తాడేపల్లి: డీఎస్సీ–2025 నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల వినియోగంపై వైయస్ఆర్‌సీపీ మాజీ మంత్రి పేర్ని నాని పలు వివరాలను వెల్లడించారు. బీసీ–డీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికెట్లు జారీ చేసి, వాటి ఆధారంగా టీచర్ ఉద్యోగాలు పొందిన వ్యవహారంపై సమగ్రంగా పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంబంధిత అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే వెరిఫై చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు పొందినట్లు తేలితే చర్యలు తీసుకుని, అర్హత ఉన్న న్యాయమైన అభ్యర్థులకు పోస్టులు దక్కేలా చూడాలని పేర్ని నాని కోరారు. డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై పూర్తి స్థాయి పరిశీలనతో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇస్తోందని పేర్ని నాని విమర్శించారు. లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తుపై కూడా ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పటివరకు సిట్ దర్యాప్తులో ఒక్క రూపాయి కూడా స్వాధీనం కాలేదని, దర్యాప్తు టీవీ సీరియల్‌లా సాగుతోందని వ్యాఖ్యానించారు. టీటీడీ శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ గతంలో ప్రచారం జరిగిందని పేర్ని నాని ప్రస్తావించారు. ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్లు నిర్ధారణ కాలేదని ఈడీ పేర్కొందని ఆయన తెలిపారు.