దోపిడీ శాస్త్రంలో చంద్ర‌బాబుకి డబుల్ పీహెచ్‌డీ

 మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ధ్వ‌జం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు

 అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణంలో ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని దోపిడీ

 సెక్రటేరియట్ ఐదు భవనాల అంచనాలు రూ.2,271 కోట్ల నుంచి ఏకంగా రూ.15,313 కోట్లకు పెంపు 

 ఇసుక ఫ్రీ, సిమెంట్, ఐర‌న్ ధ‌రల్లో మార్పు లేకున్నా అమాంతం పెరిగిన అంచ‌నాలు

 చంద్ర‌బాబు త‌న‌కు, త‌న బినామీలకు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌ల్పించే ప్రాజెక్టుగా అమ‌రావ‌తిని మార్చేశాడు

 ల‌క్ష‌ల కోట్ల అప్పులు తెస్తూ ప్ర‌జ‌ల‌పై భారం మోపుతున్నాడు

 వివ‌రాలు వెల్ల‌డించిన‌ మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు 

 రుషికొండ భ‌వ‌నాలు పర్యాట‌క అభివృద్ధి సంస్థ ద్వారా క‌ట్టిన ప్ర‌భుత్వ ఆస్తి 

 రాష్ట్రపతి, ప్రధాని, విదేశీ అతిథులు విశాఖలో బస చేసేందుకు వీలుగా నిర్మాణం 

 అది జ‌గ‌న్ సొంత ఇల్లు అంటూ రెండున్న‌రేళ్లుగా కూట‌మి ప్ర‌భుత్వం త‌ప్పుడు ప్ర‌చారం 

 అది చంద్ర‌బాబు క‌ట్టిన వ‌ర్షానికి కారిపోయే నాసిర‌కం నిర్మాణాలు కావు 

 రెండున్న‌రేళ్ల త‌ర్వాత టికెట్లు పెట్టి సంద‌ర్శ‌న‌కు పిల‌వ‌డం వెనుక ఉద్దేశం ఏమిటి? 

 అంబ‌టి రాంబాబు సూటి ప్ర‌శ్న‌

 డీలిమిటేష‌న్ బిల్లుపై పార్టీ నిర్ణ‌యాన్ని జ‌గ‌న్ గారే ప్ర‌క‌టిస్తారని వివ‌ర‌ణ 

తాడేప‌ల్లి: రాష్ట్రంలోని వనరులను ఎలా దోచుకోవాలనే 'దోపిడీ శాస్త్రం'లో ముఖ్యమంత్రి చంద్రబాబు డబుల్ పీహెచ్‌డీ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి బాగోతాన్ని ఎండగట్టారు. 2014లో రూ.2,271 కోట్ల అంచనాతో ప్రారంభించిన సెక్రటేరియట్ ఐదు భవనాల నిర్మాణ వ్యయాన్ని నేడు ఏకంగా రూ.15,313 కోట్లకు పెంచి, చదరపు అడుగుకు రూ.30 వేల చొప్పున ఖ‌ర్చు చేస్తూ, కిక్ బ్యాక్స్ తీసుకుంటూ ప్రపంచంలోనే ఎక్కడా లేని దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైజాగ్‌లో వైఎస్ జగన్ గారి ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ అనుమతులతో పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా సుమారు రూ.451 కోట్లతో నిర్మించిన రుషికొండ భవనాన్ని రెండున్నరేళ్లుగా సద్వినియోగం చేసుకోకుండా ఇప్పుడు సందర్శనకు తెరవడం వెనుక ఉద్దేశమేంటని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ ఆస్తి అయిన ఆ భ‌వ‌నాన్ని రెండున్న‌రేళ్లుగా జగన్ సొంత ఇల్లంటూ తప్పుడు ప్రచారం చేసి బుర‌ద‌జ‌ల్లార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నెల 30న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ బిల్లుపై వైఎస్ జగన్ గారు పార్టీ నాయ‌కులంద‌రితో సంప్రదించిన తర్వాత ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంబ‌టి రాంబాబు తెలియ‌జేశారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

చ‌ద‌ర‌పు అడుగు నిర్మాణానికి రూ. 30 వేలు: 
చంద్రబాబు ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారో లేదో తెలియదు కానీ, రాష్ట్రంలోని వనరులను ఎలా దోచుకోవాలనే దోపిడీ శాస్త్రంలో మాత్రం డబుల్ పీహెచ్‌డీ చేసి ఉంటారు. 2014లో రూ.2,271 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన సెక్రటేరియట్ ఐదు భవనాల అంచనాలను నేడు ఏకంగా రూ.15,313 కోట్లకు పెంచి ప్రపంచంలోనే ఎక్కడా లేని దోపిడీకి పాల్పడుతున్నారు. ఇసుక ఫ్రీ అంటున్నారు, సిమెంట్, ఐరన్ ధరలు ఏమీ పెరగలేదు కానీ చదరపు అడుగు నిర్మాణానికి రూ.30 వేలు వెచ్చిస్తూ కిక్ బ్యాక్స్ తీసుకుంటున్నారు. తమిళనాడులో విజయ్ రూ.1,200 కోట్లతోనే సెక్రటేరియట్ నిర్మించాలని చూస్తుంటే, ఇక్కడ మాత్రం ఐదు భవనాలకు రూ.15 వేల కోట్లు దోచుకుని తండ్రీకొడుకులు బ్యాగుల్లో సొమ్ము సర్దుకుని హైదరాబాద్, సింగపూర్ తరలిస్తున్నారు. ప్రతి వంద రోజులకి అమరావతి రూపురేఖలు మారిపోతున్నాయని లోకేష్ ట్వీట్ చేశారు కానీ, నిజానికి మారుతున్నది బిల్లులు పెంచి కమీషన్లు కొట్టేస్తున్న ఆయన ఆస్తుల రూపురేఖలే. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని ఒప్పించి, 2014-19 మ‌ధ్య దాన్ని చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారని సాక్షాత్తు ఆయన భాగస్వామి ప్రధాని మోడీ గారే చెప్పారు. ఇప్పుడు అదేవిధంగా 2024 నుంచి అమరావతి రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు తనకు, తన కుటుంబానికి, తన అనుయాయులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించుకునే వేదికగా మార్చుకున్నారు. రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు తెస్తూ, ప్రజలపై భవిష్యత్తులో తీర్చాల్సిన ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. ప్రజల పేరుతో అప్పులు చేసి, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ రాజధాని, పోలవరం ప్రాజెక్టులలో దోచుకుతింటున్న తీరును విజ్ఞులైన రాష్ట్ర ప్రజానీకం గమనించాలి. ఇంతటి దారుణమైన, దుర్మార్గమైన దోపిడీ ప్రపంచంలో మరెక్కడా జరిగి ఉండదు. 

రుషికొండ భ‌వ‌నాలు ప్ర‌జ‌ల ఆస్తి: 
డీలిమిటేషన్, స్థానిక ఎన్నికల గందరగోళం మధ్య ధరల పెంపును కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు. విశాఖపట్నంలో కేంద్ర అనుమతులతో టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.451 కోట్లతో నిర్మించిన అత్యుత్తమ ప్రభుత్వ భవనాన్ని 'జగన్ ఇల్లు' అని రెండున్న‌రేళ్లుగా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఈ రెండున్నర సంవత్సరాలుగా ఆ భవనాన్ని ఉపయోగంలోకి తీసుకురాకుండా ఖాళీగా వదిలేసి, నిర్వహణకు మాత్రం నెలకు పాతిక లక్షలు ఖర్చు పెడుతున్నారు. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, విదేశీ అతిథులు, పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు బస చేసేందుకు సర్క్యూట్ హౌస్ తప్ప సరైన ప్రభుత్వ భవనం లేదు. అలాంటి అవసరాల కోసం జగన్ గారి హయాంలో అత్యంత నాణ్యతతో నిర్మించిన ప్రభుత్వ భవనాన్ని సద్వినియోగం చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. చంద్ర‌బాబు హయాంలో కట్టిన సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు చిన్న వర్షానికే పైనుంచి కిందదాకా తడిచిపోయేంత నాసిరకంగా ఉంటే, జగన్ గారు కట్టిన నాణ్యమైన భవనంపై ఎల్లో మీడియాలో పిచ్చి రాతలు రాయిస్తున్నారు. ఏవైనా అక్రమాలు జరిగాయని మీకు అనుమానం ఉంటే విచారణ జరిపి వాస్తవాలు బయటకు తీసుకురావాలి. అంతేకానీ, ప్రజల భవనానికి టికెట్లు పెట్టి ప్రదర్శనకు ఉంచడం ద్వారా బురద జల్లాలని చూడటం దురదృష్టకరం. ఈ తప్పుడు ప్రచారానికి కూటమి ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. 

ఎన్నిక‌లు స్వేచ్ఛ‌గా జ‌రిగి ఉంటే వైఎస్సార్‌సీపీకే ఎక్కువ పంచాయ‌తీలు: 
ఈ నెల 30న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ బిల్లుపై వైఎస్ జగన్ గారు పార్టీ ముఖ్య నాయ‌కులంద‌రితో సంప్రదించిన తర్వాత పార్టీ తరపున స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం, సర్టిఫికెట్లు మాయం చేయడం, కౌంటింగ్‌లో కరెంట్ తీసేసి కట్టలు మార్చడం వంటి ఎనెన్నో దౌర్జన్యాలు చేశారు. అయినా సింబల్ లేని పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. పోలీసు ప్రయోగం లేకుండా, ఎస్‌ఈసీ, అధికారులు ధర్మంగా వ్యవహరించి స్వేచ్ఛగా ఎన్నికలు జరిపి ఉంటే టీడీపీ క‌న్నా ఎక్కువ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులే విజ‌యం సాధించేవారు. మేడికొండూరులో 19 నామినేషన్లకు గాను 18 నామినేషన్లను అక్రమంగా తిరస్కరించడం, మంగళగిరిలోనూ కుమ్మక్కై కట్టలు మార్చే ప్రయత్నాలు చేయడం లాంటి ఘ‌ట‌న‌ల‌కు ప్రజలు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో రిటర్నింగ్ అధికారులు, పోలీసులతో తప్పుడు పనులు చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఏమాత్రం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులందరి పేర్లను మేము రికార్డు చేస్తున్నాం, భవిష్యత్తులో వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి తప్ప శాశ్వతం కాదని ఉద్యోగులు గుర్తుపెట్టుకుని, రూలింగ్ పార్టీకి తొత్తులుగా ఉండకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి. రాష్ట్రంలో సాగుతున్న ఈ రాక్షస పాలనకు, అవినీతి దోపిడీకి ప్రజలే త్వరలో ముగింపు పల‌కాల‌ని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హెచ్చ‌రించారు.

Back to Top