాలయానికి వస్తున్నామని, మంత్రి నారా లోకేష్‌కు దమ్ముంటే అక్కడ చర్చకు రావాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన టీజేఆర్ సుధాకర్‌బాబు సవాల్ చేశారు. ప్రెస్‌మీట్‌లో టీజేఆర్ సుధాకర్‌బాబు ఇంకా ఏం మాట్లాడారంటే..: కూన రవికుమార్ వ్యవహారం. అత్యంత అనైతికం: ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కూన రవికుమార్ అత్యంత అనైతికంగా వ్యవహరించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన జూన్ 22న బాధ్యతలు స్వీకరించగా, అంత కంటే నెల రోజుల కంటే ముందే.. అంటే మే 16వ తేదీతో ఆయన చాలా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లపై సంతకాలు చేశారు. ఇంకా డీఎస్సీ మెరిట్ లిస్ట్ ప్రకటించక ముందే.. అభ్యర్థులు ఎంపికైన తర్వాత చేయాల్సిన అటెస్టేషన్ సంతకాలు కూడా చేశారు. డీఎస్సీ మెరిట్ లిస్ట్‌ను ఆగస్టు 22న విడుదల చేయగా, అంతకు వారాల ముందే అభ్యర్థుల అటెస్టేషన్ చేశారు!. అంటే ఎవరు సెలెక్ట్ అవుతున్నారనే జాబితాను ముందుగానే అసోసియేషన్‌కు పంపారా? ఆ జాబితాల ఆధారంగానే అటెస్టేషన్ చేశారా? ప్రభుత్వం దీనిపై ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలి. అంతే కాకుండా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు చెందిన వారి కుటుంబ సభ్యులకే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు వచ్చాయనే ఆరోపణలపై కూడా విచారణ జరగాలి. అసోసియేషన్ సభ్యులకు ‘ఫ్యామిలీ కోటా‘ ఉద్యోగాలు: వైఎస్సార్ కడప జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేసిన గండికోట ప్రసాద్ కుమార్తె జి. రుచిత సాఫ్ట్‌బాల్ సర్టిఫికెట్‌తో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ ఉద్యోగం పొందారు. శ్రీకాకుళం జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.వి. రమణ భార్య లక్ష్మీదేవి సాఫ్ట్‌బాల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌తో విజయనగరం జిల్లాలో టీజీటీ తెలుగు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం పొందారు. తూర్పుగోదావరి జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్. రాంప్రసాద్ భార్య కోలపల్లి నాగమలక్ష్మి 2023లో శ్రీనగర్‌లో సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొన్నట్లు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సమర్పించారు. ఇవన్నీ నిజమా కాదా ప్రభుత్వం తేల్చాలి. అసోసియేషన్ పదవుల్లో ఉన్నవారు తమ కుటుంబ సభ్యులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఫ్యామిలీ కోటాలో ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. ఈ విధంగా అర్హత కలిగిన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారు. నకిలీ, తప్పుడు సర్టిఫికెట్లు ఎలా అంగీకరించారు?: స్పోర్ట్స్ కోటాలో ఫామ్–1, ఫామ్–2, ఫామ్–3, ఫామ్–4లకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న వారికి ఫామ్–1, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి ఫామ్–2, అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొన్న వారికి ఫామ్–3, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు ఫామ్–4కు సంబంధించిన సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. కానీ జిల్లా స్థాయిలో ఆడిన వ్యక్తికి జాతీయ స్థాయి ఫామ్–2 ఎలా వచ్చింది? ఇలాంటి సర్టిఫికెట్లు ఎలా అంగీకరించారు? నకిలీ, తప్పుడు సర్టిఫికెట్లు ఉంటే వాటిపై సమగ్ర విచారణ జరిపించాలి. నారా లోకేష్‌కు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అన్ని ఆధారాలతో శాప్ కార్యాలయానికి వస్తాం: అన్ని అర్హతలతో ఉద్యోగాలు పొందిన ఏ ఒక్క ఉద్యోగికి కూడా నష్టం చేయాలన్న ఆలోచన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగం పొందలేక పోయిన నిరుద్యోగులకు న్యాయం జరగాలి. వారి కోసమే మేము పోరాడుతున్నాం. ఈనెల 21న శాప్ కార్యాలయంలో అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలి. మేము మా దగ్గర ఉన్న పత్రాలు, ఆధారాలతో వస్తాం. మీడియా సమక్షంలో చర్చిద్దాం. మీరు అర్హత కలిగిన వారికే ఉద్యోగాలు ఇచ్చామని నిరూపించండి. అక్కడ మంత్రి లోకేష్ కూడా చర్చకు రావాలి. ఒకవేళ మేము చూపించే ఆధారాలు, మా ఆరోపణలు తప్పని నిరూపించలేకపోతే మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని టీజేఆర్ సుధాకర్‌బాబు సవాల్ చేశారు.