తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదాలకు ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలపలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్ధారించిన నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్.కే. రోజా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రమైనవని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ నిజం మరోసారి నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకం అంటగట్టే ప్రయత్నాలు ఇకనైనా నిలిపివేయాలని, రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని ఆమె కోరారు. పచ్చి పాలు లాంటి మనసు జగనన్నదని, పచ్చి పాలలో కల్తీకి ఆస్కారం ఉండదని ఆర్.కే. రోజా పేర్కొన్నారు. అదే విధంగా జగనన్న పాలనలోనూ కల్తీకి ఆస్కారం లేకుండా అంతా పవిత్రంగానే సాగిందనే విషయం బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిరూపితమైందని ఆమె పేర్కొన్నారు. శ్రీవారి ప్రసాదాల విషయంలో భక్తుల విశ్వాసాలకు ప్రాధాన్యత ఇస్తూ వాస్తవాలను మాత్రమే ప్రజల ముందుంచాలని ఆమె కోరారు.