రావులపాలెం: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. రావులపాలెంలోని వైయస్ఆర్‌సీపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ కరువు ప్రభావిత మండలాలను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. 2026 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 18 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 50 శాతం లోటు నమోదైందని, కోనసీమ జిల్లాలో 41.9 శాతం లోటు నమోదైందని తెలిపారు. కరువు మండలాలను శాస్త్రీయంగా గుర్తించి ప్రకటిస్తే పంట రుణాల రీషెడ్యూల్, పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా వంటి సహాయ చర్యలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. యూరియా, ఇతర ఎరువుల కొరతను వెంటనే పరిష్కరించి రైతులకు అవసరమైన మేరకు అందుబాటులో ఉంచాలని, మండలాల వారీగా అవసరాలను అంచనా వేసి సరఫరా చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్‌లో చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందేలా కాలువల నిర్వహణ, పూడికతీత, నీటి సరఫరాపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని వైయస్ఆర్‌సీపీ కోరింది. ఆక్వా రైతులు ఫీడ్, విద్యుత్, మందులు, ఇతర ఉత్పత్తి వ్యయాల భారాన్ని ఎదుర్కొంటున్నందున రొయ్యల ధరలు, ఫీడ్ ధరలు, ఉత్పత్తి వ్యయంపై ప్రభుత్వం రైతులు, ఆక్వా రంగ ప్రతినిధులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇసుక సరఫరా, తవ్వకాలు, మద్యం విక్రయాల్లో నిబంధనల అమలుపై పారదర్శక పర్యవేక్షణ ఉండాలని, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని కోరింది. రైతులకు ఎరువులు, సాగునీరు, పంటల బీమా, రుణాల ఉపశమనం, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి వ్యవసాయ సహాయాలను సకాలంలో అందించడంతో పాటు కరువు పరిస్థితులపై తక్షణ సమీక్ష నిర్వహించి అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని వైయస్ఆర్‌సీపీ కోరింది.