మంత్రి ఒత్తిడితో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ

 తప్పును ఒప్పుకున్న ఆర్వో

అనంతపురం: మంత్రి పయ్యావుల కేశవ్ ఒత్తిడితో ఉరవకొండ మేజర్ పంచాయతీలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు ఎడాపెడా తిరస్కరించారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. 5, 9, 14 వార్డులకు వైయ‌స్ఆర్‌సీపీ తరఫున దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు తిరస్కరించారని తెలిపారు.

నామినేషన్లు సక్రమంగానే ఉన్నప్పటికీ తిరస్కరించామని ఉరవకొండ ఆర్వో సత్యనారాయణ అంగీకరించినట్లు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా నన్ను క్షమించండి అంటూ ఆర్వో సత్యనారాయణ చెప్పారని పేర్కొన్నారు.

నిబంధనలకు అనుగుణంగా ఉన్న నామినేషన్లను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో అధికారులు సమాధానం చెప్పాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు నిలదీశారు. మంత్రి పయ్యావుల కేశవ్ కనుసన్నల్లో ఎన్నికల అధికారులు పనిచేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను ఎన్నికల బరిలో లేకుండా చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.

ఎన్నికల ప్రక్రియలో అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చూడాలని, ఉరవకొండలో జరిగిన నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి న్యాయం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరారు.

Back to Top