శ్రీకాళహస్తిలో వరుస దాడులు.. చైర్మన్ అభ్యర్థులే టార్గెట్ 

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులపై వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పోలింగ్ రోజున వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్ అభ్యర్థి దాస్‌పై దాడి జరగగా, తాజాగా కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి పాండురంగ వడపగారిపై దాడి జరిగింది. శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవికి పోటీ చేసిన పాండురంగ వడపగారిపై కారు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఒకవైపు పోలింగ్ రోజే చైర్మన్ అభ్యర్థిపై దాడి, మరోవైపు కౌంటింగ్‌కు ముందు మరో అభ్యర్థిపై దాడి జరగడం ఎన్నికల భద్రతపై అనేక అనుమానాలకు తావిస్తోంది. అభ్యర్థులు, వారి ఏజెంట్లు కౌంటింగ్‌కు హాజరుకాకుండా భయపెట్టే ప్రయత్నమా, లేక కౌంటింగ్ ప్రక్రియను ప్రభావితం చేసే కుట్రలో భాగమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వరుస దాడులపై అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు. దాడుల్లో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నవంబర్ 30న జరగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం, పోలీసులపై ఉంది. ప్రజాస్వామ్యంలో గెలుపోటములను నిర్ణయించేది ప్రజల ఓట్లు తప్ప దాడులు, బెదిరింపులు కాదనే విషయాన్ని అధికారులు నిరూపించాల్సిన అవసరం ఉంది.

Back to Top