కరువుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు

ఎన్టీఆర్ జిల్లాలో 48.2 శాతం వర్షపాతం లోటు 

: దేవినేని అవినాష్ వెల్లడి

విజయవాడ: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. చంద్రబాబు పాలనకు కరువు పరిస్థితులు కలిసి వస్తున్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు గత వైయస్‌ జగన్‌ పాలనను గుర్తు చేసుకోని రోజు లేదని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ హయాంలో రైతు భరోసా కేంద్రాలు, ఈ-క్రాప్, రైతు భరోసా వంటి కార్యక్రమాలతో రైతులకు అండగా నిలిచారని తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లాలో 48.2 శాతం వర్షపాతం లోటు ఉందని, జిల్లాలో 50 శాతానికి పైగా పంటలు సాగు కాలేదని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో ఉన్న 140 చెరువుల్లో 90 చెరువులు ఎండిపోయాయని తెలిపారు. నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో రైతుల పరిస్థితిని పట్టించుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయకుండా అంతా బాగానే ఉందన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ కరువు మండలాలను ప్రకటించలేని పరిస్థితి జిల్లాలో ఉందని దేవినేని అవినాష్ అన్నారు. నీరు అందక రైతులు పశువులను అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కరువుపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదని పేర్కొన్నారు. చంద్రబాబు వాటర్‌మ్యాన్‌ కాదు.. కరువు మేన్‌ అంటూ వ్యాఖ్యానించారు.

రైతుల సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని దేవినేని అవినాష్ తెలిపారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కంటే ఎల్లో ప్రభావం ఎక్కువగా ఉందంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు.

డీఎస్సీ వ్యవహారంలో రోజుకో అంశం వెలుగులోకి వస్తోందని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలపై విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పేర్ని నాని, అంబటి రాంబాబు డీఎస్సీ అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
 

Back to Top