నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని అధికారిని నియమించారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకే నందన్‌ను ఎఫ్‌ఏసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా కొనసాగిస్తున్నారని విమర్శించారు. సుమారు 8 లక్షల జనాభా, రూ.150 కోట్ల బడ్జెట్ కలిగిన నెల్లూరు కార్పొరేషన్‌కు జనాభా ప్రాతిపదికన ఏడీఎంఏ స్థాయి అధికారిని నియమించాల్సి ఉండగా, గ్రేడ్–1 అర్హత కలిగిన అధికారికి బాధ్యతలు అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. 19 నెలలుగా ఇన్‌చార్జి కమిషనర్‌గానే కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి నారాయణ సొంత నియోజకవర్గమైన నెల్లూరు కార్పొరేషన్‌కు ఒక్క ఐఏఎస్ అధికారిని కూడా నియమించలేకపోయారా అని చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. కార్పొరేషన్ బడ్జెట్‌ను అడ్డగోలుగా వినియోగిస్తున్నారని, చెత్త నిర్వహణ, స్వీపింగ్ మిషన్లు, చెట్ల నిర్వహణ, రంగులు, విఆర్‌సీ స్కూల్ బస్సులు తదితర కాంట్రాక్టుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి ఆదేశాలతోనే నిధుల దుర్వినియోగం జరుగుతోందని విమర్శించారు. నెల్లూరు బిట్–2లో పంట కాలువను నారాయణ ఎడ్యుకేషన్‌లో కలుపుకున్నారని, తాజాగా సర్వే నంబర్ 650లో పంట కాలువకు చెందిన సుమారు అర ఎకరం భూమిని కేటాయించే ప్రయత్నం జరిగిందని చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ఆ స్థలంలో టీడీపీ కార్యాలయం నిర్మాణానికి కేటాయించాలని కలెక్టర్‌కు లేఖ రాసిన పరిస్థితి ఉందన్నారు. ఇసుక, గ్రావెల్, అక్రమ మద్యం, రేషన్ బియ్యం తదితర అంశాల్లో మాఫియాలు ఏర్పాటు చేసి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన.. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.