శింగనమల: “ఇది ఎండిన పంట మాత్రమే కాదు... కళ్లముందే ఎండిపోతున్న రైతు ఆశ” అని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. సకాలంలో కాలువలకు నీరు అందక, తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఎండిపోతున్న పంట పొలాలను రైతులు, నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం పొలంలోనే రైతు సభ నిర్వహించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. శింగనమల మండలంలోని నాగలగుడ్డం, వెస్ట్ నరసాపురం, సోదనపల్లి, నరసాపురం గ్రామాల్లో పర్యటించిన సాకే శైలజానాథ్.. నీరు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితిని పరిశీలించారు. రైతులు అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసి సాగు చేపట్టారని, పంట చేతికొచ్చే సమయంలో నీరు అందక ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని సకాలంలో రైతులకు అందించడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. రైతుకు హామీలు కాదు.. ఇప్పుడు కావాల్సింది నీళ్లని, హామీలతో పంట బతకదని, నీరు అందితేనే పంట బతుకుతుందని తెలిపారు. హెచ్‌ఎల్‌సీ కాలువల దిగువ ప్రాంతాల రైతులకు సాగునీటితో పాటు తాగునీటి సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని కోరారు. నీరు అందక పంటలు, పండ్ల తోటలు నష్టపోయిన రైతులకు ప్రత్యేక నష్టపరిహారం అందించాలని సాకే శైలజానాథ్ కోరారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న అన్ని నీటి వనరులను వినియోగించాలని, ఇప్పటికే నష్టపోయిన పంటలపై అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపరిహారంతో పాటు పంటల బీమా కూడా రైతులకు అందించాలని కోరారు. కౌలు రైతు శ్రీరాములు మాట్లాడుతూ.. ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో బీర పంట సాగు చేశానని తెలిపారు. డ్యామ్ నుంచి కాలువలకు నీరు రాక, బోర్లు కూడా అడుగంటిపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. బీర సాగుకు ఎకరాకు సుమారు రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టామని, అప్పులు చేసి సాగు చేసిన పంట నీరు లేక చేతికొచ్చే సమయంలో పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతు నీలకంఠరెడ్డి మాట్లాడుతూ నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశానని, బోర్లు అడుగంటిపోవడంతో పంట ఎండిపోయిందని తెలిపారు. ఎకరాకు సుమారు రూ.30 వేల పెట్టుబడి పెట్టామని, పంట నష్టంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశనగ రైతు సుంకర వీరాంజనేయులు మాట్లాడుతూ పది ఎకరాల్లో వేరుశనగ సాగు చేశానని, ఎకరాకు సుమారు రూ.35 వేల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. వర్షాలు లేక, కాలువలకు నీరు రాక పంట పూర్తిగా ఎండిపోయిందని, కుటుంబ పోషణ కష్టంగా ఉన్నప్పటికీ అప్పులు చేసి సాగు చేశామని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. చీని రైతు చిట్యాల బాలు మాట్లాడుతూ ఐదు ఎకరాల్లో చీని తోట సాగు చేస్తున్నానని, కాలువలకు నీరు రాక, బోర్లు అడుగంటిపోవడంతో చెట్లు పూర్తిగా ఎండిపోయాయని తెలిపారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినా చివరకు అప్పులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాగలగుడ్డ తండాకు చెందిన రైతు గట్టు నాయక్ మాట్లాడుతూ నాలుగు ఎకరాల్లో చీని తోట సాగు చేశానని, కాపు వచ్చే సమయంలోనే బోర్లలో నీరు అడుగంటిపోవడంతో చెట్లు ఎండిపోయాయని తెలిపారు. ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టినా కనీసం పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని, గ్రామంలో తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిశీలించాలని సాకే శైలజానాథ్ కోరారు. తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం, పంటల బీమా అందించడంతో పాటు సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. “ప్రకృతి కరువు రావచ్చు... కానీ రైతు విషయంలో ప్రభుత్వానికి ముందుచూపు కరువైపోకూడదు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పరంధామరెడ్డి, బొమ్మన శ్రీరాంరెడ్డి, వంశీ గోకులరెడ్డి, కంచిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులు నాయక్, గురుమూర్తిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎన్.వి.నారాయణ, జగన్‌మోహన్‌రెడ్డి, బండి శ్రీనివాసులు, శివమ్మ, వెంకటరాముడు, రమాదేవి, సరస్వతమ్మ, లక్ష్మీదేవి, శంకర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, రాజు, విజయ్‌కుమార్, తిరుపతయ్య, వెంకటనారాయణ, కోటిరెడ్డి, బాలకృష్ణ, అబ్దుల్లా, ఆలీ, గోపాల్, వీరాంజి, చెన్నారెడ్డి, నాగన్న, శ్రీకాంత్‌రెడ్డి, రామకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.