రాజమహేంద్రవరం: త్రీటౌన్ పోలీసుల తీరును నిరసిస్తూ మాజీ ఎంపీ, వైయస్ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి మార్గాని భరత్‌రామ్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పాత ఐదో డివిజన్ వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి కోన రాజ్యలక్ష్మి భర్త కంబాలపేట బాబీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబీ వద్ద రూ.45 వేలు ఉన్నాయనే కారణంతో పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఏ నిబంధనల ప్రకారం జరిగిందో స్పష్టం చేయాలని భరత్‌రామ్ నిలదీశారు. ఎన్నికల నిబంధనలు చూపించాలని డిమాండ్ చేస్తూ, ఎలాంటి కారణంతో బాబీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారో సమాధానం చెప్పే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. సీఐ అప్పారావు వెంటనే క్షమాపణ చెప్పి, బాబీ కుటుంబాన్ని ఇంటి వద్దకు చేర్చే వరకు వైయస్ఆర్‌సీపీ ఆందోళన కొనసాగుతుందని భరత్‌రామ్ స్పష్టం చేశారు. ఆయనకు మద్దతుగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు ఒక వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి కుటుంబ సభ్యుడిని ఇలా అదుపులోకి తీసుకోవడం సరికాదని భరత్‌రామ్ పేర్కొన్నారు. ఒకవైపు టీడీపీ అభ్యర్థులు కోట్ల రూపాయలు ఓటర్లకు పంపిణీ చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనను ఇంతటితో వదిలిపెట్టేది లేదని, అవసరమైతే పోలీసులపై హైకోర్టును ఆశ్రయించి ప్రైవేట్ కేసు దాఖలు చేస్తామని భరత్‌రామ్ హెచ్చరించారు. మేయర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను భయపెట్టేందుకు అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇటువంటి బెదిరింపులకు వైయస్ఆర్‌సీపీ భయపడదని, పాత ఐదో డివిజన్ నుంచి రాజ్యలక్ష్మి విజయం సాధిస్తారని స్పష్టం చేశారు.