వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జోన్–3 పరిధిలోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన ఎస్సీ సెల్ నాయకులతో పార్టీ కేంద్ర కార్యాలయం, తాడేపల్లిలో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టి.జె.ఆర్. సుధాకర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు సంస్థాగత, ప్రజా సమస్యలపై చర్చించారు. డీఎస్సీ–2025 నియామకాలలో అవకతవకలు జరిగాయంటూ వైయస్ఆర్‌సీపీ చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో విజయవాడలోని SAAP కార్యాలయం వద్ద సెప్టెంబర్ 21న పార్టీ చేపట్టనున్న ఆందోళన కార్యక్రమానికి ఎస్సీ సెల్ తరఫున కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. జోన్–3 పరిధిలోని ఐదు జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొనేలా సమన్వయం చేయాలని నిర్ణయించారు. ఎస్సీ సెల్‌ను మరింత సమర్థవంతంగా పనిచేయించేందుకు జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, అసెంబ్లీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుల మధ్య బాధ్యతలు, కార్యాచరణ, పని విభజన అంశాలపై సమావేశంలో చర్చించారు. అలాగే 2024 నుంచి ఇప్పటివరకు జోన్–3 పరిధిలో దళిత ప్రజలు, దళిత నాయకులపై దాడులు, వేధింపులుగా పార్టీ దృష్టికి వచ్చిన ఘటనల వివరాలను జిల్లా వారీగా సమీక్షించారు. ఆయా ఘటనలకు సంబంధించి పార్టీ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలు, బాధితులకు అండగా నిలిచే అంశాలపై నాయకులతో చర్చించారు. త్వరలో నిర్వహించనున్న వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, దాని అజెండా, నాయకుల భాగస్వామ్యం, ఏర్పాట్లపైనా సమావేశంలో చర్చించారు. ఎస్సీ సెల్ నాయకులు ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉంటూ, దళితులకు సంబంధించిన సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలని, జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా టి.జె.ఆర్. సుధాకర్ బాబు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఎస్సీ సెల్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.