అనంతపురం: కల్యాణదుర్గం నియోజకవర్గం తిమ్మాపురం వైయస్ఆర్‌సీపీ మద్దతుతో సర్పంచ్‌గా గెలిచిన గౌని రేణుకపై హత్యాయత్నం జరిగిందని వైయస్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. సుమారు వంద మంది టీడీపీ వర్గీయులు సర్పంచ్ ఇంటిపై దాడికి పాల్పడి ఫర్నీచర్, ఇంటి అద్దాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు గాయపడగా, గౌని రేణుక దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గౌని రేణుక 29 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని వైయస్ఆర్‌సీపీ వర్గాలు తెలిపాయి. ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డాయి. ఒకవైపు ఆర్వో కాంతరాజుపై బెదిరింపులు, మరోవైపు ఎన్నికైన వైయస్ఆర్‌సీపీ సర్పంచ్‌పై దాడి జరుగుతున్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. కల్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల విషయంలోనూ అధికార పార్టీ ఒత్తిళ్లు కొనసాగుతున్నాయని వైయస్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ఒక పంచాయతీలో టీడీపీ మద్దతుదారు 132 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించినప్పటికీ, యాటకల్లు పాఠశాలలో 156 బ్యాలెట్ పేపర్లు లభించాయని తెలిపారు. వాటిలో వైయస్ఆర్‌సీపీ మద్దతుదారు గుర్తుపై ఓట్లు ఉన్నాయని, ఆర్వో సంతకాలతో ఉన్న బ్యాలెట్ పేపర్లను పక్కనపెట్టి అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫలితాన్ని తారుమారు చేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న ఈ పరిణామాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వైయస్ఆర్‌సీపీ నేతలు కోరారు. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌పై దాడి, అధికారులపై ఒత్తిళ్లు, బ్యాలెట్ పేపర్ల వ్యవహారం వంటి ఘటనలపై పోలీసులు, ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.