టీడీపీ ఏకగ్రీవాల కోసం వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు అన్యాయం చేయొద్దు

: మాజీ మంత్రి సాకే శైలజానాథ్ 

అనంత‌పురం జిల్లా: స్థానిక ఎన్నికల ప్రక్రియలో అధికారులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ కోరారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఐ ప్రసాద్‌ను కోరారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా వ్యవహరించి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవాలు సాధించారని సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు అన్యాయం జరిగేలా చేసి టీడీపీ ఏకగ్రీవాలు చేసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు తీర్పుతో గెలిచిన వారే నిజమైన ప్రజాప్రతినిధులని స్పష్టం చేశారు. అధికారులు ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని కోరారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాల్లో ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని పోలీసులను కోరారు. 

Back to Top