విశాఖపట్నం: విశాఖపట్నం ప్రజలు తీవ్ర నీటి కొరతతో అల్లాడుతున్న పరిస్థితుల్లో ఉంటే నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సమస్యపై స్పందించకుండా రాజకీయ విమర్శలకే వేదికను ఉపయోగించుకున్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆక్షేపించారు. విశాఖలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల పట్టాల రెగ్యులరైజేషన్, గృహ నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందని వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్ కార్మికుల జీతాలు, ఉద్యోగుల తొలగింపులు, ప్లాంట్ భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. నగరంలో మూడు, నాలుగు రోజులకోసారి నీరు వచ్చే పరిస్థితి ఉందని, ట్యాంకర్ల ద్వారా కూడా నీరు దొరకడం లేదని ప్రచార కార్యక్రమాలను, రాజకీయ విమర్శలు పక్కనపెట్టి తక్షణమే విశాఖ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం విశాఖ అభివృద్ధిని అడ్డుకునేలా విలువైన భూములను అనామక కంపెనీలకు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏమన్నారంటే..: విశాఖ నీటి సమస్యపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి విశాఖపట్నానికి వచ్చినప్పుడు నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యపై మాట్లాడతారని ఆశించాం. కానీ విశాఖలో నీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. మూడు రోజుల నుంచి నాలుగు రోజులకోసారి నీరు వచ్చే పరిస్థితి ఉంది. కనీసం ట్యాంకర్ల ద్వారా నీరు కొనుక్కుందామన్నా దొరకడం లేదు. పేదవాడి నుంచి ఉన్నవాడి వరకు అందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రేపటి నుంచి నీటి సమస్య తీరుతుందని, ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతారని ప్రజలు ఎదురుచూశారు. కానీ ఆ సమస్యను పక్కనపెట్టి ప్రతిపక్షాలపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, జగన్ గారిపై విమర్శలు చేయడానికి వేదికను ఉపయోగించుకున్నారు. ఈ ప్రభుత్వం విశాఖ ప్రజలకు కనీసం మంచి నీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పరిపాలన ఎందుకు అని ప్రజలు ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. విశాఖ భూములపై ఎన్నో ప్రశ్నలు 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములను బినామీలకు కట్టబెడుతున్నారు. ఊరూ పేరు లేని కంపెనీలకు వందలాది ఎకరాలు ఇచ్చారు. వాటిలో ఒక్క కంపెనీ అయినా నిర్మాణం చేపట్టిందా? స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చిన కంపెనీల్లో చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీలుగా కనిపిస్తున్నాయి. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతి రియల్ ఎస్టేట్‌కు దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతో విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. విశాఖకు నీరు కూడా అందకుండా పోతే పెట్టుబడిదారులు ఈ నగరం వైపు ఎందుకు చూస్తారు? విశాఖను అభివృద్ధిని పణంగా పెట్టి మరీ అమరావతిని ప్రమోట్ చేసుకోవాలన్న ఆలోచన రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది కాదు. స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.1,000 కోట్లు ఇచ్చాం, రూ.10 వేల కోట్లు ఇచ్చాం, రూ.20 వేల కోట్లు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ డబ్బులు ఎందుకోసం ఇచ్చారు? బ్యాంకు రుణాలు చెల్లించకపోతే ప్లాంట్ వేలానికి వెళ్లే పరిస్థితిని నివారించేందుకు కేంద్రం నిధులు విడుదల చేసి ఉంటే, దాన్ని కార్మికులను, ప్లాంట్‌ను ఉద్ధరించినట్లు చెప్పుకోవడం ఏమిటి? కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో 6,500 మందిని ఎందుకు తొలగించారు? పర్మినెంట్ ఉద్యోగులకు ఎందుకు వీఆర్‌ఎస్ ఇచ్చారు? ఈ రెండున్నరేళ్లలో కాంట్రాక్ట్, పర్మినెంట్ ఉద్యోగులు కలిపి దాదాపు 10 నుంచి 12 వేల మందిని తొలగించిన అంశానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నాలుగున్నర నెలలుగా కార్మికులకు జీతాలు లేవు. ప్లాంట్ భవిష్యత్తు ఏమిటో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ఉద్దేశమే లేకపోతే ఇప్పటివరకు ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయలేదు? కార్మికులకు ఎందుకు భరోసా ఇవ్వలేదు? ఇళ్ల పట్టాల పేరుతో డ్రామా వద్దు ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. 2019 నుంచి 2024 వరకు జగన్ గారి ప్రభుత్వం పేద కుటుంబాలకు భూములు ఇచ్చి, ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. విశాఖ నగరంలో సుమారు 1.30 లక్షల కుటుంబాలకు సొంత స్థలం ఇచ్చి, ఇళ్లు నిర్మించుకునే కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్నారు. పేదల సొంత ఇంటి కలను ఆపేశారు. 2019లో జీవో 463 ద్వారా అర్హులైన బీపీఎల్ కుటుంబాలకు ప్రభుత్వ భూములను రూపాయికే రెగ్యులరైజ్ చేసే అవకాశం కల్పించాం. 2021లో జీవో 225, 2023లో మరిన్ని రాయితీలు, జీవో 60 ద్వారా పట్టాలు పొందిన వారికి హక్కులు కల్పించాం. గాజువాక హౌస్ కమిటీ సమస్యకు కూడా జీవోలు తీసుకొచ్చి పరిష్కారం చూపాం. వీటి ద్వారా మా ప్రభుత్వం దాదాపు రూ.16 వేల కోట్లను భరించి పేద కుటుంబాలకు ప్రయోజనం కల్పించింది. ఇప్పుడు అదే కార్యక్రమాలను కొత్తవిగా చూపించుకోవడం ఎన్నికల స్టంట్ తప్ప మరొకటి కాదు. ముందు ప్రజల దాహం తీర్చండి ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు విశాఖ ప్రజలు పెన్షన్లు వద్దు, మహిళలకు ఇస్తామన్న రూ.1,500 వద్దు, పిల్లలకు ఇస్తామన్న రూ.15 వేలు వద్దు, నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3 వేలూ వద్దు.. కనీసం గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వండి అని అడిగే పరిస్థితి వచ్చింది. ముడసర్లోవ, మేదరగడ్డ, రైవాడ రిజర్వాయర్లు ఎండిపోయాయి. తాడిపూడి నుంచి నీరు రావడం లేదు. పోలవరం నీరు అనకాపల్లి వరకు వచ్చిందని చెబుతున్నారు. మరి ఆ నీరు విశాఖకు ఎందుకు రాలేదు? ఈ సమస్యపై ఒక్క మంత్రి అయినా సమీక్ష నిర్వహించారా? వచ్చే ఏడాది వర్షాలు పడతాయని చెప్పడానికి ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకోలేదు. కరవు పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, నగరానికి నీరు ఎలా అందించాలి, పరిశ్రమలకు నీరు ఎలా ఇవ్వాలన్న దానిపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. రాజకీయ విమర్శలు మానేసి తక్షణమే విశాఖ ప్రజల దాహార్తి తీర్చే చర్యలు చేపట్టాలని గుడివాడ్ అమర్నాథ్ డిమాండ్ చేశారు.