లడ్డూ ప్రసాదంపై విషప్రచారం బట్టబయలు

జంతు కొవ్వు వినియోగంపై సీబీఐ నేతృత్వంలోని సిట్‌ దర్యాప్తుతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి

టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి 

తిరుపతి: శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ప్రచారంపై సీబీఐ నేతృత్వంలోని సిట్‌ దర్యాప్తు వాస్తవాలను వెలుగులోకి తెచ్చిందని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. సిట్‌ దర్యాప్తులో లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని వచ్చిన నివేదికల నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంగా జరిగిన ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు పాలనలో జూలై 2024లో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్ల వ్యవహారం, వాటి సరఫరా, వినియోగంపై సిట్‌ దర్యాప్తులో కీలక అంశాలు వెల్లడయ్యాయని భూమన పేర్కొన్నారు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై దర్యాప్తు కొనసాగగా, సిట్‌ నివేదికలో పామ్‌ ఆధారిత నూనెలు, ఇతర పదార్థాలతో కల్తీ చేసిన నెయ్యి సరఫరా అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. తిరస్కరించిన ట్యాంకర్లను తిరిగి సరఫరా వ్యవస్థలోకి తీసుకువచ్చిన అంశాన్ని కూడా సిట్‌ పరిశీలించినట్లు వెల్లడైంది.

వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించారంటూ జరిగిన ప్రచారం రాజకీయ ప్రయోజనాల కోసం సాగిందని భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు ఇప్పటికీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయని విమర్శించారు. బోలెబాబా డైరీ, శ్రీ వైష్ణవి డెయిరీ తదితర సంస్థల ద్వారా నెయ్యి సరఫరా వ్యవహారంపై దర్యాప్తులో వచ్చిన అంశాలను ప్రజలకు పూర్తిగా వివరించాలని కోరారు.

నెయ్యి సరఫరా టెండర్లలో అర్హతలు, సంస్థల ఎంపిక, నాణ్యతా పరీక్షలు, సరఫరా ప్రక్రియలో జరిగిన లోపాలపై కూడా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయని భూమన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, రాష్ట్ర పోలీస్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతినిధులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే.

శ్రీవారి ప్రసాదాల పవిత్రతకు సంబంధించిన అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చకుండా దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలను ప్రజల ముందుంచాలని భూమన కరుణాకరరెడ్డి కోరారు. సీబీఐ నేతృత్వంలోని సిట్‌ దర్యాప్తు ఆధారంగా గతంలో జరిగిన ప్రచారంపై ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
 
 

Back to Top