మార్కాపురం: మార్కాపురంలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేయడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి డివిజన్, ప్రతి వార్డులో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని అన్నా రాంబాబు సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున కృషి చేయాలని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమని పేర్కొంటూ, ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ ఐక్యతతో ముందుకు సాగాలని అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను గుర్తించి వాటిపై ప్రజల తరఫున గొంతు వినిపించాలని, తద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్ సలీం, పార్టీ ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.