లిక్కర్ కేసులో నాకు నోటీసులు కక్షసాధింపే

 ఈడీ నోటీసులకు, బెదిరింపులకూ భయపడేది లేదు..

 కూటమి ప్రభుత్వాన్ని కూల్చేవరకూ నా గొంతు మోగుతూనే ఉంటుంది

 తేల్చి చెప్పిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గుంటూరు జిల్లాపార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.

 చంద్రబాబు, పెమ్మసాని, లోకేష్‌లది ముమ్మటీకీ రాజకీయ కక్ష సాధింపే

 అందులో భాగంగానే నాకు ఈడీ నోటీసులు..

 గుండెకు రెండు స్టంట్లు పడినా నా గుండె ధైర్యం తగ్గలేదు

 అంబటి రాంబాబు స్పష్టీకరణ

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోందని, ఇందులో భాగంగానే తనను లక్ష్యంగా చేసుకుని ఈడీ నోటీసుల పేరుతో వేధింపులకు పాల్పడుతోందని గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభావితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంపై నిలదీస్తున్నందుకే ఇప్పటికే తనపై 50కి పైగా అక్రమ కేసులు బనాయించి, 18 రోజులు జైలుకు పంపినా తన గళం తగ్గలేదనే అక్కసుతో ఇప్పుడు ఏ సంబంధం లేని లిక్కర్ కేసులో ఈడీని అడ్డం పెట్టుకుని ఇరికించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎలాంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించినా తాను బెదిరేది లేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం, ధర్మం కోసం నిలబడి కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...

- ఈడీ నోటీసు నిరర్థకం.. ఫ్రెష్ నోటీసు ఇవ్వాలి.

"నాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసు వచ్చింది. గురువారం నాడు విచారణకు హాజరుకావాలని ఫోన్‌లో చెప్పారు. అయితే ఈ నోటీసు పూర్తిగా ఇన్‌ఫ్రక్చువస్. సెప్టెంబర్ 11న హాజరుకావాలని పేర్కొన్న నోటీసును నాకు 18వ తారీఖున అందజేశారు. గడువు ముగిసిన తర్వాత చేరవేయడం అర్థం లేని విషయం. అందుకే నాకు లిఖితపూర్వకంగా ఫ్రెష్ నోటీసు అందజేయాలని అధికారులను కోరాను. అది అందిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుంది.

- లీగల్, డాక్టర్స్ టీమ్‌లను సంప్రదించి నిర్ణయం..

మొన్న 28వ తేదీన నాకు గుండెకు సంబంధించిన ప్రొసీజర్ జరిగింది, అందులో రెండు స్టంట్లు వేశారు. ప్రస్తుతం రికవరీ దశలో ఉన్నాను, ఒత్తిడి తీసుకోవద్దని డాక్టర్లు సూచించారు. ఈ నేపథ్యంలో విచారణకు ఎప్పుడు హాజరుకావాలనే దానిపై నా లీగల్ టీమ్‌తో పాటు వైద్యుల బృందాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటాను. నేను లా చదువుకున్నవాడిని, బాధ్యతగల సీనియర్ రాజకీయ నాయకుడిని కాబట్టి విచారణకు అన్ని విధాలా సహకరిస్తాను. తప్పించుకుని పారిపోయేవాడిని కాను.

-  లిక్కర్ వ్యాపారాలతో సంబంధం లేదు.

లిక్కర్ కేసుకు, నాకు సంబంధం ఏమిటో నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకు కొద్దిగా మద్యం తీసుకునే అలవాటు ఉంది, అంతకుమించి ఏ లిక్కర్ వ్యాపారంతోనూ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈడీ నోటీసులో సత్తెనపల్లికి చెందిన నా సన్నిహితుడు మర్రి సుబ్బారెడ్డి పేరు ప్రస్తావించారు. ఆయన్ను విచారణ పేరుతో పిలిచి మ్యాన్‌హ్యాండిల్ చేసి, బలవంతంగా నా పేరు చెప్పాలని ఈడీ అధికారులు ఒత్తిడి తెచ్చారు. నార్త్ అధికారులకు తెలియక అంబటి రాయుడు పేరు చెప్పాలంటూ హింసించారు. అంటే నన్ను ఏదో రకంగా ఈ కేసులో ఇరికించాలని కొన్ని అదృశ్య శక్తులు తెరవెనుక ప్రయత్నిస్తున్నాయి.

- చంద్రబాబు, లోకేష్, పెమ్మసానిల కక్ష సాధింపు..

ఈడీ స్వతంత్ర సంస్థ అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్, చంద్రబాబులు నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ కుట్ర పన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, గతంలోనూ మీకు అధికారం లేదు. అధికారంలో ఉన్నామని విర్రవీగితే కాలమే సమాధానం చెబుతుంది. మీరు చేస్తున్న ఈ పాపాలకు భవిష్యత్తులో భారీ పరిహారం చెల్లించుకోక తప్పదు.

- ఎన్ని కేసులు పెట్టినా నా గొంతు పెరుగుతూనే ఉంటుంది..

ఈ నేపధ్యంలో ఈడీ, సీబీఐ, సీఐడీ, పోలీసు వ్యవస్థలతో  భయపెట్టాలని చూస్తే బెదిరే వ్యక్తిని కానన్న అంబటి రాంబాబు.. చంద్రబాబును తిట్టానంటూ ఇప్పటికే 30 అక్రమ కేసులు పెట్టారని.. మొత్తంగా 50 నుంచి 60 కేసులు తనపై బనాయించారని మండిపడ్డారు. ఇందులో భాగంగా 18 రోజులు జైల్లో పెట్టినా తన టోన్ తగ్గలేదని.. అందుకే మళ్లీ తననే టార్గెట్ చేస్తున్నారన్న అంబటి...  ఎంతగా టార్గెట్ చేస్తే తన కంఠం అంతగా పెరుగుతుందన్నారు.  గుండెకు రెండు స్టంట్లు పడినా  గుండె ధైర్యం తగ్గలేదన్న ఆయన..  చట్టబద్ధంగా అన్నింటినీ న్యాయస్థానాల్లో ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

Back to Top