వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లోనే సామాజిక న్యాయం 

బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు

వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుల ధ్వ‌జం 

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మ‌హాత్మా జ్యోతిరావు పూలే వ‌ర్ధంతి కార్యాల‌యం 

పూలే ఆశయాలకు ఆచరణ రూపం జగన్‌ పాలన

56 బీసీ కార్పొరేషన్లతో సామాజిక సాధికారత

బలహీన వర్గాలకు పదవులిచ్చిన ఘనత వైయ‌స్సార్‌సీపీదే

34 శాతం రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కిన చంద్ర‌బాబు కూటమి

బీసీల అభ్యున్నతికి మళ్లీ జగన్‌ నాయకత్వమే దిక్సూచి

వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుల స్ప‌ష్టీక‌ర‌ణ 

తాడేప‌ల్లి: కులవివక్ష, అంటరానితనం నిర్మూలనకు, మహిళా విద్యాభివృద్ధికి జ్యోతిరావు పూలే చేసిన పోరాటం చిరస్మరణీయమని వైఎస్సార్‌సీపీ నాయ‌కులు కొనియాడారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పూలే ఆశయాలను ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, నేడు అభినవ పూలేగా వైఎస్ జగన్ గారు త్రికరణశుద్ధితో అమలు చేశారని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ గారు బలహీన వర్గాలకు చట్టసభలు, మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించడంతో పాటు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారని గుర్తుచేశారు. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, ఫీజు రీయింబర్స్‌మెంట్, 33 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగన్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని తెలిపారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు 34 శాతం రిజర్వేషన్లు, 50 ఏళ్లకే పెన్షన్ అంటూ మోసపూరిత హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక బలహీన వర్గాలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. కేబినెట్‌లో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోవడమే కాకుండా, ప్రజాపక్షాన నిలుస్తున్న బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని ధ్వజమెత్తారు.

కూట‌మి పార్టీల‌కు గుణ‌పాఠం త‌ప్ప‌దు: 

విజయవాడ లాంటి మహానగరంలో రాజ్యసభ స్థానం నుంచి డిప్యూటీ మేయర్ పదవి వరకు బీసీలకు మొండిచేయి చూపిన కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారని నేతలు విమర్శించారు. బలహీన వర్గాలకు 100 శాతం సామాజిక న్యాయం చేసిన వైఎస్ జగన్ గారి పాలనకు, కేవలం తమ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్న కూటమి పాలనకు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వ మోసాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని, రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాల బంగారు భవిష్యత్తు కోసం మళ్లీ జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు సమిష్టిగా పోరాడతామని జ్యోతిరావు పూలే సాక్షిగా నాయకులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ ఏసురత్నం, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ చేతి వృత్తుల విభాగం అధ్య‌క్షుడు తోలేటి శ్రీకాంత్, పార్టీ స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్లు కొమ్మూరి కనకారావు, నత్తా యోనారాజు, పార్టీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి, పార్టీ నూర్‌భాషా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ దస్తగిరి తదితరులు హాజరై మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించారు.

ఈ సంద‌ర్భంగా నాయ‌కులు ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే...  

సామాజిక న్యాయం చేసి చూపించిన ఏకైక సీఎం వైఎస్ జగన్
- జోగి రమేష్, మాజీ మంత్రి

సామాజిక న్యాయానికి, సామాజిక ఉద్యమానికి పునాది వేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి అడుగుజాడలను యావత్ భారతదేశం స్మరించుకుంటోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. వార్డు స్థాయి నుంచి రాజ్యసభ వరకు బలహీన వర్గాలకు అవకాశాలివ్వడంతో పాటు, కేబినెట్‌లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంత్రి పదవులు, డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి జగన్ గారు గౌరవించారు. స్థానిక ఎన్నికల్లో బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి మాట తప్పిన చంద్రబాబు, నేటి కేబినెట్‌లో బలహీన వర్గాలకు ఒక్క డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. కూటమి ప్రభుత్వ మోసాలపై బలహీన వర్గాల్లో తిరుగుబాటు మొదలైంది; మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు సమిష్టిగా కృషి చేస్తాం. 

బీసీలంటే బ్యాక్‌బోన్ క్లాస్ అని చాటి చెప్పింది జ‌గ‌నే 
- ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు

వెనుకబడిన వర్గాల అణచివేతను ఎదిరించి బీసీలను ముందుకు తీసుకెళ్లడంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎంతో కృషి చేశారు. పూలే గారి ఆశయాలను ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు, ఈనాడు అభినవ పూలేగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్‌బోన్ క్లాస్ అని చాటుతూ ఒకే సంతకంతో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, 33 లక్షల మందికి పైగా ఆడబిడ్డలకు ఇళ్ల పట్టాలిచ్చిన ఘనత జగన్ గారిదే. ఎన్నికల్లో బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్న కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక జోగి రమేష్, విడుదల రజని, కారుమూరి నాగేశ్వరరావు వంటి బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది. కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా బీసీ సెల్ నాయకులు భయపడరు; రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే.


 
పూలేది సామాజిక న్యాయమైతే.. చంద్రబాబుది కుటిల రాజకీయం
- టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే

సామాజిక న్యాయానికి తొలి పునాదులు వేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్మరించుకోవడం ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కులమత వివక్షలను ఎదిరించి, స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి తన భార్య సావిత్రిబాయిని ఉపాధ్యాయురాలిగా మార్చిన గొప్ప చరిత్రకారుడు పూలే గారు. స్వర్గీయ రాజశేఖరరెడ్డి గారి తనయుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకు 100 శాతం సామాజిక న్యాయం చేసి, 56 కార్పొరేషన్లతో పాటు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించారు. మహాత్మా పూలే గారిది సామాజిక న్యాయమైతే, చంద్రబాబుది కేవలం తన సామాజిక వర్గాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకునే కుటిల రాజకీయం. రాష్ట్ర జనాభాలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరం ఏకతాటిపైకి వచ్చి మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని పూలే సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం.
 

మంత్రివర్గంలో బీసీలకు అధిక ప్రాధాన్య‌త 
- ఏసురత్నం, ఎమ్మెల్సీ

సమాజంలోని అంటరానితనం, కులవివక్ష, దోపిడీని ప్రశ్నిస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష సేవలందించారు. తన సతీమణి సావిత్రిబాయి పూలే గారిని విద్యావంతురాలిని చేసి, ఆమె ద్వారా బలహీన వర్గాల స్త్రీలకు విద్యను ప్రోత్సహించిన మహానుభావుడు ఆయన. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారే స్వయంగా జ్యోతిరావు పూలే గారిని తన గురువుగా ప్రకటించడం ఆయన సేవా స్థాయికి నిదర్శనం. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు విద్య, ఉద్యోగాల్లో బలహీన వర్గాలను ఉన్నత స్థాయికి చేర్చగా, నేడు వైఎస్ జగన్ గారు చట్టసభల్లో, మంత్రివర్గంలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చి బీసీలను ముద్దుబిడ్డల్లా చూసుకున్నారు. బడుగు బలహీన వర్గాలందరూ మహానీయుడు పూలే ఆశయాలను స్మరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిస్తున్నాను.
 

మహిళలను రాజ‌కీయంగా ప్రోత్సహించింది జ‌గ‌నే 
- రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మాజీ మేయర్

ప్రతి మహిళ విద్యావంతురాలైతేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని నమ్మి, సావిత్రిబాయి పూలే గారి ద్వారా మహిళా విద్యకు బాటలు వేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే గారు. అభినవ పూలేగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 51 శాతం ప్రాధాన్యతనివ్వడంతో పాటు, 13 నగరాల్లో 9 మేయర్ పదవులను బీసీలకు కేటాయించి చరిత్ర సృష్టించారు. నేడు కూటమి ప్రభుత్వం విజయవాడ మహానగరంలో రాజ్యసభ స్థానం నుంచి డిప్యూటీ మేయర్ పదవి వరకు ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వకుండా అగ్రకులాలకే కట్టబెట్టింది. ఎన్నికల ముందు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో నాటకాలాడిన కూటమి నేతలు, నేడు బీసీలను అణగదొక్కుతూ వెన్నుపోటు పొడుస్తున్నారు. మనల్ని ప్రోత్సహించి ప్రథమ పీట వేసిన నాయకుడు ఎవరో బీసీలందరూ కళ్లు తెరిచి గ్రహించాలి.
 
బడుగు వర్గాలకు ఉన్నత విద్యను చేరువ చేశాడు 
- రవిచంద్ర, పార్టీ స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల చదువు, అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు చేసిన కృషి చిరస్మరణీయం. పూలే గారి ఆశయాలను పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా బడుగు వర్గాల పిల్లలకు ఉన్నత విద్యను చేరువ చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో సైతం 35 శాతం సీట్లు ఉచితంగా ఇప్పించడంతో పాటు, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీల అభ్యున్నతికి కృషి చేశారు. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు నాయుడు ప్రజలను దారుణంగా మోసగించారు. అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలంటే మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి.
 

మ‌ళ్లీ జ‌గ‌న్ సీఎం అయితేనే బీసీలకు బంగారు భవిష్యత్తు 
- తోలేటి శ్రీకాంత్, పార్టీ చేతి వృత్తుల విభాగం అధ్య‌క్షుడు 

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 136వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం ఎంతో గర్వకారణం. కులవివక్షపై పోరాడేందుకు సత్యశోధక్ సమాజ్ స్థాపించడంతో పాటు, మహిళలకు విద్య అవసరమని దేశంలో తొలిసారిగా చాటిచెప్పిన మహనీయుడు పూలే గారు. గడిచిన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, బీసీలకు రాజ్యాధికారం కల్పించి పూలే ఆశయాలను ఆచరణలో చూపారు. నేటి కూటమి ప్రభుత్వం 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తామన్న హామీని గాలికొదిలేసి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వకుండా మోసగిస్తోంది. కూటమి పార్టీలను బంగాళాఖాతంలో కలిపి, బీసీల బంగారు భవిష్యత్తు కోసం మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు సమిష్టిగా పోరాడతాం.

Back to Top