నోటీసు ఇవ్వకుండా ఆలయ స్వాధీనం ఎలా?

 దేవాదాయ శాఖకు పిల్లి సూర్యప్రకాష్ సూటి ప్రశ్న

ద్రాక్షారామం: ద్రాక్షారామం మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి తీసుకునేందుకు అధికారులు చేపట్టిన చర్యలపై రామచంద్రపురం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ పిల్లి సూర్యప్రకాష్, పార్టీ నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు. ఆలయాన్ని స్వాధీనం చేసుకునే ముందు ట్రస్టీలకు ముందస్తు సమాచారం లేదా నోటీసులు ఇచ్చారా? కనీసం పత్రికా ప్రకటన అయినా జారీ చేశారా? ట్రస్టీలకు తమ వాదనను వినిపించే అవకాశం కల్పించారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.

ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించే ప్రక్రియ చేపట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఆలయ స్వాధీన ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టంలోని సెక్షన్‌ 6, 43, 44తో పాటు వర్తించే ఇతర నిబంధనలను అధికారులు పూర్తిగా పాటించారా? ఆలయ ఆదాయం, నిర్వహణ విధానం, ట్రస్టీల హక్కులు తదితర అంశాలను పరిశీలించారా? అనే ప్రశ్నలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమాధానం ఇవ్వాలని కోరారు.

ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునే ప్రక్రియలో చట్టబద్ధత, పారదర్శకత, సహజ న్యాయ సూత్రాలు పాటించారా అనే సందేహాలను నివృత్తి చేయాలని పిల్లి సూర్యప్రకాష్, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కోరారు. ట్రస్టీలకు ముందస్తు నోటీసులు ఇచ్చి, వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, చట్టబద్ధమైన విధివిధానాలను పూర్తిగా పాటించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా రామచంద్రపురం మండలం ఎంపీపీ అంబటి భవాని, మాజీ సర్పంచ్ అనిశెట్టి రామకృష్ణ, యండమూరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top