జ‌గ‌న్‌పై విష ప్ర‌చారానికి మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు

 వైఎస్సార్‌సీపీ నాయ‌కుల హెచ్చరిక 

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంత‌రం అక్క‌డే మీడియాతో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నేతలు

 జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా ఎదుర్కొనే ద‌మ్ము టీడీపీకి లేదు

 అందుకే ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై సోష‌ల్ మీడియాలో విష ప్ర‌చారం  

 ఐటీడీపీ ప్రోత్సాహంతో డ‌బ్బుల కోసం రెచ్చిపోతున్న సైకో బ్యాచ్ 

 పోలీసుల స్పందన లేకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం

 మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్ప‌ష్టీక‌ర‌ణ 

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారు, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ మహిళా నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా (ఐటీడీపీ) సాగిస్తున్న అసభ్యకర విషప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉండ‌టాన్ని చూసి జీర్ణించుకోలేక, 'సీమరాజ', 'థింక్ ఆంధ్రా' వంటి హ్యాండిల్స్‌తో పాటు కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికలుగా వెనుక ఉండి ఆర్థిక ప్రోత్సాహం అందిస్తూ దిగజారుడు పోస్టులు పెట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కుట్ర వెనుక ఉన్న ఆర్థిక మూలాలను, సూత్రధారులను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఒకవేళ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు కూడా వెనుకాడబోమని మల్లాది విష్ణు హెచ్చరించారు. 

ఫిర్యాదు చేసి 15 రోజులైనా..: 

ఎక్స్ స్పేసెస్‌లో జగన్ గారి కుటుంబంపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై 15 రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు మళ్లీ రెండో విడత దుష్ప్రచారానికి తెరలేపారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బయటకు నీతులు చెబుతూనే, మరోవైపు ప్రత్యర్థి నాయకులపై అసభ్య పదజాలంతో దాడులు చేయించడాన్ని ప్రోత్సహిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తిసామర్థ్యాలు లేకనే టీడీపీ మంత్రులు అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇప్పటికే మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఓడించి గట్టి షాకిచ్చార‌ని గుర్తుచేశారు. ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకే వైఎస్సార్‌సీపీపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాలకు ఒడిగడుతున్నారని విష్ణు దుయ్యబట్టారు.

అధికారం కోల్పోయాక ఎవరూ కాపాడలేరు: 
- దొడ్డా అంజిరెడ్డి, వైఎస్సార్‌సీపీ సోష‌ల్ మీడియా అధ్య‌క్షుడు

కేవలం జీతభత్యాల కోసం ఫేక్ వీడియోలు, అవాస్తవాలతో వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీపై దుమ్మెత్తిపోస్తున్న వారు విచక్షణతో ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు గానీ, లోకేష్ గానీ వారిని ఆదుకోవ‌డానికి ముందుకు  రారు అనేది గుర్తుంచుకోవాలి. 'సీమరాజ 2.0' పేరుతో అసత్య ప్రచారాలు చేస్తున్న చంద్రకాంత్ నాయుడు వంటి వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్న వెబ్‌సైట్లను గుర్తించి పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. 

చట్టం మీకు చుట్టమా?: 

- కొమ్మూరి కనకారావు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ 

ఎన్నికల హామీల అమలులో విఫలమైన చంద్రబాబు, లోకేష్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఐటీడీపీ ద్వారా విష సంస్కృతికి నాంది పలికారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పాత పోస్టులను తవ్వితీసి చిలకలూరిపేట, శ్రీకాకుళం, మార్కాపురం అంటూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించి జైళ్లకు పంపారు. అసెంబ్లీలో సోషల్ మీడియా కట్టడిపై తీర్మానాలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు జగన్ గారి కుటుంబంపై అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెడుతుంటే ఎందుకు మౌనంగా ఉందో స‌మాధానం చెప్పాలి. చట్టం అందరికీ సమానమా లేక టీడీపీకి జేబు సంస్థగా మారిందా అనేది ప్రజలు గమనిస్తున్నారు. 

ఈ కార్యక్రమంలో పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నత్తా యోనా రాజు తదితరులు పాల్గొన్నారు.

Back to Top