వైయస్ఆర్‌సీపీ మద్దతుదారుడిని బలిపశువు చేసిన ఆర్వో

విశాఖ జిల్లా:  గంభీరం గ్రామంలో సర్పంచ్ ఎన్నిక విషయంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగేలా ఆర్వో వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి సానుభూతిపరుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారుడైన బోయి వెంకటరమణను బలిపశువుగా చేశారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు మండిపడుతున్నాయి.

గంభీరం సర్పంచ్ పదవికి బోయి వెంకటరమణ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఆర్వో సూచన మేరకు ఒక సెట్ నామినేషన్‌ను వెంకటరమణ విత్‌డ్రా చేసుకున్నారు. అనంతరం ఆర్వో తన మాట మార్చి, వెంకటరమణ నామినేషన్ ఉపసంహరించుకున్న విషయాన్ని పక్కనపెట్టి టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తాను ఆర్వో సూచన మేరకే ఒక సెట్ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నానని, అనంతరం తనకు అన్యాయం జరిగిందని వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్వో తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఎన్నికల ప్రక్రియలో అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాలరాసేలా వ్యవహరించడం సరికాదని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. గంభీరం ఘటనపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వాస్తవాలను పరిశీలించి, న్యాయం చేయాలని కోరుతున్నారు.

Back to Top