కొమరాడలో టీడీపీ విజయోత్సవ ర్యాలీలో ఉద్రిక్తత

వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరుల కుటుంబంపై దాడి 

పార్వతీపురం మన్యం జిల్లా: కొమరాడ మండలం కల్లికోట పంచాయతీలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీజే శబ్దం తగ్గించాలని కోరిన వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరుడు కరుణాకర్ కుటుంబంపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబం తెలిపింది. ఎన్నికల సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఏజెంట్‌గా పనిచేశాడన్న కారణంతోనే తమపై దాడి చేశారని కరుణాకర్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంట్లో చిన్నపిల్లలు భయపడుతున్నారని, నిద్రపోలేకపోతున్నారని చెబుతూ డీజే శబ్దాన్ని తగ్గించాలని కోరినందుకు టీడీపీ శ్రేణులు మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించారని బాధితులు తెలిపారు. ఇంట్లోకి చొరబడి నలుగురు కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారని, తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు.

దాడి ఘటనపై సమాచారం అందించినప్పటికీ ఎస్సై స్పందించలేదని బాధితులు తెలిపారు. గాయపడిన వారికి వైద్యం కోసం 108కు ఫోన్ చేసినా సకాలంలో అంబులెన్స్ రాలేదని చెప్పారు. తెల్లవారుజామున అంబులెన్స్ వచ్చిన సమయంలోనూ కొందరు అడ్డుతగిలారని, వీడియో తీస్తానని డ్రైవర్ హెచ్చరించడంతోనే వారు పక్కకు తప్పుకున్నారని బాధితులు వెల్లడించారు.

దాడిలో గాయపడిన నలుగురు ప్రస్తుతం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్నికల విజయోత్సవం పేరుతో ఇళ్లలోకి చొరబడి కుటుంబంపై దాడి చేయడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Back to Top