స్థానిక ఎన్నికల్లో కూటమి రాక్షస క్రీడ

రెండున్నరేళ్లలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత 

అందుకే ఓటమి భయంతో స్ధానిక ఎన్నికల్లో అక్రమాలు, దాడులకు తెరతీసిన కూటమి 

ప్రజాగ్రహంతో 2029లో పతనం ఖాయం

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టీకరణ

శ్రీకాకుళం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.

అధికార దుర్వినియోగంతో గెలిచినా గౌరవం దక్కదు

ఇంత నిర్బంధంలోనూ వైఎస్సార్‌సీపీ విజయాలే ప్రజావ్యతిరేకతకు నిదర్శనం

రాజ్యాంగ పరిరక్షణ దినం నాడే నన్ను అక్రమంగా నిర్బంధించారు

అక్రమాలకు పాల్పడిన అధికారులకు 2029 తర్వాత చట్టపరంగా శిక్ష తప్పదు 

తేల్చి చెప్పిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ల పాలన తర్వాత ప్రజల విశ్వాసాన్ని కోల్పోయామన్న భయంతోనే ఓటర్ల జాబితా తయారీ నుంచి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వరకు అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు గురిచేయడం, వేసిన నామినేషన్లను అధికారుల సహకారంతో అక్రమంగా తిరస్కరించడం, పోలింగ్ రోజున ఏజెంట్లను పోలీసుల ద్వారా నిర్బంధించి దౌర్జన్యాలకు పాల్పడటం వంటి రాక్షస పాలనను కొనసాగించారని మండిపడ్డారు. చివరికి కౌంటింగ్ కేంద్రాల్లోనూ లైట్లు ఆర్పేసి, బ్యాలెట్ కట్టలను తారుమారు చేస్తూ.. ఓడిన కూటమి అభ్యర్థులకు గెలిచినట్లు సర్టిఫికెట్లు ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఇంతటి నిర్బంధం, రక్తపాతం సృష్టించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడమే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనమని, రానున్న 2029 ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..:

ఓటర్ లిస్ట్ నుంచి నామినేషన్ల వరకు అడుగడుగునా అక్రమాలే: 
కూటమి పార్టీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మిగిలిన రెండున్నరేళ్లలోనైనా పూర్తి చేస్తాయనే ఆశతో కొందరు ఓపికతో ఎదురుచూస్తున్నారు. కానీ చంద్రబాబు గారు మాత్రం తమ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని తమకు తామే చెప్పుకున్నట్టుగా ఈ ఎన్నికలను నిర్వహించారు. ఒకే కుటుంబంలోని ఆరు ఓట్లను ఆరు వేర్వేరు డివిజన్లలోకి మార్చి అసలు పౌరులు ఓటు వేయలేని పరిస్థితి కల్పించారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం నిబంధనలకు విరుద్ధంగా వార్డుల విభజన చేసి, తప్పుడు లెక్కలతో రిజర్వేషన్లను మార్చేశారు. బలమైన ప్రత్యర్థి అభ్యర్థులను ముందే బెదిరించి, వారి వృత్తులు, వ్యాపారాలను దెబ్బతీస్తామని భయపెట్టారు. తెగించి నామినేషన్లు వేసిన వారి తలలు పగలగొట్టించి రాక్షస పాలన సాగించారు. కొన్ని చోట్ల అభ్యర్థుల అనుమతి లేకుండానే రిటర్నింగ్ అధికారులతో నామినేషన్లను విత్‌డ్రా చేయించారు.

పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో దౌర్జన్యాలు: 
పోలింగ్ రోజున రిటర్నింగ్ అధికారి నియామక పత్రాలు ఇచ్చిన ఏజెంట్లను కూడా పోలీసుల ద్వారా స్టేషన్లలో నిర్బంధించి, అధికార పార్టీ దౌర్జన్యాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కౌంటింగ్ హాళ్లలో లైట్లు ఆర్పేసి ఓట్ల కట్టలను కలిపేస్తున్నారు. స్వల్ప మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిస్తే, మళ్లీ మళ్లీ రీకౌంటింగ్ పేరుతో తప్పుడు లెక్కలు చూపి ఓడిన కూటమి అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. చిన్న ఘర్షణ నెపంతో పోలీసులను కౌంటింగ్ హాల్‌లోకి పంపి మా ఏజెంట్లను బయటకు లాగేస్తున్నారు. రెండున్నరేళ్ల పాలనపై నమ్మకం లేకే హింస, అధికార దుర్వినియోగంతో గెలవాలని చూశారు. మోదీ కంటే సీనియర్‌ని అని చెప్పుకునే చంద్రబాబు ఇమేజ్ ఈ ఎన్నికలతో దేశవ్యాప్తంగా డ్యామేజ్ అయింది. స్థానిక ఎన్నికలను సజావుగా నిర్వహించలేని చంద్రబాబు అసమర్థతను జాతీయ మీడియా ఎండగట్టింది.

రాజ్యాంగ దినోత్సవం నాడే నాపై అక్రమ నిర్బంధం: 
కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలను అడ్డుకోవడానికి నేను జనరల్ ఏజెంట్‌గా వెళ్తానని చెబితే, సీఎం పేషీ నుంచి ఎస్పీ, కలెక్టర్‌లకు ఆదేశాలు ఇప్పించి నన్ను అక్రమంగా గృహ నిర్బంధం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ దినం నాడే నన్ను నిర్బంధించి రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పాల్పడ్డారు. జనరల్ ఏజెంట్ అయిన నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి ఏ అధికారి అయినా ఆన్ పేపర్ ఆదేశాలు ఇవ్వగలరా? ఎన్నికల నిబంధనలను అతిక్రమించింది నేను కాదు.. మీ అధికారులే తుంగలో తొక్కారు. అక్రమ కేసులు పెట్టి భయపెట్టడం ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. నిన్న శ్రీకాకుళంలో పోలింగ్ సజావుగానే జరిగింది. అక్కడ రిగ్గింగ్ జరిగిందని నేను అనడం లేదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా నన్ను నిర్బంధించడం మాత్రం ఘోర తప్పిదం.

నిర్బంధంలోనూ వైయ‌స్సార్‌సీపీ విజయాలే ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం: 
"మీరు ఇన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రముఖులు ఉన్న జిల్లాల్లోనూ ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించారు. అసెంబ్లీలో మా సీట్లు లెక్కేయకండి.. మొన్నటి ఎన్నికల్లో 40 శాతం ఓట్లు సాధించిన బలమైన ప్రతిపక్షం మాది. గతంలో మీరు పోటీ చేయని స్థానిక ఎన్నికల్లో వైఎస్ జగన్ అక్రమాలు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏనాడూ ప్రజలను హింసించే చర్యలకు పాల్పడలేదు. మీ కుమారుడి మాటలు వినో, మరెవరి బోధనలతోనో మీ అనుభవాన్ని స్వల్ప ప్రయోజనాలకు వాడుతున్నారు. రాష్ట్రంలో జరిగిన హింసకు, మరణాలకు ముఖ్యమంత్రిగా మీరే పూర్తి బాధ్యత వహించాలి.

2029 తర్వాత కూటమి పతనం ఖాయం.. అక్రమార్కులకు శిక్ష తప్పదు:  
ఈ నేపధ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదని... 2029 ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతాయని... అప్పుడు మీ ఆటలు సాగవని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఇప్పుడు మీరు చేస్తున్న అరాచకాలతో 2029లో మీ ఓటమికి మీరే బలమైన పునాది వేసుకుంటున్నారని,  2029 తర్వాత మీరు ప్రతిపక్షంలో కూర్చోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు రేపు శ్రీకాకుళంలో జరగబోయే కౌంటింగ్‌ ప్రక్రియ లో ఏజెంట్లు, అడ్వకేట్లు, నేషనల్ మీడియా సమక్షంలో అత్యంత పక్కాగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులను సైతం ఉపేక్షించేది లేదని, పై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం కేసులు నమోదు చేయకపోతే ప్రైవేట్ కేసులు నమోదు చేసి...  2029 తర్వాత చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారంతా కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు" అని ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు.

Back to Top