వైయస్సార్‌సీపీ హయాంలోనే పెట్టుబడుల వెల్లువ

వాటిపై వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం క్రెడిట్‌ చోరి

దువ్వూరి కృష్ణ స్పష్టీకరణ

ఆ పెట్టుబడులపై ఈ వాస్తవ గణాంకాలు చూడండి

మేం బయటపెట్టిన ఆధారాలు చూశాక లోకేష్‌ స్పందించాలి

దువ్వూరి కృష్ణ సవాల్‌

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ పీఏసీ సభ్యుడు దువ్వూరి కృష్ణ

2017లో కార్యరూపం దాల్చిన పెట్టుబడులు 17 శాతమే

2018లో కార్యరూపం దాల్చిన పెట్టుబడులు 7.26 శాతమే

అదే వైయస్సార్‌సీపీ హయాంలో దాదాపు 75.25 శాతం

వాటిపైనా నిస్సిగ్గుగా క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు

దువ్వూరి కృష్ణ ధ్వజం

రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు జగన్‌ శ్రమ ఫలితమే

రూ.7.3 లక్షల కోట్ల పెట్టుబడుల్లో 2.5 లక్షల కోట్లు జగన్‌ వల్లే 

జగన్‌ హయాంలోనే గ్రీన్‌ ఎనర్జీ, సిమెంట్, ఇతర రంగాల్లో పెట్టుబడులు

ఆయా ప్రాజెక్టుల విస్తరణలు చూపించి కూటమి క్రెడిట్‌ చోరీ

దువ్వూరి కృష్ణ ఫైర్‌ 

కేవలం జీవోలు ఇచ్చి పెట్టుబడులు కన్వర్ట్‌ అయినట్లు గొప్పలు

జీవో ఇచ్చినంత మాత్రాన ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు కాదు

గతంలో ఇలాంటి జీవోలు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు

దువ్వూరి కృష్ణ సూటి ప్రశ్న

ఆర్ధిక వ్యవస్థ నిర్వహణలో కూటమి ప్రభుత్వ దారుణ వైఫల్యం

వైఎస్సార్సీపీ హయాంతో పోలిస్తే భారీగా అప్పులు చేస్తున్నారు

పెట్టుబడులపై లోకేష్‌ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

ప్రెస్‌మీట్‌లో దువ్వూరి కృష్ణ డిమాండ్‌

తాడేపల్లి: రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అస్సలు పెట్టుబడులే రాలేదని, కూటమి హయాంలో మాత్రం లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినట్లు కూటమి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారంపై వైయస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. వైయస్సార్సీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన సంస్థలు, పెట్టుబడులు, వాటిపై కూటమి ప్రభుత్వం చేస్తున్న క్రెడిట్‌ చోరీని ఆయన సమగ్రంగా ఆధారాలతో బయటపెట్టారు. అలాగే రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఎలా అప్పుల కుప్పగా మారుస్తుందో కూడా ఆయన ఆర్ధిక సంఘం సిఫార్సులతో పోల్చి వెల్లడించారు. ఇప్పటికైనా మంత్రి నారా లోకేష్‌ వైఎస్సార్సీపీ హయాంపై చేసిన వ్యాఖ్యలపై ఈ ఆధారాలను చూసి వివరణ ఇవ్వాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన దువ్వూరి కృష్ణ సవాల్‌ చేశారు.
ప్రెస్‌ మీట్లో దువ్వూరి కృష్ణ ఇంకా ఏమేం వివరించారంటే..:

గ్రౌండ్‌ అయిన పెట్టుబడులు. రెండు ప్రభుత్వాల మధ్య తేడా:
    2025 అక్టోబర్‌ 7న ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 2017 సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.1,03,375 కోట్ల విలువైన ఎంఓయూలు జరిగితే, వాటిలో నిర్మాణ పనులు, వాణిజ్య కార్యకలాపాలు జరిగినవి చూస్తే కేవలం 17 శాతమే ఉన్నాయి. 2018 సీఐఐ భాగస్వామ్య సదస్సులో చూస్తే రూ.61,546 కోట్ల విలువైన ఎంఓయూలు జరిగితే అందులో కేవలం 7.26 శాతం మాత్రమే గ్రౌండ్‌ అయ్యాయి.
    అదే వైయస్సార్సీపీ హయాంలో ఐదేళ్లలో వచ్చిన పెట్టుబడులు చూస్తే మొత్తం రూ.4,38,161 కోట్లు అయితే అందులో 75.25 శాతం గ్రౌండ్‌ అయ్యాయని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆర్‌టీఐ కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. అయినా వాటిని కూడా ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటోంది. 
    కాగా, ఈ ప్రభుత్వం ఈ మధ్యే ప్రాజెక్ట్‌ స్టేటస్‌ డాక్యుమెంట్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ప్రభుత్వంలో వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.22.63 లక్షల కోట్లు. అందులో కన్వర్ట్‌ అయినవి  రూ.17.11 లక్షల కోట్లు కాగా, గ్రౌండ్‌ అయిన పనుల విలువ రూ.7.30 లక్షల కోట్లు అని చెబుతున్నారు. అయితే వాటిలో రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గత వైయస్సార్సీపీ హయాంలో జగన్‌గారు వేసిన అడుగుల ప్రతిఫలం అనేది సుస్పష్టం.

వైయస్సార్‌సీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులివే:
ప్రధానంగా ఆరు ప్రాజెక్టుల్లో 2019–24 మధ్య జరిగిన పురోగతి కనిపిస్తుంది. 
– ఇందులో మొదటిది వైఎస్సార్‌ కడప జిల్లాలో నిర్మిస్తున్న జేఎస్‌డబ్లూ స్టీల్‌. దీనికి సంబంధించిన ఎంఓయూ 2023 మార్చి 4న జరిగినట్లు ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ప్రకారం చేసిన దరఖాస్తుకు సమాధానమిచ్చింది. ఇది రూ.16,350 కోట్లకు సంబంధించిన ఎంఓయూ. ఈ ప్రాజెక్టు పునఃప్రారంభ వేదికపై మాజీ ముఖ్యమంత్రి జగన్‌గారు అభినందిస్తూ చేసిన ట్వీట్‌కు ఆ సంస్థ అధినేత సజ్జన్‌ జిందాల్‌ ధన్యవాదాలు కూడా తెలిపారు.
– రెండో ప్రాజెక్టు కాకినాడలో నిర్మిస్తున్న ఏఎం గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టు. 2022 సెప్టెంబర్‌ 15న 4300 మెగావాట్ల పునరుత్పాక శక్తి ఉత్పత్తి కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో 2300 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్,  అలాగే 1680 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు కూడా ఉన్నాయి. వీటితో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తే అది గ్రీన్‌ హైడ్రోజన్‌ అవుతుంది. ఆ హైడ్రోజన్‌తో గ్రీన్‌ అమ్మోనియా కూడా ఉత్పత్తి చేస్తారు. ఒక టన్ను గ్రీన్‌ అమ్మోనియా రావాలంటే 0.17 టన్ను హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయాలి. దీని కోసం ఎంఓయూ 2023 మార్చి 4న జరిగింది. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. జెంటారీ అనే మల్టీనేషనల్‌ కంపెనీ మలేషియా ప్రభుత్వ సంస్థ అయిన పెట్రోనాక్స్‌ అనుబంధ సంస్థతో ఈ ఏఎం గ్రీన్‌ ఒప్పందం చేసుకుంది. యూరియా తయారీలో ఉన్న కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభిస్తే త్వరగా రాష్ట్రానికి ప్రయోజనం లభిస్తుందని ఆలోచించి, అప్పట్లో కాంపిటీషన్‌ కమిషన్‌కు దరఖాస్తు చేస్తే ఆమోదం కూడా వచ్చింది. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఎంఓయూ, నిధుల సేకరణ, కర్మాగారం కొనుగోలు కూడా జరిగాయి. దీన్ని కూడా కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోంది.
– దీని తర్వాత మరో ఎంఓయూ అదానీ రెన్యువబుల్‌ ఎనర్జీ ఫిఫ్టీ వన్‌ లిమిటెడ్‌ తో జరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని 2022 జూన్‌ 29న ఇచ్చాం. 3700 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఈ ఒప్పందం జరిగింది. దీనిలో చిత్రావతి, కురుకుట్టి, కర్రివలస, గండికోటలో నాలుగు పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో వైఎస్సార్‌ జిల్లా గండికోటలో 1000 మెగావాట్లు, పార్వతీపురం జిల్లా కర్రివలసలో 1000 మెగావాట్లు, కురుకుట్టిలో మరో 1200 మెగావాట్లు, శ్రీసత్యసాయి జిల్లా చిత్రావతిలో 500 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు రెండేళ్ల ముందే ఈ ప్రాజెక్టుపై ఉత్తర్వులు ఇచ్చాం.
– అలాగే మరో ఎంఓయూ ఎన్టీపీసీ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఉన్న గుడిమడక గ్రామంలో ఈ ప్రాజెక్టు స్థాపన కోసం ఎన్టీపీసీ ఆ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 1200 ఎకరాలు తీసుకునేలా ఎన్టీపీసీ ఫిబ్రవరి 2024లోనే భూమి లీజు ఒప్పందం చేసుకుంది. ఈ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుకు అప్‌ స్ట్రీమ్‌ ప్రాజెక్టులు సైతం వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చాయి. అయినా కూటమి ప్రభుత్వం దీన్ని కూడా తమ ఖాతాలో వేసుకుంటోంది. తర్వాత ఎంఓయూ బీపీసీఎల్‌ పెట్రో కాంప్లెక్స్‌ ప్రాజెక్టు కోసం చేసుకున్నాం. 
– వైఎస్సార్సీపీ హయాంలోనే రామాయపట్నం పోర్టుకు అన్ని అనుమతులు వచ్చాయి, భూసేకరణ, పరిహారం చెల్లింపు అన్నీ పూర్తయ్యాయి. బ్రేక్‌ వాటర్స్, డ్రెడ్జింగ్‌ పనులతో పాటు, నాలుగో బెర్త్‌ నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ లేకపోతే ఈ బీపీసీఎల్‌ పెట్రో కాంప్లెక్స్‌ ప్రాజెక్టు వచ్చేది కాదు. విభజన చట్టంలోనే ఈ ప్రాజెక్టును పెట్టినా, ఫైనాన్షియల్‌ ఫీజిబిలిటీ లేక ఆలస్యం అయింది. ఈ ప్రాజెక్టును సైతం కూటమి తమ ఖాతాలో వేసుకుంటోంది. 
– అలాగే మరో ఎంఓయూ ఏబీసీ క్లీన్‌ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తో జరిగింది. దీని విలువ రూ,1,10,250 కోట్లు. కూటమి తమ ఘనతగా చెప్పుకుంటున్న ఎంఓయూల్లో అతిపెద్ద పెట్టుబడి ఇదే, ఇది కూడా వైఎస్సార్సీపీ హయాంలో వచ్చిందే. 2025 నవంబర్‌ 13న దీనికి సంబంధించిన ఎంఓయూ కూటమి ప్రభుత్వం చేసుకుంది. ఏబీసీ క్లీన్‌ టెక్‌ అనేది.. బ్రూక్‌ ఫీల్డ్‌ 51 శాతం, హైదరాబాద్‌ కు చెందిన యాక్సిస్‌ ఎనర్జీ 49 శాతం ఉన్న జాయింట్‌ వెంచర్‌.
– ఇది జరగడానికి ముందే 2023 మార్చి 4న ఏబీసీ క్లీన్‌ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పెట్టుబడుల సదస్సులోనే ఎంఓయూ కుదుర్చుకున్నారు. రూ.1.20 లక్షల కోట్లకు ఈ ఒప్పందం జరిగింది. అప్పటికే ఓ ఎంఓయూ ఉంది, మరో ఒప్పందం అక్కర్లేదు. కానీ తిరిగి కొన్ని మార్పులు చేసి దాదాపు అవే అంచనాలతో కొత్తగా ఎంఓయూ చేసుకున్నారు. వాస్తవానికి ఈ సంస్థ 2023లో ఎంఓయూ చేసుకోవడమే కాదు, నిధుల సేకరణ కూడా చేపట్టింది. బ్రూక్‌ ఫీల్డ్‌ 845 మిలియన్‌ డాలర్లు ఈ సంస్ధలో పెట్టుబడి పెడుతున్నట్లు 2023 సెప్టెంబర్‌ 23నే ప్రకటించింది. 

జగన్‌గారి హయాంలో పెట్టుబడుల వెల్లువ:
    ఈ లెక్కన రాష్ట్రానికి వస్తున్న రూ.7.30 లక్షల కోట్ల పెట్టుబడుల్లో రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చాయి. కూటమి ప్రభుత్వంలో చెప్పుకుంటున్న పెట్టుబడుల్లో కన్వర్ట్‌ అయినట్లుగా చెప్పుకోవడం వెనుక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం మినహా ఏమీ లేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినంత మాత్రాన పెట్టుబడి వచ్చినట్లు కాదు. నిర్మాణం ప్రారంభమైనట్లూ కాదు, పూర్తయినట్లూ కాదు, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైనట్లూ కాదు. గతంలో ప్రభుత్వం ఇలాంటి ఎన్నో జీవోలు ఇచ్చి ఉపసంహరించిన సందర్భాలూ ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.46,750 కోట్లుగా ఉంది.
    అలాగే ప్రభుత్వం కన్వర్ట్‌ అయిన పెట్టుబడులుగా చూపిస్తున్న వాటిలోనూ వైఎస్సార్సీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ మార్చి 2023లో ఎంఓయూ  చేసుకుంది. అలాగే ఎకోరెన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కూడా 2023 మార్చి 4నే ఒప్పందం చేసుకుంది. జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ కూడా 2023 మార్చి 4నే ఒప్పందం చేసుకుంది.
    ఇంకా కాకినాడలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు చేపడుతున్న గ్రీన్‌ కో గ్రూపు .. 2021లోనే తమ సంస్థ గ్రీన్‌ కో ఆర్మ్‌ తో ఎలక్ట్రోలైజర్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం కూడా జాన్‌ కాక్రెల్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం వివరాలను వెల్లడించింది. 2023 ఫిబ్రవరి 2న తమ ఒప్పందంలో భాగంగా జాన్‌ కాక్రెల్‌ ఏడాదికి రెండు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌ తయారీ ప్లాంట్‌ నిర్మిస్తోందని ప్రకటించింది. ఆక్మే క్లిన్‌ టెక్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కూడా రూ.68 వేల కోట్ల పెట్టుబడి కోసం 2023 మార్చి 4న ఒప్పందం చేసుకుంటే..  దీన్ని కూడా కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోంది. తర్వాత రెన్యూపవర్‌ సంస్థ రూ.80 వేల కోట్ల పెట్టుబడి కోసం మా హయాంలోనే ఎంఓయూ చేసుకుంది. అయినా వీళ్ల ఖాతాలో వేసుకుంటున్నారు.
    ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.10 వేల కోట్లతో నిర్మిస్తున్న అదానీ హైడ్రో ఎనర్జీ వన్, ఫోన్‌ ప్రాజెక్టులు. వీటికి సంబంధించి కూడా అప్పటి ప్రభుత్వం 2023 జనవరి 18న ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని కూడా కూటమి తమ ఖాతాలో వేసుకుంటోంది. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటుకు రెండేళ్ల క్రితమే ఒప్పందం చేసుకున్న అస్దా  గ్రీన్‌ ఎనర్జీ వెంచర్స్‌ ప్రాజెక్టు. దీని కోసం 2022 సెప్టెంబర్‌ 22నే అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. అలాగే మరో ప్రాజెక్టు ఇండోసోల్‌ సోలార్‌. దీని కోసం కూడా 2022 సెప్టెంబర్‌ 15న జీవో ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సెకీ టెండర్లలో ఇండోసోల్‌ పాల్గొంది. అయినా కూటమి దీన్ని కూడా తమ ఖాతాలో వేసుకుంటోంది. 

వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ నిస్సిగ్గు ప్రచారం:
    వెఎస్సార్సీపీ హయాంలో ఇన్ని పెట్టుబడులు, ప్రాజెక్టులు వచ్చినా, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎనర్జీ ఒక్కటే కాదు సిమెంట్‌ ఫ్యాక్టరీలు కూడా రాష్ట్రంలో మా హయాంలో పెట్టుబడులు పెట్టాయి. పల్నాడు జిల్లా దాచేపల్లిలో శ్రీ సిమెంట్స్, మై హోం సిమెంట్స్‌ కలిసి 2019 నవంబర్‌ లో దరఖాస్తు పెట్టుకుంటే 2020లో మేం అనుమతిచ్చాం. 2023 డిసెంబర్‌ 23న కన్సెంట్‌ టూ ఆపరేట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే దాన్ని ఆమోదిస్తూ 2024 మార్చి 20న జీవో ఇచ్చాం. శ్రీ సిమెంట్‌ విస్తరణ కోసం కూడా వారు ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని కూడా కూటమి తమ ఖాతాలో వేసుకుంటోంది. వీళ్లు చెప్తున్న స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మా హయాంలోనే జరిగింది. అప్పట్లో ప్రభుత్వం చెప్పుకోవడంలో స్పీడ్‌ లేదేమో కానీ పనులు చేయడంలో ఉంది. ఇప్పుడు పరిస్ధితి పూర్తి విరుద్దంగా ఉంది.
    రాంకో సిమెంట్స్‌ ప్లాంట్‌ కూడా 2022 సెప్టెంబర్‌ 20న జగన్‌గారు ప్రారంభించారు. ఆ తర్వాత రాంకీ సిమెంట్స్‌ విస్తరణకు కూడా ఎంఓయూ చేసుకుంటే దీన్ని కూడా కూటమి తమ ఖాతాలో వేసుకుంటోంది. అలాగే స్నాక్‌ ఇండియా మాండెలెజ్‌ సంస్థ కూడా 2023 మార్చిలోనే ఎంఓయూ చేసుకుంది. అదే ఏడాది జూలైలో పనులు కూడా ప్రారంభమయ్యాయి. కోకా కోలా విషయంలోనూ గతంలో మాతో చేసుకున్న ఒప్పందాన్ని ఉపసంహరించుకునేలా ఒత్తిళ్లు చేస్తే తిరిగి వేరే చోట ప్లాంట్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 

విదేశీ పెట్టుబడుల్లోనూ కూటమి ప్రభుత్వం వెనుకబాటు:
    అలాగే మన రాష్ట్రానికి కూటమి ప్రభుత్వంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని  చూస్తే.. 2024లో రెండు, మూడు త్రైమాసికాలు, 2025 పూర్తి సంవత్సరం, 2026 తొలి అర్ధభాగం చూస్తే దేశంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లక్షా 14 వేల మిలియన్‌ డాలర్లు అయితే అందులో ఏపీకి వచ్చినవి కేవలం 820 మిలియన్‌ డాలర్లు మాత్రమే. అంటే 0.72 శాతం అన్నమాట. ఇందులోనూ 239 మిలియన్‌ డాలర్లు ఒకే ఒక్క కంపెనీ పయనీర్‌ అల్యూమినియం ఇండస్ట్రీస్‌ నుంచి  వచ్చినవే. ఇది కూడా 2021–24 మధ్య మేం అనుమతి ఇచ్చిందే. దీనికి సంబంధించిన జీవో 2024 ఫిబ్రవరి 7న ఇచ్చాం.
    చంద్రబాబు, లోకేష్‌ ప్రతీ సందర్భంలోనూ వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని ఆరోపణలు చేస్తుంటారు, ఇంకా విభజన కంటే వైఎస్సార్సీపీ హయాంలోనే ఎక్కువ నష్టం జరిగిందని చెప్తుంటారు. ఇవన్నీ పూర్తిగా సత్యదూరమైన ఆరోపణలే. నిజం ఉంటే గణాంకాల్లో అది కనిపించాలి కదా. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.

తయారీ రంగంౖపై కేంద్ర గణాంకాలు ఏం చెబుతున్నాయి:
    తయారీ రంగం ఆదాయాల సమాన పంపిణీ కోసం అత్యవసరం. తయారీ రంగంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం స్దిర మూలధనంలో 2018–19 మధ్య వృద్ధి రేటు 4.9 శాతం ఉంది. అదే 2023–24లో 5.94 శాతం ఉంది. ఉత్పాదక మూలధనం చూసినా 2018–19లో 5.99 శాతం వృద్ధి నమోదైతే, 2023–24లో అది 8.02గా నమోదైంది. అలాగే పెట్టుబడి మూలధనం చూసుకుంటే 2018–19 మధ్య 5.5 శాతం వృద్ధి రేటు నమోదైతే, 2023–24లో 7.56 శాతం నమోదైంది. అందుకే పెట్టబడిదారులు పారిపోయారని వీళ్లు చెప్తున్న మాటలు నిజం కాదని ఈ గణాంకాలు చెప్తున్నాయి.
    ఉపాధి కల్పనలో చూసినా గత టీడీపీ ప్రభుత్వంలో 3.93 శాతం వృద్ధి రేటు నమోదైతే, వైఎస్సార్సీపీ హయాంలో 3.97 శాతం ఉద్యోగాల కల్పన జరిగింది. అలాగే స్థూల ఉత్పత్తి విలువ చూసినా గత టీడీపీ హయాంలో 7.44 శాతం మాత్రమే వృద్ధి ఉంటే, వైయస్సార్సీపీ హయాంలో మాత్రం అది 12.69 శాతం పెరిగింది. జాతీయ స్దాయిలో తయారీ రంగం వృద్దిలోనూ 2019–24 మధ్య ఏపీ దేశంలోనే ఐదో  ర్యాంకులో, దక్షిణాదిలో తొలి ర్యాంకులో నిలిచిందని ఆర్బీఐ గణాంకాలు చెప్తున్నాయి. 

ఆర్థిక సంక్షోభానికి కూటమి ప్రభుత్వం కారణం:
    పెట్టుబడుల సదస్సులకు వచ్చే పెట్టుబడిదారులకు వైఎస్సార్సీపీ హయాం పేరు చెప్పడం ఇష్టం లేకపోతే 2019–24 మధ్య అభివృద్ది జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ కేవలం పెట్టుబడిదారుల ముందు రాష్ట్రం పరువు తీయడానికి వైఎస్సార్సీపీపై దుష్ట్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభానికి గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏ మాత్రం కారణం కాదు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణలో వైఫల్యాలే అందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా నానాటికీ తీవ్రంగా పెరుగుతున్న ద్రవ్యలోటు కూడా ఒక కారణం.
    వైఎస్సార్సీపీ హయాంలో 2021–24 మధ్య 15వ ఆర్ధిక సంఘం, కేంద్రం అనుమతించిన దాని కంటే రూ.23,535 కోట్లు తక్కువ అప్పు తీసుకున్నాం. అదే ఈ కూటమి ప్రభుత్వం రూ.37,848 కోట్ల ఎక్కువ అప్పు తీసుకున్నట్లు ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి గత ప్రభుత్వాన్ని తప్పు బట్టడం మాని ప్రస్తుత ప్రభుత్వ ఆర్దిక పరిస్ధితిని మెరుగుపర్చుకునే విషయాన్ని ఆలోచించుకోవాలి.

మేం బయటపెట్టిన ఆధారాలపై లోకేష్‌ స్పందించాలి:
    రాష్ట్ర ఆదాయాలు పెరగకపోవడం వల్ల అప్పుల మొత్తం పెరుగుతోంది. 2019–2023 మధ్య వైఎస్సార్సీపీ హయాంలో మొత్తం తీసుకున్న అప్పులో 33 శాతం మూలధన వ్యయానికి ఇచ్చాం. కానీ కూటమి హయాంలో ఈ సెప్టెంబర్‌ వరకూ చూస్తే 27 శాతం అప్పులు మాత్రమే మూలధనానికి వెళ్తే, మిగతా అప్పులన్నీ రెవెన్యూ వ్యయాలే చేశారు.
    మంత్రి నారా లోకేష్‌ నాలుగైదు రోజుల క్రితం చేసిన ట్వీట్‌లో, గత మా ప్రభుత్వ హయాంలో ఓ విధమైన పెట్టుబడులూ రాలేదని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మేం బయటపెట్టిన రిపోర్టులన్నీ అధికారిక నివేదికలు లేదా సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానాలు లేదా పత్రికల్లో వచ్చిన కథనాలు. మరి అలాంటప్పుడు మా హయాంలో అసలు  పెట్టుబడులే రాలేదని ఎలా చెబుతారు?. అందుకే మంత్రి నారా లోకేష్, ఈ ఆధారాలను చూసి, ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని దువ్వూరి కృష్ణ సవాల్‌ చేశారు.

Back to Top