నరసరావుపేట ఎన్నికల్లో పోలీస్ వ్యవస్థతోనే మా పోరాటం..

మా పోరాటం పార్టీలతో కాదు వ్యవస్ధలతోనే

నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు మాపై అడుగడుగునా వేధింపులు

దీనిపై భవిష్యత్తులో కచ్చితంగా బదులు తీర్చుకుంటాం

మాజీ ఎమ్మెల్యే గోపి రెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టీకరణ

నరసరావుపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన  వైయస్సార్సీపీ వైద్య విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.

ఎంపీ లావు కృష్ణదేవరాయలు కనుసన్నల్లోనే నరసరావుపేటలో రిగ్గింగ్ జాతర.

అట్టుకి అట్టున్నర ఇవ్వాల్సిందే.. లేకపోతే కేడర్‌ను కాపాడుకోలేం: 

హెచ్చరించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.

నరసరావుపేట : నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతలు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, తాము కేవలం టీడీపీతోనే కాకుండా మొత్తం పోలీస్ వ్యవస్థతో పోరాటం చేయాల్సి వచ్చిందని వైయస్సార్సీపీ వైద్య విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. నరసరావుపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆధారాలు, వీడియో విజువల్స్‌తో సహా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సారధ్యంలోనే నామినేషన్ల దగ్గర నుంచి పోలింగ్ వరకు అడుగడుగునా అధికార దుర్వినియోగం, రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ జరిగాయని ఆయన మండిపడ్డారు. నిజాయితీగా ఎన్నికలు జరపాలని తాను విసిరిన సవాల్‌కు భయపడి ఎంపీ పారిపోయారని, ఓటమి భయంతోనే మధ్యాహ్నం 12 గంటల తర్వాత 34 వార్డుల్లో దొంగ ఓట్ల జాతర నడిపించారని ఆరోపించారు. కౌంటింగ్‌లో అక్రమాలకు పాల్పడితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చాక ఈ అరాచకాలకు కచ్చితంగా 'అట్టుకి అట్టున్నర' చొప్పున బదులు తీర్చుకుంటామని గోపిరెడ్డి హెచ్చరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఆయన ఏమన్నారంటే... 

ఇది పోలీసు వ్యవస్థపై చేసిన పోరాటం:

ఈ ఎన్నికలు రెండు పార్టీల మధ్య జరిగినవి కావు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రభుత్వ, పోలీస్ వ్యవస్థలపై పోరాటం చేయాల్సి వచ్చింది. ఇందులో టీడీపీ కేవలం నిమిత్తమాత్రమే. పోలింగ్‌కు ముందు రోజే, అంటే 25వ తేదీ రాత్రే పోలీసులు మా పోలింగ్ ఏజెంట్లు, ముఖ్య నాయకులను అక్రమంగా లిఫ్ట్ చేశారు. ఒక్కో స్టేషన్‌లో కనీసం 20 మందికి తగ్గకుండా మా నాయకులను అరెస్ట్ చేసి నిర్బంధించారు. నరసరావుపేటలో ఉండే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు కానీ, బయటి నియోజకవర్గాల నుంచి వచ్చిన రౌడీ మూకలకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు.

ఎంపీ లావు కృష్ణదేవరాయలే సూత్రధారి:

నాకు ఇప్పుడు 57 ఏళ్లు. ఎన్నో ఎన్నికలు చూశాను, కోడెల శివప్రసాదరావు ఉన్నప్పుడు కూడా ఇంతటి అరాచకపు ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. ఈ మొత్తం కుట్రకు మూలకారకుడు, సూత్రధారి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. నరసరావుపేట మున్సిపాలిటీలో వైయస్సార్సీపీకి 23 నుంచి 27 సీట్లు వస్తాయని, మున్సిపల్ చైర్మన్ పీఠం మాదేనని ఇంటెలిజెన్స్ రిపోర్టులు రావడంతో అధికార పార్టీలో వణుకు మొదలైంది. 'నువ్వే నామినేషన్లు వేయించి ఇంతదూరం తెచ్చావు' అని ఇన్‌ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు ఎంపీని నిలదీశారు. దీంతో తన పరువు కాపాడుకోవడానికి ఎంపీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ దారుణాలకు ఒడిగట్టారు. మాచర్ల, వినుకొండ, చిలకలూరిపేట నుంచి రౌడీలను దింపారు. 'మీ ఎంపీ గారి ఆర్డర్స్ ప్రకారమే మేము వచ్చాం' అని మాచర్ల నుంచి వచ్చిన నేతలు మా 31వ వార్డు అభ్యర్థితో స్వయంగా చెప్పారు. ట్విట్టర్‌లో నీతులు, మాయమాటలు చెప్పే ఎంపీ.. తెరవెనుక ఇంతటి నీచ రాజకీయం నడిపారు.

అధికారుల అండతో 25 వేల దొంగ ఓట్లు:

ఉదయం 11:30 గంటల వరకు అన్ని వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఎప్పుడైతే ఓటర్లు వైయస్సార్సీపీ వైపు మొగ్గారని అర్థమైందో, మధ్యాహ్నం 12 గంటల నుంచి సుమారు 34 వార్డుల్లో బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, సైక్లింగ్ మొదలుపెట్టారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మున్సిపల్ అధికారుల లెక్కల ప్రకారమే 46.23 శాతం పోలింగ్ నమోదైతే, ఆ తర్వాత ఒక్కసారిగా 69.58 శాతానికి పెరిగింది. అంటే ఏకంగా 23 శాతం.. దాదాపు 25 వేల ఓట్లను రిగ్గింగ్ చేసుకున్నారు. ఒక ఎస్పీ స్థాయి అధికారి మూడు కార్లలో వచ్చి ఓటర్లను ఖాళీ చేయించి సీఐకి అప్పగిస్తే, ఆ సీఐ టీడీపీ వాళ్లను లోపలికి పంపాడు. అడిషనల్ ఎస్పీ 48వ వార్డులో, డీఎస్పీ జొన్నలగడ్డ గ్రామంలో రెండు గంటల పాటు బూత్‌ల వద్ద కూర్చుని తలుపులు వేయించి మరీ దొంగ ఓట్లు వేయించారు. ఓటు వేయనివ్వలేదని రోడ్డుపై బైఠాయించిన ఎస్సీ, ఎస్టీ మహిళలపై డీఎస్పీ లాఠీఛార్జ్ చేయించారు. రొంపిచెర్ల మండలం ఆరేపల్లిలో మహిళల తలలు, పక్కటెముకలు విరగ్గొట్టారు. ఐపీఎస్ కేడర్‌కు ఉన్న గౌరవాన్ని ఈ అధికారులు మంటగలిపారు.

అడుగడుగునా అక్రమాలకు వీడియోలే సాక్ష్యం:

నేను విజువల్స్‌తో సహా అన్ని అక్రమాలను బయటపెడుతున్నాను. 33వ వార్డు మా అభ్యర్థి మారుడి శివారెడ్డి రిగ్గింగ్‌ను అడ్డుకుంటున్నాడని మధ్యాహ్నం ఒంటిగంటకే తీసుకెళ్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. 18వ వార్డులో ఏజెంట్ ఫారాలు చూపిస్తున్నా మా ఏజెంట్లను పోలీసులు బయటకు లాగేశారు. 27వ వార్డులో మా అభ్యర్థి వల్లపు శివలక్ష్మి ఎదుటే దొంగ ఓట్లు వేసుకున్నారు. 42వ వార్డులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జాన్ సైదా ఏకంగా 18 ఏళ్లు నిండని స్కూలు పిల్లలను, మైనర్లను తీసుకొచ్చి ఓటింగ్ లైన్‌లో నిలబెట్టాడు. కేశనపల్లి గ్రామానికి చెందిన జానవి అనే రూరల్ ఓటర్ పట్టణంలో దొంగ ఓటు వేసి బయటకు వస్తుంటే పోలీసులే దగ్గరుండి కాపాడి పంపించారు. ఎస్ఎన్ కాలేజీ హాస్టల్ పిల్లలకు రెండు రోజుల ముందు గంజాయి అమ్మి, ఆ గంజాయి బ్యాచ్‌తో రిగ్గింగ్ చేయించారు. చివరకు టీడీపీ రెబల్ అభ్యర్థి అఖిలను కూడా ఓటు వేయనివ్వకుండా బయటకు గెంటేశారు.

అభివృద్ధి శూన్యం.. సవాల్‌కు భయపడి పలాయనం:

ఈ రెండున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం నరసరావుపేటలో కనీసం ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క ఇళ్ల పట్టా ఇవ్వలేదు. మల్లమ్మ సెంటర్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా బాగు చేయించలేని ఎంపీ.. గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన చీరాల రోడ్డు, కేంద్రీయ విద్యాలయం తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో మా ప్రభుత్వ హయాంలో టీడీపీ బలంగా ఉన్న గ్రామాల్లోనూ ప్రశాంతంగా ఎన్నికలు జరిపించాం. నిజాయితీగా ఎన్నికలు జరపాలని నేను విసిరిన సవాల్‌ను స్వీకరించి 48 వార్డుల్లో అభ్యర్థులను నిలబెడితే, ప్రజాతీర్పుకు భయపడి ఎంపీ పారిపోయారు.

కౌంటింగ్‌లో అక్రమాలు చేస్తే సహించం.. కచ్చితంగా బదులు తీర్చుకుంటాం:

ఈ నేపధ్యంలో కౌంటింగ్‌లో కూడా అక్రమాలకు పాల్పడాలని చూస్తే మేము చూస్తూ ఊరుకోం, పెద్ద ఎత్తున ప్రతిఘటించి అడ్డుకుంటామని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రేపు వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక దీనికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని.. అట్టుకి అట్టున్నర ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. వాస్తవానికి దీనికి మేం వ్యతిరేకమైనా... ఈ సంప్రదాయాన్ని కొనసాగించకపోతే రాజకీయాల్లో మనుగడ కోల్పోయి, మా కేడర్‌కు సమాధానం చెప్పుకోలేమన్నారు.  ఈరోజు అధికార మదంతో విర్రవీగుతున్న వాళ్లు రేపు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఈ బాధలు, కష్టాలు తప్పకుండా అనుభవిస్తారని హెచ్చించారు.

Back to Top