తాడేపల్లి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైయస్సార్సీపీ పట్ల కనబరుస్తున్న ఆదరణ చూసి భయంతోనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు విమర్శించారు. తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, అసలు ఎవరిది విజన్, ఎవరు విజనరీ — చంద్రబాబా? లేక వైయస్ జగనా? అని సూటిగా ప్రశ్నించారు. విశాఖపట్నం అభివృద్ధికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన రుషికొండ ప్రభుత్వ భవనాలపై కూటమి నేతలు ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అమరావతిలో చదరపు అడుగుకు రూ. 13 వేలు వెచ్చించి కట్టిన తాత్కాలిక భవనాలు చిన్నపాటి వర్షాలకే కారిపోయాయని ఎద్దేవా చేశారు. గతంలోనూ 2014–19 మధ్య దుబారా ఖర్చుల పేరిట రూ. 3,628 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే... హామీల అమలులో కూటమి ప్రభుత్వం బొక్కబోర్లా: చంద్రబాబు నాయుడు నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలవుతుందని ఎవరో చెప్పినట్లుగా, పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అసత్య ప్రచారాలతోనే రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటంగా ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం కనీసం సింగిల్ రన్ కూడా తీయలేక రన్ అవుట్ అయింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి దీపం-2 పథకం తెచ్చారు. ముందు డబ్బులు కట్టండి, తర్వాత ఖాతాల్లో వేస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏ పథకంలోనూ ప్రజలను ముందుగా డబ్బులు కట్టమని అడగలేదు. ఇప్పుడు ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితి లేకపోవడంతో, ఆ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఎల్లో మీడియా ద్వారా మళ్లీ రుషికొండ భవనాలపై విషప్రచారం మొదలుపెట్టారు. అసలు ఎవరు విజనరీ? వైయస్ జగనా.. చంద్రబాబా?: 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కనీసం ఒక వార్డు సభ్యుడికి, సర్పంచ్‌కు ఉండే హుందాతనం కూడా పాటించడం లేదు. విశాఖపట్నానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, విదేశీ రాయబారులు, పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు బస చేసేందుకు వీలుగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రూ. 400 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏడు ప్రభుత్వ భవనాలను రుషికొండపై నిర్మించారు. వాటిని జగన్ ప్యాలెస్‌లు అంటూ తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు అక్కడికి వెళ్లి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారు. అంత నాణ్యతతో భవనాలు కట్టడం తప్పా? మరోవైపు మీరు అమరావతిలో రూ. 600–700 కోట్లు వెచ్చించి, చదరపు అడుగుకు రూ. 13 వేల చొప్పున నిర్మించిన భవనాలు చిన్నపాటి వర్షానికే సీలింగ్ ఊడిపోయి సీఎం ఛాంబర్లోకే నీళ్లు కారాయి. ఇందులో ఎవరు విజనరీ అనేది ప్రజలే తేల్చుకోవాలి. విశాఖ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర శూన్యం: విశాఖపట్నం అభివృద్ధికి మేమే కారణమని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. విశాఖ అభివృద్ధిలో ఆయన పాత్ర గుండు సున్నా. తన సహజ సిద్ధమైన వనరులు, చరిత్ర వల్లే విశాఖ ఆర్థిక రాజధానిగా ఎదుగుతోంది. 39 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలో చంద్రబాబు భాగస్వామ్యమయ్యారు. పోలవరం ఎత్తు తగ్గించి బ్యారేజీగా మార్చడమే కాకుండా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఉరివేశారు. గతంలో రుషికొండపై మేము చేసిన అభివృద్ధిని విధ్వంసం అన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు విశాఖలో ఊరు పేరు లేని అనామక కంపెనీలకు భూములు కట్టబెడుతూ, పచ్చటి కొండల పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు? లోకేష్ భవిష్యత్తుపై భయంతోనే జగన్ వ్యక్తిత్వ హననం: 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు తన దుబారా ఖర్చులతో రూ. 3,628 కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అప్పులు తప్ప ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదు. వయసు పైబడుతున్న చంద్రబాబుకు తన కుమారుడు నారా లోకేష్ భవిష్యత్తుపై రాజకీయ అభద్రతా భావం పట్టుకుంది. ప్రజాబలం, వ్యూహాలు కలిగిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని లోకేష్ ఎదుర్కోగలడా అనే భయంతో చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. అందుకే పరిపాలనను గాలికి వదిలేసి, నిత్యం జగన్ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా జగన్ గారిని ఆపలేరు. 2029లో మళ్లీ వైయస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని రేగిడి లక్ష్మణరావు స్పష్టం చేశారు.