కనకదాసు స్ఫూర్తితో జ‌గ‌న్ సామాజిక న్యాయం.. చంద్ర‌బాబుది క్రెడిట్ చోరీ

వైయ‌స్సార్‌సీపీ ప్ర‌భుత్వంలోనే అధికారికంగా భ‌క్త క‌న‌క‌దాసు జ‌యంతి, వ‌ర్ధంతి

వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుల స్ప‌ష్టీక‌ర‌ణ 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా భ‌క్త క‌న‌క‌దాసు 517వ జ‌యంతి వేడుక‌లు 

కురుబ, బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రాజ‌కీయంగా ప్రోత్స‌హించింది జగనే

స్థానిక సంస్థల్లో బీసీల‌కు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వ‌కుండా చంద్రబాబు డ్రామా

సామాజిక న్యాయంపై చంద్ర‌బాబు బహిరంగ చర్చకు సిద్ధమా?

మాజీ మంత్రి జోగి ర‌మేష్ స‌వాల్ 

తాడేప‌ల్లి: 517 ఏళ్ల క్రితం కర్ణాటకలో జన్మించిన భ‌క్త కనకదాసు తన పద్యాలు, గేయాల ద్వారా సమాజంలోని అంటరానితనం, అసమానతలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని నేతలు కొనియాడారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహాకవి, భక్త కనకదాసు 517వ జయంతి వేడుకలను పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, పార్టీ కురుబ విభాగం అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొని కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన వైఎస్ జగన్ గారు 2022లో కర్నూలు జిల్లా నుంచి కనకదాసు జయంతి, వర్ధంతులను అధికారిక కార్యక్రమాలుగా ప్రకటించి ఘనంగా నిర్వహించారని వైఎస్సార్‌సీపీ నాయ‌కులు గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, కనకదాసు వంటి మహనీయుల ఆశయాలను నేటి తరానికి అందించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో వారి జయంతి, వర్ధంతులను అధికారికంగా జరిపామని వివరించారు. కురుబ సామాజిక వర్గానికి రాజకీయంగా అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ వైఎస్ జగన్ తన తొలి విడత కేబినెట్‌లో శంకరనారాయణకు, మలి విడతలో ఉషాశ్రీ చరణ్‌కు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారని తెలిపారు. అంతేకాకుండా డీఎస్పీ స్థాయి అధికారి అయిన గోరంట్ల మాధవ్‌ను ఎంపీగా, ఉషాశ్రీ చరణ్‌ను సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నియమించి బడుగు, బలహీన వర్గాల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారని పేర్కొన్నారు.

కూట‌మి ప్ర‌భుత్వం క్రెడిట్ చోరీ :

మరోవైపు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించిన కనకదాసు జయంతి వేడుకలను తామే చేశామంటూ టీడీపీ నేతలు క్రెడిట్ చోరీకి పాల్ప‌డుతున్నార‌ని నేతలు మండిపడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి కులాల మధ్య కుంపట్లు పెడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కారని మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పి బలహీన వర్గాలను మోసం చేశారని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ కేబినెట్‌లో బీసీలకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పెద్ద ఎత్తున మంత్రి పదవులు, రాజ్యసభ, ఎమ్మెల్సీ, చైర్మన్ పదవులు దక్కాయని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కనీసం బీసీ డిప్యూటీ సీఎం కూడా లేరని ఎత్తిచూపారు. సామాజిక న్యాయం ఎవరి హయాంలో జరిగిందో, బలహీన వర్గాలకు ఎవరు పెద్దపీట వేశారో తేల్చుకునేందుకు ఏ వేదికపై అయినా బహిరంగ చర్చకు సిద్ధమా అని చంద్రబాబు, లోకేష్‌లకు జోగి రమేష్ సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు, నిర్బంధాలతో అడ్డంకులు సృష్టించినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు వైఎస్సార్‌సీపీ జెండాను రెపరెపలాడించాయని తెలిపారు. రాబోయే రోజుల్లో బడుగు, బలహీన వర్గాల ఆశీస్సులతో వైఎస్ జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. కనకదాసు చూపిన సమసమాజ స్థాపన బాటలో వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఈ సందర్భంగా పార్టీ నేతలు పిలుపునిచ్చారు.

ఈ జ‌యంతి వేడుక‌ల్లో మాజీ మంత్రి జోగి ర‌మేష్‌, వైయ‌స్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్ బాబు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లు కొమ్మూరి క‌న‌కారావు, నత్తా యోనా రాజు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు నారాయ‌ణ మూర్తి, పార్టీ బూత్ క‌మిటీ అధ్య‌క్షుడు సుధాక‌ర్ రెడ్డి, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, స్టేట్ డిప్యూటీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి, విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి,  పార్టీ నూర్ బాషా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ దస్తగిరి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top