తాడేపల్లి: జనసేన కార్యాలయం కేంద్రంగా ఉద్యోగాల పేరుతో రూ.7 కోట్ల కుంభకోణం జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిఘా వ్యవస్థ ఏం చేస్తోందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ నిలదీశారు. డిప్యూటీ సీఎం కార్యాలయానికి సన్నిహితంగా ఉన్న వర్గాల ప్రమేయంతోనే ఉద్యోగాల పేరుతో డబ్బుల వసూళ్లు సాగుతున్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. తన చీఫ్ సెక్రటరీ రుక్మిణి కోటాకు సన్నిహితమైన హెచ్‌ఆర్ ధరణి కృష్ణ వ్యవహారం, 2025 నుంచే ఉద్యోగాల పేరుతో వసూళ్లు, బాధితులు ఎండోమెంట్స్ శాఖను ఆశ్రయించిన అంశాలు పవన్ కళ్యాణ్ దృష్టికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగార్జున యాదవ్.. రూ.7 కోట్ల కుంభకోణం, పెద్దిరాజు అరెస్టు, ధరణి కృష్ణ వ్యవహారంపై సీబీసీఐడీ దర్యాప్తును వేగవంతం చేసి వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. మీడియా సమావేశంలో నాగార్జున యాదవ్ ఏమన్నారంటే.. - ఉద్యోగాల పేరుతో రూ.7 కోట్ల దోపిడీ వెనుక అసలు కథ ఏంటి? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఉద్యోగాల పేరుతో జరిగిన ఈ వ్యవహారంలో రిమాండ్ రిపోర్ట్ అనేక కీలక విషయాలను బయటపెడుతోంది. 2025లోనే ఎండోమెంట్స్ శాఖలో శాశ్వత ఉద్యోగాల పేరుతో ఖాళీలు ఉన్నాయని చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యవహారం మొదలైనట్లు రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. పవన్ కళ్యాణ్ కార్యాలయానికి సన్నిహితంగా ఉండే వర్గాలతో సంబంధం ఉన్న వ్యక్తుల చుట్టూనే ఈ వ్యవహారం తిరుగుతోంది. బాధితుల నుంచి రూ.7 కోట్ల వరకు వసూలైన ఈ వ్యవహారంలో అసలు డబ్బు ఎవరి దగ్గరికి వెళ్లింది, ఎవరి ద్వారా వసూలైంది, ఎక్కడికి మళ్లింది అనేది బయటకు రావాలి. ఉద్యోగాల పేరుతో ఇంత పెద్ద దోపిడీ జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? - రుక్మిణి కోటా ఫిర్యాదు.. ధరణి కృష్ణ వ్యవహారంలో పొంతన ఎక్కడ? డిప్యూటీ సీఎం చీఫ్ సెక్రటరీ రుక్మిణి కోటా ఫిర్యాదులో ధరణి కృష్ణ మా సంస్థలో 2026 జూన్ నుంచి పనిచేసిందని పేర్కొన్నారు. కానీ నిమ్మకాయల పెద్దిరాజు రిమాండ్ వాంగ్మూలంలో ధరణి కృష్ణ 2025 నుంచే పరిచయమని, మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఐటీ విభాగంలో పనిచేస్తున్నట్లు ఉంది. మరి అసలు నిజం ఏది? 2025 నుంచే పరిచయం ఉండి జనసేన ఐటీ విభాగంలో పనిచేస్తే 2026 జూన్ నుంచి మాత్రమే పనిచేసినట్లు ఫిర్యాదులో ఎందుకు పేర్కొన్నారు? అంతేకాదు, 2025లోనే ఎండోమెంట్స్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 శాశ్వత ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. అంటే ఉద్యోగాల పేరుతో ఈ వ్యవహారం ఎప్పుడు మొదలైందో రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా స్పష్టత రావాల్సి ఉంది. - జూలైలోనే బాధితులు ఎండోమెంట్స్ శాఖకు వెళ్లారు.. పవన్ నిఘాకు తెలియదా? 2026 జూలైలోనే బాధితులు ఎండోమెంట్స్ శాఖ కార్యాలయానికి వెళ్లి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, సర్వీస్ రిజిస్టర్లు చూపించారని రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. అక్కడ అధికారులు ఆ పత్రాలు నకిలీవని, ఫోర్జరీ చేసినవని చెప్పినట్లు కూడా బాధితుల వాదనలో ఉంది. కానీ నవంబర్‌లో ఎండోమెంట్స్ కమిషనర్ సీబీసీఐడీకి రాసిన లేఖలో తమకు ఈ వ్యవహారం తెలియదని, బాధితులు ఎవరూ తమ వద్దకు రాలేదని ఇప్పుడు చెబుతున్నారు. జూలైలోనే బాధితులు ఆ శాఖను ఆశ్రయించి ఉంటే అధికారులకు విషయం తెలియదనడం ఎలా సాధ్యం? అంతకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తాను కేంద్ర నిఘా వర్గాల నుంచి కీలక సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని చెబుతుంటారు. మరి తన చీఫ్ సెక్రటరీకి సన్నిహితమైన హెచ్‌ఆర్ ధరణి కృష్ణ చుట్టూ రూ.7 కోట్ల వ్యవహారం తిరుగుతుంటే ఆయన నిఘా వ్యవస్థకు కనీస సమాచారం కూడా రాలేదా? - కైరన్ నుంచి కీ స్పేస్ వరకు.. కొత్త లింకుల వెనుక అసలు సంబంధాలేంటి? కైరన్ సంస్థతో పాటు కీ స్పేస్, పిక్నిక్స్, హలో పండిట్, పండిట్ వ్యాపారం, క్రియేటివ్ వర్క్స్ వంటి కొత్త అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వీటి వెనుక ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి? రుక్మిణి కోటాకు, ధరణి కృష్ణకు, కైరన్ సంస్థకు ఈ వ్యవహారాలతో ఉన్న సంబంధం ఏమిటి? బాధితులు కైరన్ సంస్థ వద్దకు పలుమార్లు వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన అంశం నిజమైతే, ఆ వ్యవహారం రుక్మిణి కోటాకు తెలియకుండా ఎలా జరిగింది? రుక్మిణి కోటా, ధరణి కృష్ణ, కైరన్ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లు, సీసీటీవీ ఫుటేజ్, గూగుల్ టేకౌట్ వంటి ఆధారాలను దర్యాప్తు సంస్థలు పరిశీలించాయా? రూ.7 కోట్ల డబ్బు ఎక్కడికి వెళ్లిందో, ఈ కొత్త సంస్థలు–వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలేంటో రుక్మిణి కోటా ప్రజలకు సమాధానం చెప్పాలి. మనీలాండరింగ్ కోణంలో సీబీసీఐడీతో పాటు సీబీఐ, ఈడీ దర్యాప్తు కూడా అవసరమని యనమల నాగార్జున యాదవ్ తేల్చి చెప్పారు.