స్కామ్‌ల్లో చంద్రబాబు నంబర్‌ వన్‌

తండ్రి బాటలోనే కొడుకు లోకేష్‌

 వంగవీటి నరేంద్ర ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర.

 స్కిల్‌ స్కామ్‌ కేసు అరెస్టు వార్షికోత్సవం పేరుతో క్యాండిల్‌ ర్యాలీలు సిగ్గుచేటు

 స్కిల్‌ ప్రాజెక్టులో విడుదలైన రూ.371 కోట్లకు చంద్రబాబు లెక్క చెప్పాలి

 రూ.243 కోట్లు స్కిల్లర్‌ సంస్థకు ఎలా చేరాయో సమాధానం చెప్పగలరా?

 ఈడీ జప్తు చేసిన రూ.54.74 కోట్ల ఆస్తులపై చంద్రబాబు, లోకేశ్‌ వివరణ ఇచ్చే ధైర్యం ఉందా?

 టీడీపీ ఖాతాలోకి వెళ్లిన రూ.27 కోట్లను ఎందుకు వెనక్కి తీసుకొచ్చారో చెప్పే దమ్ముందా?

 పాత చార్జ్‌షీట్, కొత్త తుది నివేదికలను ప్రజల ముందు పెట్టగలరా?

 ప్రెస్‌మీట్‌లో వంగవీటి నరేంద్ర సవాల్‌

తాడేపల్లి: స్కిల్‌ స్కామ్‌ నుంచి డీఎస్సీ వరకు అవినీతి, అక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా సంబరాలు చేసుకోవడం చంద్రబాబు, లోకేశ్‌కు పరిపాటిగా మారిందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. స్కిల్‌ ప్రాజెక్టులో విడుదలైన రూ.371 కోట్లకు లెక్క చెప్పకుండా, ఈడీ జప్తు చేసిన రూ.54.74 కోట్ల ఆస్తులపై వివరణ ఇవ్వకుండా, పాత చార్జ్‌షీట్‌లను పక్కనపెట్టి కొత్త నివేదికలతో కేసులను తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసుల స్వరూపాన్ని మార్చినా ప్రజల కళ్లకు గంతలు కట్టలేరని తేల్చి చెప్పారు. స్కామ్‌ల్లో చంద్రబాబు నెంబర్‌ వన్‌ కాగా, ఆయన కుమారుడు నారా లోకేష్‌ కూడా అదే బాటలో నడుస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు.

ప్రెస్‌మీట్‌లో వంగవీటి నరేంద్ర ఏమన్నారంటే..:

– క్యాండిల్‌ ర్యాలీలు కాదు.. రూ.371 కోట్లకు లెక్క చెప్పాలి:
చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్టయి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా క్యాండిల్‌ ర్యాలీలు చేయడం సిగ్గుచేటు. ఏదో దేశం కోసం త్యాగం చేసిన నాయకుడికి నివాళులు అర్పించినట్లు 53 దేశాల్లో క్యాండిల్‌ ర్యాలీలు చేస్తున్నామని ఆయన కుమారుడు లోకేశ్‌ చెప్పుకుంటున్నారు. అసలు ముందు స్కిల్‌ ప్రాజెక్టులో ప్రభుత్వం విడుదల చేసిన రూ.371 కోట్లకు లెక్క చెప్పండి. రూ.3,300 కోట్ల ప్రాజెక్టులో రూ.371 కోట్లు ఎందుకు విడుదల చేశారు? అందులో దాదాపు రూ.243 కోట్లు స్కిల్లర్‌ సంస్థకు ఎలా చేరాయి? ప్రైవేట్‌ సంస్థ పెట్టుబడి పెట్టకుండానే ప్రభుత్వ నిధులను ఎందుకు విడుదల చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏటా అరెస్టు వార్షికోత్సవాలు చేసుకోవడం ఎందుకు?’’

రూ.54.74 కోట్ల ఆస్తుల జప్తుపై సమాధానం ఏంటి?:
డిజైన్‌టెక్‌కు సంబంధించిన రూ.31.2 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ, ఎన్‌సీఆర్, ముంబై, పుణేలో బ్యాంకు బ్యాలెన్సులు, షేర్లు, స్థిరాస్తుల్లో మరో రూ.23.54 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. అంటే మొత్తం రూ.54.74 కోట్ల ఆస్తులను ఈడీ ఎందుకు జప్తు చేసింది? టీడీపీ ఖాతాలోకి వెళ్లిన రూ.27 కోట్లను ఎందుకు వెనక్కి తీసుకొచ్చారు? షెల్‌ కంపెనీల ద్వారా నిధులు ఎందుకు మళ్లాయి? బోగస్‌ బిల్లులు ఎవరు తయారు చేశారు? ఎవరు ఆమోదించారు? ఎంట్రీ ఆపరేటర్ల వ్యవహారం, నలుగురి అరెస్టులు, విదేశీ సంస్థలకు నిధులు చేరిన అంశాలపై సమాధానం చెప్పాలి. క్లీన్‌చీట్‌ వచ్చిందని చెబుతున్న లోకేశ్‌.. ఆ లేఖను ప్రజల ముందు పెట్టే ధైర్యం ఉందా?.

పాత చార్జ్‌షీట్‌.. కొత్త తుది నివేదిక ఎక్కడ?:
2014–19 మధ్య నమోదైన స్కిల్, ఫైబర్‌నెట్, మద్యం, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు, చార్జ్‌షీట్లు, ఆడిట్‌ నివేదికలు, వాంగ్మూలాలు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధారాలు లేవంటున్నారు. పాత చార్జ్‌షీట్‌లో ఉన్న అంశాలు తప్పయితే, కొత్తగా ఏ ఆధారాలతో వాటిని ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’గా మార్చారో చెప్పాలి. పాత చార్జ్‌షీట్, కొత్త తుది నివేదికను ఒకేసారి ప్రజల ముందు పెట్టగలరా? ప్రభుత్వం మారిన తర్వాత వరుసగా కేసుల దర్యాప్తు తీరులో మార్పులు ఎందుకు వచ్చాయి? కేసులో ఉన్న వ్యక్తే దర్యాప్తు వ్యవస్థలకు అధిపతిగా ఉండి నిష్పక్షపాత విచారణ జరిగిందని ఎలా చెప్పగలరు?’’

ఆ వాంగ్మూలం తప్పని ఎలా నిర్ధారించారు?:
న్యాయమూర్తి ముందు సెక్షన్‌ 164 కింద ఇచ్చిన వాంగ్మూలం తప్పని ఎలా నిర్ధారించారు? అధికారులు మాట మార్చారని చెబుతున్నప్పుడు పాత, కొత్త వాంగ్మూలాలను ఎందుకు బయటపెట్టడం లేదు? ఆ వాంగ్మూలం మార్చడానికి వచ్చిన కొత్త ఆధారం ఏంటి? మద్యం కేసులో 2015లో జారీ చేసిన జీవో నెం:216, 217కు క్యాబినెట్‌ అనుమతి ఉందా? ప్రివిలేజ్‌ ఫీజు తొలగించడానికి ఆర్థిక శాఖ ఆమోదం ఉందా? ఎంపిక చేసిన మద్యం కంపెనీలకే అధిక ఆర్డర్లు ఎందుకు ఇచ్చారు? దాదాపు రూ.25 వేల కోట్ల ఆదాయ ప్రభావంపై నమోదైన అంశాలకు సమాధానం ఏంటి?. 
 

Back to Top