టీడీపీ నేతల దౌర్జన్యం.. వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయానికి తాళాలు

పెద్దవడగూరులో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంపై జేసీ వర్గీయుల జులుం 

అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడగూరులో టీడీపీ నేతల దౌర్జన్యం చోటుచేసుకుంది. పెద్దవడగూరు మండల వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయానికి జేసీ వర్గీయులు తాళాలు వేశారు. పార్టీ కార్యాలయానికి తాళాలు వేసిన ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్యాలయానికి వేసిన తాళాలు తీసేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తాళాలు వేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. కార్యాలయానికి వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలను అడ్డుకోవడంపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలకు పోలీసులు సహకరిస్తున్నారని, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన పోలీసులు వారికే కొమ్ముకాస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి, తిరిగి తాళాలు తీసేందుకు వెళ్లిన తమను అడ్డుకోవడం పోలీసుల ఏకపక్ష వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Back to Top