అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌ బిల్లును వెంటనే అమలు చేయాలి

 న్యాయ‌వాదుల దీక్ష‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత వడ్డి రఘురాం సంఘీభావం

 తాడేపల్లిగూడెం: అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌ బిల్లు కోసం న్యాయవాదులు ఆందోళన చేస్తున్న పరిస్థితిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వడ్డి రఘురాం డిమాండ్‌ చేశారు. న్యాయవాదులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌ బిల్లును వెంటనే ఆమోదించి అమలు చేయాలని కోరారు. న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

రాష్ట్రంలోని ప్రతి న్యాయవాదికి సమానమైన రక్షణ, గౌరవం, సంక్షేమం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వడ్డి రఘురాం అన్నారు. న్యాయవాదులు తమ భద్రత, సంక్షేమం కోసం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. న్యాయవాదుల విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమాన రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని వడ్డి రఘురాం తెలిపారు. డాక్టర్‌ వైయ‌స్‌ఆర్‌ లా నేస్తం పథకం ద్వారా జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించామని, లా నేస్తం కింద రూ.49.51 కోట్ల మేర సహాయం చేసినట్లు పేర్కొన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్ల అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ కార్పస్‌ను ఏర్పాటు చేశామని, కోవిడ్‌ సమయంలోనూ సంక్షేమ నిధి ద్వారా న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.

న్యాయవాదుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మరింత ఆందోళనకు దారితీస్తుందని వడ్డి రఘురాం అన్నారు. అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌ బిల్లును తక్షణమే ఆమోదించి అమలు చేయాలని, న్యాయవాదుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం వారు చేస్తున్న పోరాటానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Back to Top