రాయచోటి: అన్నమయ్య జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాయచోటిలోని వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతుందని ముందుగానే అంచనాలు ఉన్నప్పటికీ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన ముందస్తు చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. సెప్టెంబర్ 18 నాటికి సాధారణ వర్షపాతంతో పోలిస్తే అన్నమయ్య జిల్లాలో 70.5 శాతం లోటు నమోదైందని, ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకున్నా అనేక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో సాగు జరగలేదని తెలిపారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాలను అంచనా వేసి రైతులకు తక్షణ సహాయం అందించాలని కోరారు. గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం సమగ్రంగా పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు. సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు గతంలో చేపట్టిన ప్రాజెక్టులు, రైతు సంక్షేమ చర్యలను ప్రస్తావిస్తూ ప్రస్తుతం పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించి, పంట నష్టాలను అంచనా వేసి నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించాలని వైయస్ఆర్‌సీపీ నేతలు కోరారు.