తాడేపల్లి: డీఎస్సీ నియామకాల్లో దివ్యాంగులకు దక్కాల్సిన రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జరిగిన అవకతవకలపై శాప్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన దివ్యాంగులపై దాడి చేయడం దారుణమని వైయస్ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి ధ్వజమెత్తారు. దివ్యాంగులకు డీఎస్సీతో పాటు స్పోర్ట్స్ కోటాలో కూడా తమకు హక్కుగా రావాల్సిన పోస్టులు, రిజర్వేషన్లు దక్కలేదని, ఈ అంశాలపై శాప్ ఎండీకి వినతిపత్రం సమర్పించేందుకు శాంతియుతంగా ర్యాలీగా వెళ్లామని చెప్పారు. అయితే అక్కడ కొందరు వ్యక్తులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించారు. దివ్యాంగులం అని కూడా చూడకుండా దాడులకు పాల్పడటం కూటమి ప్రభుత్వ పాలనలో పరిస్థితులకు అద్దం పడుతోందని విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా వైయస్ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చల్లా రామయ్య మాట్లాడుతూ.. డీఎస్సీపై జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని కూర్చున్న సమయంలో సుమారు 10 నుంచి 15 మంది గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో వచ్చి తనపై దాడికి తెగబడ్డారని చెప్పారు. తనపై దాడి చేయడంతో తీవ్రంగా భయాందోళనకు గురయ్యానని, అక్కడున్న విద్యార్థులు తనను వెనక్కి లాగి కాపాడారని చెప్పారు. తన స్టిక్‌ను లాక్కుని తనపైనే దాడికి ప్రయత్నించారని, ఈ ఘటనలో తన కాలికి గాయమైన విషయాన్ని తెలిపారు. దివ్యాంగుడిననే కనీస మానవత్వం లేకుండా తనపై దాడి చేయడం బాధాకరమన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోల్లో దాడి చేసిన వ్యక్తులను గుర్తించే అవకాశం ఉందని, వారిపై దివ్యాంగుల హక్కుల చట్టం, ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులను కోరారు. దివ్యాంగుల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం, పోలీసులు కాపాడాలని, దాడికి బాధ్యులైన వారిని గుర్తించి నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని పులిపాటి దుర్గారెడ్డి, చల్లా రామయ్య డిమాండ్ చేశారు.