విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావం, కరువు పరిస్థితులపై వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 17న నిర్వహించిన సమీక్ష అనంతరం కరువు మండలాల ప్రకటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైయస్ జగన్ అన్ని జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతుల పంట నష్టాలు, సాగునీటి కొరత, తాగునీటి సమస్యలు, పశుగ్రాసం కొరత, ఎరువుల సమస్యలపై జిల్లాల వారీగా సమీక్షించారు. కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించేలా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినట్లు నివేదికలు వెల్లడించాయి. సెప్టెంబర్ 24 నాటికి జిల్లా స్థాయి ప్రతిపాదనలు, సెప్టెంబర్ 29 నాటికి రాష్ట్రస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలో 513 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు అధికారుల నివేదికలో పేర్కొన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వర్షపాత గణాంకాల ప్రకారం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం వర్షపాతం లోటు నమోదైంది. ఇదే సమయంలో అనంతపురం జిల్లాలో 51.5 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 63.9 శాతం, అన్నమయ్య జిల్లాలో 70.5 శాతం, వైయస్సార్ కడప జిల్లాలో 56.5 శాతం, నంద్యాల జిల్లాలో 55.4 శాతం లోటు నమోదైంది. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైయస్ జగన్ కరువు పరిస్థితులపై కార్యాచరణకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనా, సాగునీరు, తాగునీరు, పశుగ్రాసం, ఎరువుల సరఫరా, పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది.