పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలి

ఐడీ కార్డు కార్యకర్తలకు గుర్తింపు, రక్షణ

అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

 అనంతగిరి: పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రూపు రాజకీయాలు, విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి నిబద్ధతతో కలిసికట్టుగా పనిచేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. అనంతగిరి మండల కేంద్రంలోని ఆర్ఆర్ఆర్ రిసార్ట్స్ వద్ద మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, బూత్ కమిటీల పటిష్టత, ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మెజారిటీ స్థానాల్లో పార్టీ బలంగా ఉందని పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయాల్లో కార్యకర్తలు, నాయకులకు ఏదైనా పని ఉంటే తనను సంప్రదించాలని, సమస్య పరిష్కారానికి తన వంతు బాధ్యత తీసుకుంటానని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి ప్రజలకు సేవ చేస్తున్న నాయకులను ప్రతి పంచాయతీలో గుర్తించి ముందుకు తీసుకురావాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుడి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వరకు అభ్యర్థులను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే వారికే ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ఎమ్మెల్యే పలు విమర్శలు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారని, ‘తల్లికి వందనం’లో కోతలు విధించారని, కొత్త పింఛన్లకు పలు ఆంక్షలు పెట్టారని పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోబోమని స్పష్టం చేశారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ ఐడీ కార్డు ద్వారా కార్యకర్తలకు పార్టీ గుర్తింపుతో పాటు రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని కార్యక్రమంలో తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, అనంతగిరి ఎంపీపీ టి.మితుల, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పరిశీలకుడు వై.సన్యాసిరావు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు స్వామి, ఫోరమ్ అధ్యక్షుడు పి.అప్పారావు, ప్రధాన కార్యదర్శి డి.డేనియల్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు డి.గంగన్నదొర, బూత్ కమిటీ ఇంచార్జ్ విజయ్ పాంగి, వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీపీ డి.జయవర్ధని, మండల ఉపాధ్యక్షుడు పాడి కృష్ణమూర్తి, సోషల్ మీడియా ఇంచార్జ్ రామ్, ఎంపీటీసీ వై.నవీన్, సర్పంచులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, అనుబంధ విభాగాల నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ పంచాయతీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top