తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులా మారాయని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీ జే ఆర్ సుధాకర్ బాబు అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్ని దౌర్జన్యాలు, బెదిరింపులు చేసినా ప్రజలు వైయస్ఆర్‌సీపీ వైపే నిలిచారని పేర్కొన్నారు. 2021లో వైయస్ఆర్‌సీపీ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 13,031 స్థానాలకు గాను 10,536 స్థానాలు గెలిచి 81 శాతం స్ట్రైక్‌రేట్ సాధించామని తెలిపారు. ప్రస్తుత తొలిదశలో 3,189 స్థానాలకు ఎన్నికలు జరగగా, ఏకగ్రీవాలతో కలిపి వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులు 1,200కుపైగా స్థానాల్లో విజయం సాధించారని చెప్పారు. అర్బన్ ఎన్నికల తరహాలోనే పంచాయతీల్లోనూ వైయస్ఆర్‌సీపీ ఓటు శాతం 35 శాతానికి తగ్గలేదని, చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే 25 పంచాయతీలను వైయస్ఆర్‌సీపీ కైవసం చేసుకుందని తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం తిమ్మాపురంలో వైయస్ఆర్‌సీపీ మద్దతుదారు రేణుక 23 ఓట్లతో గెలిచినా నాలుగుసార్లు రీకౌంటింగ్ చేయించారని ఆరోపించారు. ఫలితాన్ని మార్చేందుకు ఎమ్మెల్యే సురేంద్రబాబు ఒత్తిడి తెచ్చి, ఆర్వో కాంతారాజును భార్యాపిల్లల ముందే కొడతానంటూ బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. నిజాయితీగా విధులు నిర్వహించే ఉద్యోగులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గం వానగట్టుపల్లిలో 45 ఓట్ల మెజారిటీతో వైయస్ఆర్‌సీపీ మద్దతుదారు మోహన్ గెలిచినా ఫలితాన్ని ఆలస్యం చేశారని, కౌంటింగ్ కేంద్రంలో లైట్లు ఆర్పి బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నం జరిగిందని సుధాకర్‌బాబు ఆరోపించారు. ఈ ఘటనలో వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం కార్యకర్త రాజేంద్ర మృతి చెందారని, ఘటనపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కాన్వాయ్‌లోని కారు మహిళా మద్దతుదారులపైకి దూసుకెళ్లి ఇద్దరు గిరిజన మహిళలు గాయపడే పరిస్థితి ఏర్పడినా పోలీసులు ఇప్పటివరకు వాహనాన్ని సీజ్ చేయలేదని విమర్శించారు. ఎన్నికలు సజావుగా జరిగితే ఓడిపోతామనే భయంతోనే కూటమి నేతలు తమ శ్రేణులను రెచ్చగొడుతున్నారని, మిగిలిన రెండు, మూడు విడతల ఎన్నికల్లోనూ వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ధైర్యంగా పోరాడి సత్తా చాటుతాయని సుధాకర్‌బాబు తెలిపారు.