కూటమి ప్రభుత్వ అసమర్థతతో ఆదిదేవుడికే అవమానం

వినాయక నిమజ్జనానికి నీళ్లు లేక ఎండిన కాలువల్లో విగ్రహాలు

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఫైర్‌

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.

తిరుమల లడ్డూపై ఈడీ ప్రకటనతో బట్టబయలైన వాస్తవాలు

లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వులూ లేవన్న ఈడీ

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ స్వామివారికి క్షమాపణ చెప్పాల్సిందే

వెల్లంపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌

హిందూ సనాతన ధర్మం ఒక పచ్చి బూటకం

దేవుడితో రాజకీయ చెలగాటమాడిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌

వారిద్దరికీ దేవుడి శాస్తి తప్పదు 

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన వెల్లంపల్లి శ్రీనివాస్‌

తాడేపల్లి: సనాతన ధర్మ పరిరక్షకులమని గొప్పలు చెప్పుకునే కూటమి పార్టీల నేతలు, కనీసం హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఆదిదేవుడు వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి నీళ్లు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో పలుచోట్ల నిమజ్జనానికి నీళ్లు లేక విగ్రహాలను ఎండిన కాలువలు, వాగుల్లో అలానే వదిలిపెడుతున్నారని, అవి చూసి ప్రతి హిందువు హృదయం కలుక్కుమంటోందని ఆయన ఆవేదన చెందారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, బీజేపీ నేతల హిందుత్వం ఇప్పుడు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కనీసం నిమజ్జనానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా అని నిలదీశారు.
    మరోవైపు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ అత్యంత నిస్సిగ్గుగా మాట్లాడిన పచ్చి అబద్ధాలన్నీ 
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రకటన ద్వారా తేటతెల్లం అయిందని స్పష్టం చేశారు. అందుకు వారికి ఎప్పటికైనా తగిన శాస్తి తప్పదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

చవితి పండగపైనా ప్రభుత్వ నిర్లక్ష్యం.
గణనాధుల నిమజ్జనానికీ లేని అవకాశం:
    వినాయక చవితి అనేది పసిపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి హిందువు అత్యంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద పండుగ. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భక్తులు మండపాలు వేసి పూజలు చేసుకుంటే, కనీస ఏర్పాట్లు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బ తీసింది.  వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో ఆదిదేవుడైన గణనాథుడికి కూడా తీరని అపచారం జరుగుతోంది. మండపాల్లో ప్రత్యేకంగా పూజలందుకునే గణనాధులను నిమజ్జనం చేయడం శాస్త్రీయ ఆనవాయితీ. అయితే ఈసారి ఎల్లో నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో చాలా చోట్ల చెరువులు, కుంటలు ఎండిపోయాయి. దీంతో గణనాధుల విగ్రహాలను ఆ ఎండిన చెరువులు, కుంటల్లోనే వదిలేస్తున్నారు.
    అనంతపురం జిల్లా బుక్కరాయిసముద్రం వద్ద హెచ్‌ఎల్సీ కాలువలో నీరు లేక, ఎల్లనూరు ప్రాంతంలో చిత్రావతి పరిసరాల్లో నీటి కొరత వల్ల గణనాధుల విగ్రహాలను మట్టిలో, ఎండిన కాలువల్లో వదిలేయాల్సిన దారుణ పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వానికి, అధికారులకు ముందే తెలుసు. అటువంటప్పుడు నిమజ్జనం కోసం ప్రత్యామ్నాయంగా తాత్కాలిక కుంటల నిర్మాణం కూడా చేయలేదు. 

వైజాగ్‌లో పోలీసుల వేధింపులు:
    విశాఖపట్నంలో భక్తులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి మండపాలు వేసుకుంటే, పోలీసులు వెళ్లి బెదిరించి మండపాలు తీసేయమంటున్నారు. ఒక పక్క సకల శాఖ మంత్రి నారా లోకేష్‌ ట్విట్టర్‌లో నీతులు చెబుతుంటే, గ్రౌండ్‌లో మాత్రం అన్నదానాలు, పూజలు చేసుకోకుండా ట్రాఫిక్‌ సమస్య పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. కూటమిలో ఉన్న బీజేపీ నేతలను సూటిగా అడుగుతున్నాను.. జై శ్రీరామ్, జై గణేష్‌ అనే మీరు, మీ ప్రభుత్వంలో గణనాథుడికి జరుగుతున్న ఈ ఘోర అవమానంపై ఎందుకు నోరు మెదపడం లేదు?.

ఈడీ ప్రకటనతో బట్టబయలైన వాస్తవాలు:
    కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ అత్యంత దిగజారి విష ప్రచారం చేశారు. లడ్డూలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె, బాత్రూములు కడిగే కెమికల్స్‌ కలిపారంటూ సీఎం స్థానంలో ఉండి చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అయోధ్య రామాలయానికి పంపిన లక్ష లడ్డూలపై కూడా విషం చిమ్మిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, దేశవ్యాప్తంగా కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. కాగా, తాజాగా ఈడీ ప్రకటనతో తిరుమలలో వాడిన నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు లేనట్లు తేలింది.

పవన్‌ కళ్యాణ్‌ దీక్షల డ్రామా:
    సనాతన ధర్మం అంటూ 11 రోజులు దీక్ష చేసి, గుడి మెట్లు కడిగి మీడియా ముందు ఊగిపోయిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? రాజకీయ స్వార్థం కోసం, వైయస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని ఇంత నీచానికి ఒడిగడతారా?.

కొండపైకి నడిచి వెళ్లి క్షమాపణ చెప్పాల్సిందే:
    ల్యాబ్‌కు పంపిన ఆ నెయ్యి ట్యాంకర్లు, శాంపిల్స్‌ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా అయ్యావన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలి. వీటన్నింటి నేపథ్యంలో చేసిన ఘోర అపచారానికి చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్, కూటమి నేతలు, ఎల్లో మీడియా చెంపలు వేసుకోవడంతో పాటు.. తిరుమల కొండపైకి నడుచుకుంటూ వెళ్లి, స్వామివారి పాదాల చెంత సాష్టాంగపడి, మన్నించమని వేడుకోవాలి. అలాగే శ్రీవారి భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో తిరుమల శ్రీవారి ఆగ్రహానికి గురి కాక తప్పదని, వారికి తగిన శాస్తి జరుగుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తేల్చి చెప్పారు.

Back to Top