తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడినప్పటికీ ప్రజలు వైయస్సార్సీపీ వైపే నిలబడ్డారని పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో తమ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మొత్తంగా సాధించిన స్థానాల కంటే మెరుగ్గా.., ఈ దఫా కేవలం తొలివిడతలోనే వైయస్సార్సీపీ సానుభూతిపరులు ఘనవిజయం సాధించారని పేర్కొన్నారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేక ఎల్లో మీడియా ఏకంగా ప్రజలనే తిట్టిపోస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఆర్వోను బూతులు తిడుతూ ఇంటికొచ్చి కొడతానని బెదిరించడం, ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ కాన్వాయ్ కారును గిరిజన మహిళల మీదకు ఎక్కించడం, సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో బ్యాలెట్ బాక్సుల మార్పిడికి ప్రయత్నించి వైయస్సార్సీపీ కార్యకర్తను వాహనంతో తొక్కించి చంపడం వంటి దారుణాలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి పాలనకు ఇక కేవలం 700 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, రానున్న రోజుల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఆయన ఏమన్నారంటే: తొలిదశ ఫలితాలు కూటమికి చెంపపెట్టు : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులా మారాయి. 2021లో వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13,031 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే, పార్టీ గుర్తు లేకపోయినా వైయస్సార్సీపీ సానుభూతిపరులు 10,536 స్థానాల్లో గెలిచి 81 శాతం స్ట్రైక్ రేట్ సాధించారు. నాడు టీడీపీ కేవలం 2,100 స్థానాల్లో గెలిచి 15 శాతానికే పరిమితమైంది. కానీ ఇప్పుడు తొలిదశలో 3,189 స్థానాలకు ఎన్నికలు జరిగితే, అధికార పార్టీ రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని తట్టుకుని ఏకగ్రీవాలతో కలిపి మా సానుభూతిపరులు 1,200 పైచిలుకు స్థానాలు దక్కించుకున్నారు. గతంలో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన స్థానాలతో పోల్చుకుంటే... ఇప్పుడు తొలివిడతలోనే మా వాళ్లు ఎక్కువ స్థానాలు సాధించారు. అర్బన్ ఎన్నికల తరహాలోనే.. ఇప్పుడు తొలిదశలోనే మా ఓటు శాతం 35 శాతానికి ఏమాత్రం తగ్గలేదు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే 25 పంచాయతీలను వైయస్సార్సీపీ కైవసం చేసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లోనే అధికార పార్టీ ఓటమి పాలవ్వడంతో చంద్రబాబు, లోకేష్‌లకు నిద్ర పట్టడం లేదు. ఈ ఫలితాలను చూసి పచ్చ మీడియా ఏకంగా ఓటర్లనే తిట్టిపోస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే: ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం తిమ్మాపురంలో 23 ఓట్లతో వైయస్సార్సీపీ మద్దతుదారు రేణుక గెలిచారు. నాలుగుసార్లు రీకౌంటింగ్ చేసినా మా అభ్యర్థే గెలవడంతో ఫలితాన్ని మార్చాలని ఎమ్మెల్యే సురేంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. అక్రమాలకు అంగీకరించని ఆర్వో, ఉపాధ్యాయుడు కాంతారాజును ఆయన అత్యంత దారుణంగా బూతులు తిట్టారు. నీ ఇంటికి వచ్చి భార్యాపిల్లల ముందే కొడతానని బెదిరించారు. ఇదేనా చంద్రబాబు విజనరీ పాలన? నిజాయితీగా విధులు నిర్వహించే కాంతారాజు లాంటి ప్రభుత్వ ఉద్యోగులకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సైన్యం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. అదే సమయంలో అధికార పార్టీకి తప్పుడు పనుల్లో సహకరించే అధికారుల చిట్టాను కూడా మేము గుర్తుపెట్టుకుంటాం. అఖిలప్రియ కాన్వాయ్ కింద గిరిజన మహిళలను తొక్కేస్తారా?: ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రత్యర్థుల అంతుచూస్తామని బహిరంగంగా బెదిరించారు. ఆమె నేరుగా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి రిగ్గింగ్ చేయడమే కాకుండా, అడ్డుకున్న మా శ్రేణులపై కర్రలు, రాడ్లతో దాడి చేయించారు. అంతటితో ఆగకుండా అఖిలప్రియ కాన్వాయ్‌లోని ఒక కారు వైయస్సార్సీపీ మహిళా మద్దతుదారుల మీదకు దూసుకెళ్లింది. ఆ కారు కింద చిక్కుకున్న జంగిలి లక్ష్మీదేవితో పాటు మరో గిరిజన మహిళను స్థానికులు కారు ఎత్తి కాపాడారు. ఇంత జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారే తప్ప ఇప్పటివరకు ఆ కారును సీజ్ చేయలేదు, డ్రైవర్‌ను అరెస్ట్ చేయలేదు. అఖిలప్రియ కనీసం ఆ మహిళలను పరామర్శించలేదు. కుప్పంలో బ్యాలెట్ బాక్సుల మార్పిడి.. కార్యకర్త హత్యపై సీబీఐ విచారణ జరపాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని వానగట్టుపల్లిలో మా సానుభూతిపరుడు మోహన్ 45 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సాయంత్రం 5 గంటలకే లెక్కింపు పూర్తయినా రాత్రి 7 గంటల వరకు ఫలితాన్ని ప్రకటించకుండా ఆపారు. టీడీపీ జెడ్పీటీసీ రాజగోపాల్ తమ్ముడు పోలీసుల అండతో కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లగానే లైట్లు ఆర్పేసి, బయట ఉన్న తెల్ల వాహనంలోని డమ్మీ బ్యాలెట్ బాక్సులతో మార్చే ప్రయత్నం చేశారు. దీనిని అడ్డుకునేందుకు పరిగెత్తిన మా శ్రేణుల మీదకు మొబైల్ రూట్ ఆఫీసర్ పేరుతో ఉన్న తెల్ల వాహనం దూసుకెళ్లింది. ఆ వాహనం ఢీకొని మా రైతు విభాగం కార్యకర్త రాజేంద్రను రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి అతి దారుణంగా చంపేశారు. కౌంటింగ్ కేంద్రానికి పది అడుగుల దూరంలో ఆ రూట్ ఆఫీసర్ వాహనం ఎందుకు ఉంది? ఆ డ్రైవర్ ఎవరో బయటపెట్టాలి. చనిపోయిన రాజేంద్ర మా పార్టీ కార్యకర్త అని మా ఐడీ కార్డు స్పష్టంగా చెబుతుంటే, టీడీపీ కార్యకర్త అంటూ ఈనాడు పత్రిక దిగజారుడు రాతలు రాస్తోంది. కుప్పంలో జరిగిన ఈ ఘటనపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించాలి. రాబోయేది వైయస్ జగన్ ప్రభుత్వమే: ఈ నేపధ్యంలో ఎన్నికలు సజావుగా జరిగితే ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు, లోకేష్ టెలికాన్ఫరెన్స్‌లు పెట్టి ఏం చేసైనా రెండు, మూడు విడతల్లో ఫలితాలు మార్చాలని శ్రేణులను రెచ్చగొడుతున్నారని సుధాకర్ బాబు మండిపడ్డారు. పెద్దబాబు, చిన్నబాబులు తలకిందులుగా తపస్సు చేసినా మీ బలుపు కేవలం 700 రోజులు మాత్రమే ఉంటుందని.. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టిన పాపం మిమ్మల్ని వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజలు 30 శాతం ఫలితం ఇచ్చారు, మిగిలిన 70 శాతం ఫలితం కూడా వైయస్సార్సీపీకే ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు, మూడు విడతల ఎన్నికల్లోనూ మా కార్యకర్తలు కొదమ సింహాల్లా పోరాడి వైయస్సార్సీపీ సత్తా చాటడంతో పాటు, రానున్న రోజుల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తేల్చి చెప్పారు.