విశాఖపట్నం: ‘వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన’ పేరుతో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల బీసీ నాయకుల ఆత్మీయ సమావేశం విశాఖపట్నంలో నిర్వహించారు. పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో 34 శాతం బీసీ రిజర్వేషన్లు, బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీలు, బీసీ నేతలపై జరుగుతున్న దాడులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశాలపై చర్చించారు. బొడ్డేడ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణు, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితర ఉత్తరాంధ్ర జిల్లాల బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీలకు న్యాయం చేసింది వైయస్ఆర్‌సీపీయే: ధర్మాన ప్రసాదరావు బీసీల పార్టీగా టీడీపీ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. బీసీలకు ఆ పార్టీ చేసిందేమీ లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బీసీలకు వైయస్ఆర్‌సీపీ చేసిన మేలు, టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. పేదల విద్య, వైద్యం కోసం వైయస్ రాజశేఖర్‌రెడ్డి, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల భూమిని కొంతమంది వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని, విశాఖ నగరంలో భూములు ఎవరికి ఇచ్చారో ప్రభుత్వం వెల్లడించాలని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల భూములు ఇతరుల పాలవుతున్నాయని, బీసీలు సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. రాజధానిలో బీసీలకు ఎకరం భూమి ఉందా అని ప్రశ్నిస్తూ.. ఇటీవల వర్షాలకు రాజధాని చెరువును తలపించిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ గణనీయమైన ఫలితాలు సాధిస్తుందని అన్నారు. చంద్రబాబు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారు: చెల్లుబోయిన వేణు బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు విమర్శించారు. బీసీలను చంద్రబాబు విస్మరించారని, 2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీసీ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వలేదని అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు 24 శాతానికి పడిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. తప్పు చేసి ఆ నెపాన్ని వైయస్ జగన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెల్లుబోయిన వేణు విమర్శించారు. 34 శాతం రిజర్వేషన్లు నిలబడవని తెలిసినా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. త్వరలో వైయస్ఆర్‌సీపీ బీసీ గర్జన సభ: రమేష్ యాదవ్ త్వరలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తెలిపారు. చెల్లని జీవోలు ఇచ్చి బీసీలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. బీసీ నాయకులతో పాలాభిషేకాలు చేయించి రాజకీయ డ్రామాలు నిర్వహించారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. టీడీపీ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుందని రమేష్ యాదవ్ ఆరోపించారు. బీసీల హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం పార్టీ తరఫున పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. బీసీ నాయకుల ఐక్య కార్యాచరణకు పిలుపు సమావేశంలో పాల్గొన్న నాయకులు బీసీలకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం, రిజర్వేషన్ల అంశంపై విస్తృతంగా చర్చించడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమన్వయంతో సిద్ధం కావడంపై దృష్టి సారించారు. త్వరలో నిర్వహించనున్న బీసీ గర్జన సభను విజయవంతం చేసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బీసీ నాయకులు, కార్యకర్తలను సమీకరించాలని నిర్ణయించారు.