ఎమ్మెల్యే సురేంద్రబాబుని త‌క్ష‌ణ‌మే పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాలి

ఆయ‌న‌పై సుమోటోగా కేసు న‌మోదు చేయాలి

న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి డిమాండ్ 

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్స‌న‌ర్స్ వింగ్ అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి 

తాడేప‌ల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజాయితీగా విధులు నిర్వర్తించిన రిటర్నింగ్ అధికారి కాంతరాజును ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషిస్తూ, భార్యాపిల్లల ముందే చంపేస్తానని బెదిరించిన కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్ర బాబును పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ రాక్షస పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నెల 26న జరిగిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం తిమ్మాపూర్ పంచాయతీలో టీడీపీ నేతలు నాలుగుసార్లు రీకౌంటింగ్ చేయించినా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు రేణుక 29 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని తెలిపారు. నిబంధనల ప్రకారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచినట్లు డిక్లరేషన్ ఇచ్చినందుకు మరుసటి రోజే ఎమ్మెల్యే అలిమినేని సురేంద్ర బాబు ఆ ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి, ఉద్యోగులందరినీ అసభ్య పదజాలంతో దూషిస్తూ ప్రాణహాని తలపెట్టేలా బెదిరించడం అత్యంత హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బెదిరింపులతో తీవ్ర భయాందోళనలో ఉన్న ఆ అధికారి బయటకు వచ్చి ఫిర్యాదు చేయలేని పరిస్థితి ఉందని, కాబట్టి కలెక్టర్, ఎస్పీ లేదా కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేసి సురేంద్ర బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం ఉందన్న దురహంకారంతో చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులు, రిటర్నింగ్ అధికారులు, పోలీసుల మెడపై కత్తి పెట్టి బలవంతంగా తప్పుడు పనులు చేయిస్తోందని మండిపడ్డారు. ఓట్లు రాకపోయినా, గెలవకపోయినా తమ అభ్యర్థులనే విజేతలుగా ప్రకటించాలని ఉద్యోగులను తిట్టి, కొట్టి భయభ్రాంతులకు గురిచేయడానికి చంద్రబాబు తమ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారా అని నిలదీశారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ఉద్యోగులను ఇలాగే బెదిరిస్తూ పోతే ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులందరూ ఏకమై తిరగబడే రోజు తప్పకుండా వస్తుందని హెచ్చరించారు.

అలాంట‌ప్పుడు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌నే ఎన్నిక‌ల విధుల్లో పెట్టుకోవాల్సింది: 

కార్పొరేషన్, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా టీడీపీ గుండాలు అడ్డుకోవడం, కిడ్నాపులు చేయడం, చిత్తూరు ఎంపీ మిథున్ రెడ్డి గంటల తరబడి నిలబడినా అధికారులు ఫారాలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయ‌డ‌మేన‌ని దుయ్యబట్టారు. అధికారి సంతకం పెట్టి తీసుకున్న నామినేషన్ పత్రాల్లోని సర్టిఫికెట్లను కావాలని మాయం చేసి ఇన్‌వ్యాలిడ్ అనడం, స్క్రూటినీకి రాకుండా అభ్యర్థులను పోలీసులతో అడ్డుకోవడం వంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కౌంటింగ్ గది తలుపులు వేసి, కరెంట్ తీసేసి వైఎస్సార్‌సీపీ బ్యాలెట్ పేపర్లను పక్కన పడేయడమే కాకుండా, ప్రజాతీర్పుతో మా అభ్యర్థులు గెలిచినా లెక్కకు మించి రీకౌంటింగ్ చేయిస్తూ ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులను గెలిచినట్లు డిక్లేర్ చేయించుకుంటున్నారని విమర్శించారు. ఇంతటి దౌర్జన్యాలకు పాల్పడుతూ, బ్యాలెట్ పేపర్ల ఎన్నికల్లో ప్రజలు తమ పాలన చూసి గెలిపించారంటూ చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అధికారులను బెదిరించి రిగ్గింగ్ చేయించే బదులు టీడీపీ కార్యకర్తలనే ఎన్నికల విధుల్లో నియమించుకుంటే సరిపోతుందని చురకలంటించారు. మిగిలిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లోనైనా పోలీసులు, ఉద్యోగులు అధికార పార్టీకి తొత్తులుగా ఉండకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి గెలిచిన వారినే విజేతలుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనల ప్రకారం నిజాయితీగా విధులు నిర్వర్తించే ఉద్యోగులకు వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నలమారు చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top