తాడేపల్లి : అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయాల పెంపుపై వైయస్ జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణాల పేరుతో భారీగా అంచనాలు పెంచుతోందని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. 2018లో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ వ్యయం రూ.2,271 కోట్లు ఉండగా, 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లు రద్దు చేసి అంచనాలు పెంచారని వైయస్ జగన్ పేర్కొన్నారు. 2025 ఏప్రిల్‌లో మళ్లీ అదే పనులకు కాంట్రాక్టులు ఇచ్చి విలువను రూ.4,689 కోట్లకు పెంచారని, తాజాగా అదే పనులకు అంచనాలు రూ.6,641 కోట్లకు చేరాయని తెలిపారు. అద్దాలు, ఏసీలు తదితర పనులకు మరో రూ.4,830 కోట్లు కలిపితే ఐదు భవనాలు, 52.20 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి మొత్తం వ్యయం రూ.15,317 కోట్లకు చేరుతోందని వివరించారు. చదరపు అడుగుకు రూ.29,340 ఖర్చు చేయడంపై వైయస్ జగన్ ప్రశ్నలు లేవనెత్తారు. ఇసుక ఉచితం, విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు, సీనరేజ్, ఎన్‌ఏసీ ఛార్జీల మినహాయింపులు ఉన్నప్పటికీ ఇంత భారీ వ్యయం ఎందుకని ప్రశ్నించారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో ఫైవ్‌స్టార్ స్థాయి సదుపాయాలతోనూ చదరపు అడుగుకు రూ.5 వేలకుపైగా ఖర్చు లేదని పేర్కొంటూ అమరావతిలో ఇంతటి భారీ వ్యయం వెనుక కారణమేంటని చంద్రబాబును నిలదీశారు. ప్రజలపై అప్పుల భారం మోపుతూ కాంట్రాక్టర్లకు భారీ ప్రయోజనాలు కల్పిస్తున్నారని, అమరావతి నిర్మాణాల పేరుతో జరుగుతున్న వ్యవహారాలపై సమగ్రంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని వైయస్ జగన్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు. వైయస్ జగన్ ఎక్స్ వేదికగా.. అమరావతిలో నీ ‘కలెక్షన్ రేటు’, నీ “కరప్షన్ రేటు’’ అదిరిందయ్యా చంద్రబాబు…! SFTకి రూ.30 వేలా? ఏంటి బాబూ… బంగారంతో కడుతున్నావా? ▪️2018లో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ వ్యయం – రూ.2,271 కోట్లు. ▪️2024లో అధికారంలోకి రాగానే టెండర్ల రద్దు, భారీగా అవే బిల్డింగులకు అంచనాల పెంపు. ▪️2025 ఏప్రిల్‌లో మళ్లీ అవే కంపెనీలకు, అవే పనులు. ▪️ఈసారి కాంట్రాక్టు విలువ ఏకంగా రూ.4,689 కోట్లకు పెంపు. ▪️ఇప్పుడు మళ్లీ అవే పనులకు, మళ్లీ అంచనాల పెంపు. మొత్తం విలువ రూ.6,641 కోట్లు. ▪️దీనికి అదనంగా అద్దాలు, ఏసీలు సహా ఇతర పనులకు మరో రూ.4,830 కోట్లు. ▪️ఇప్పటికి ఆ 5 భవనాలు, 52.20 లక్షల SFT నిర్మాణ వ్యయం – రూ.15,317 కోట్లు! అంటే చంద్రబాబూ అమరావతిలో నీ స్పెషల్ రేటు.. SFTకి రూ.29,340 ఏంటి? ఏమైనా బంగారంతో కడుతున్నావా? పైగా ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, సీనరేజ్, NAC ఛార్జీల మినహాయింపు. కడుతున్నది ఉద్యోగులు పనిచేసే భవనాలే కదా బాబూ? బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో సైతం ఫైవ్‌స్టార్ సదుపాయాలతో కూడా SFTకి రూ.5 వేలు మించి లేదు. మరి చంద్రబాబుగారూ… అమరావతిలో ఈ స్పెషల్ రేటు ఏంటి? అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలా? లేక ఇంటర్నేషనల్ స్థాయి అవినీతా? ప్రజల నెత్తిన అప్పులు… మీ వాళ్లకు భారీ కాంట్రాక్టులు… మీకేమో ముడుపులు. ఇది అమరావతిలో జరుగుతున్న మాయ! అదిరిందయ్యా చంద్రబాబూ… నీ లూటీ తంత్రం…