రైతుల సమస్యలపై పెనుకొండలో ధర్నా

కరువు పరిస్థితులను గుర్తించి అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

మాజీ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ డిమాండ్‌

 పెనుకొండ: రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా నిర్వహించారు. రొద్దం మండలంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో రైతు భరోసా/అన్నదాత సుఖీభవ సాయం, పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటలకు గిట్టుబాటు ధర, సాగునీరు, వ్యవసాయ విద్యుత్ వంటి సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ పంటలకు నీరు ఎంత అవసరమో విద్యుత్ కూడా అంతే అవసరమని, సరైన సమయంలో విద్యుత్ అందకపోతే సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయాలని, వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. పెనుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి, అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు.

రైతులకు పంట బీమా పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం సకాలంలో అందించాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉషాశ్రీ చరణ్ కోరారు. నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువుల వల్ల రైతులు నష్టపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించి దళారుల వల్ల రైతులు నష్టపోకుండా అవసరమైన చోట ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

కరువు పరిస్థితుల్లో పశుగ్రాసం కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న రైతులకు ప్రభుత్వం ఉచితంగా పశుగ్రాసం అందించాలని ఉషాశ్రీ చరణ్ కోరారు. రైతు భరోసా/అన్నదాత సుఖీభవ సాయం సకాలంలో అందించాలని, సాగునీటి సమస్యలను పరిష్కరించాలని, పంట నష్టపోయిన అర్హులైన ప్రతి రైతును ఆదుకోవాలని తెలిపారు. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, రైతుల సమస్యలను ప్రకటనలకు పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కొనసాగిస్తామని ఉషాశ్రీ చరణ్ స్పష్టం చేశారు.
 

Back to Top