విద్యావేత్త డాక్టర్ నన్నపనేని మంగాదేవి కన్నుమూతపై వైయస్ జగన్ సంతాపం 

గుంటూరు: ప్రముఖ విద్యావేత్త, గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు డాక్టర్ నన్నపనేని మంగాదేవి కన్నుమూయడం పట్ల వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1965లో శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్‌ను స్థాపించి ఆరు దశాబ్దాలుగా విద్యారంగానికి విశిష్ట సేవలందించిన మంగాదేవి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారని వైయస్ జగన్ పేర్కొన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఆమె చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు.

చేతన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలు, అనాథ బాలలు, మహిళల సంక్షేమానికి మంగాదేవి అందించిన సేవలు చిరస్మరణీయమని వైయస్ జగన్ పేర్కొన్నారు. విద్య, సామాజిక సేవా రంగాల్లో ఆమె అందించిన సేవలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. 

మంగాదేవి మరణం విద్యారంగానికి, సామాజిక సేవా రంగానికి తీరని లోటని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు, బాలకుటీర్ విద్యాసంస్థల సిబ్బందికి, విద్యార్థులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Back to Top