రాజమహేంద్రవరం ఎన్నికల్లో భద్రతా వైఫల్యం

 వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి వందల మంది పోలీసులు.. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద ఒక్క కానిస్టేబులేనా?

 మున్సిపల్‌ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై మార్గాని భరత్‌ ధ్వజం

రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ, వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా లోపాలు, స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద కనిపించిన నిర్లక్ష్యం, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై బెదిరింపులు, అధికార యంత్రాంగం తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

 స్ట్రాంగ్‌ రూమ్‌ ప్రాంతంలో యథేచ్ఛగా అనామకుల సంచారం
 

గేట్లు తెరిచి ఉండటంతో స్ట్రాంగ్‌ రూమ్‌ ప్రాంతంలోకి వ్యక్తులు స్వేచ్ఛగా వెళ్లే పరిస్థితి

 సీసీ కెమెరాలకు కనెక్షన్‌ లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది

 స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి కౌంటింగ్‌ వరకు 72 గంటల పూర్తి వెబ్‌ టెలికాస్టింగ్‌ ఇవ్వాల్సిందే  

మార్గాని భరత్‌ డిమాండ్‌

 వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు, మద్దతుదారులపై బెదిరింపులు.. కేసుల పేరుతో వేధింపులు

 అభ్యర్థులను బెదిరిస్తూ, డబ్బులు ఆశచూపి నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిళ్లు

 కూటమి ప్రభుత్వానికి ఇక రెండేళ్లే.. ఆ తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం

 ఎన్నికల అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు  

:  తేల్చి చెప్పిన మాజీ ఎంపీ మార్గాని భరత్  

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా స్ట్రాంగ్‌ రూమ్‌ భద్రత, ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ ఎంపీ, వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌ పేర్కొన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లలో లోపాలు, సీసీ కెమెరాల పరిస్థితి, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు, మద్దతుదారులపై బెదిరింపులు, కేసుల పేరుతో వేధింపులపై ఆయన ప్రశ్నలు సంధించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం నిలబెట్టేందుకు స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి కౌంటింగ్‌ వరకు 72 గంటల పూర్తి వెబ్‌ టెలికాస్టింగ్‌ అందించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని తన క్యాంపు కార్యాలయంలో మార్గాని భరత్‌ మీడియాతో మాట్లాడారు.
ప్రెస్‌మీట్‌లో మార్గాని భ‌ర‌త్ ఏమ‌న్నారంటే.. 

- స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రత ఏది?

“స్ట్రాంగ్‌ రూమ్‌ ప్రాంతంలో యథేచ్ఛగా వ్యక్తులు సంచరించే పరిస్థితి ఎందుకు వచ్చింది? 100 మీటర్ల హైసెక్యూరిటీ జోన్‌ ఉండాల్సిన చోట ఒక్క కానిస్టేబుల్‌ మాత్రమే ఉండటం ఏమిటి? గేట్లు తెరిచి ఉన్నాయి, మెట్లు ఎక్కి స్ట్రాంగ్‌ రూమ్‌ వరకు వెళ్లే పరిస్థితి ఉంది. లోపలికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే రిజిస్టర్‌ కూడా లేదు. స్ట్రాంగ్‌ రూమ్‌కు ఎదురుగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు కనెక్షన్‌ లేదు. లక్షల మంది ఓటర్లు ఉన్న రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ బాక్సులకు ఇంతటి భద్రతా లోపాలు ఎలా ఉంటాయి? వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి వందల మంది పోలీసులను పెట్టి, స్ట్రాంగ్‌ రూమ్‌కు మాత్రం ఒక్క కానిస్టేబుల్‌ను పెట్టడం దారుణం. ఎన్నికల సంఘం వెంటనే రాజమహేంద్రవరం వచ్చి పరిస్థితిని పరిశీలించాలి. 

- 72 గంటల పూర్తి వెబ్‌ టెలికాస్టింగ్‌ ఇవ్వాలి

పోలింగ్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన సమయం నుంచి కౌంటింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లే వరకు మొత్తం 72 గంటల వెబ్‌ టెలికాస్టింగ్‌ ఇవ్వాలి. ఒక్క నిమిషం కూడా డిలీట్‌ కాకూడదు, ఓవర్లాప్‌ కాకూడదు, రిపీట్‌ కాకూడదు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి కౌంటింగ్‌ వరకు ప్రతి దృశ్యాన్ని మేము పరిశీలిస్తాం. ఎన్నికల సంఘానికి ఇప్పటికే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. అలాగే కౌంటింగ్‌ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు ఏజెంట్లుగా కూర్చునే విషయంలో కాకినాడకు వర్తించిన నిబంధనలే రాజమహేంద్రవరంలోనూ అమలు చేయాలి. గతంలో ఆదిరెడ్డి అప్పారావు ఏజెంట్‌గా కూర్చొని ఇతరులను ప్రభావితం చేసిన పరిస్థితులు పునరావృతం కాకూడదు. ప్రజాప్రతినిధులకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలి.

- బెదిరింపులు, కేసుల పేరుతో వేధింపులు ఆపాలి

వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు, మద్దతుదారులను బెదిరించడం, డబ్బులు ఆశచూపి నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడం, వ్యాపారులను భయపెట్టడం, కేసుల పేరుతో వేధించడం సరికాదు. జీఎస్టీ తనిఖీల పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు చెందిన వ్యాపార సంస్థలపై దాడులు చేయడం, రూ.45 వేల నగదు ఉందనే కారణంతో వ్యక్తులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లడం వంటి ఘటనలు అధికార దుర్వినియోగానికి నిదర్శనం. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించకుండా సమాన న్యాయం చేయాలి. కొంతమంది అధికారుల తీరు మొత్తం పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. 

కూటమి ప్రభుత్వానికి ఇక రెండేళ్లే. ఆ తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాట‌య్యాక‌ అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం. ఎవరు ఎంత పెద్ద అధికారి అయినా వదిలే ప్రసక్తే లేదు” అని మాజీ ఎంపీ మార్గాని భరత్‌ తేల్చిచెప్పారు.  

Back to Top