తాడేపల్లి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పచ్చి జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ పోలీసుల ముందస్తు అనుమతితో శాప్ (SAP) కార్యాలయం వద్ద శాంతియుత నిరసన తెలపడానికి వెళ్లిన వైయస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై నారా లోకేష్‌కు చెందిన యువగళం రౌడీ మూకలు విచక్షణా రహితంగా దాడులకు తెగబడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ పరీక్షలో పేపర్ లీకేజీతో పాటు స్పోర్ట్స్ కోటా పేరిట అర్హత లేని కూటమి కార్యకర్తలకు అడ్డగోలుగా ఉద్యోగాలు కట్టబెట్టిన మాట పచ్చి నిజమని, ఆధారాలతో సహా అక్రమాలు బట్టబయలైనా ప్రభుత్వం ఏమీ జరగలేదంటూ బుకాయిస్తోందని డాక్టర్ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఇది లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వంపై చేస్తున్న న్యాయపోరాటమని స్పష్టం చేశారు. రిక్రూట్ అయిన వారి సర్టిఫికెట్లు ఒరిజినల్ అని చెబుతున్నప్పుడు, తాము ఎలాంటి తప్పు చేయలేదని ప్రభుత్వం భావిస్తే ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు వేయించడానికి ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆయన సూటిగా నిలదీశారు. ఈ సందర్ఫంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... లోకేష్ రౌడీ దళంతో పక్కా ప్లాన్ ప్రకారం దాడి. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ శాప్ వద్ద వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైయస్సార్సీపీ నేతలపై నారా లోకేష్ రౌడీ దళం అత్యంత పాశవికంగా దాడి చేసింది. శాప్ వద్ద వైయస్సార్‌సీపీ నిరసన చేపడుతుందని ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇచ్చాం. కానీ, ప్రభుత్వం కుట్రపూరితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ప్రత్యేక బస్సులు వేసి విజయవాడ రప్పించి, ఒక రాజకీయ పార్టీలా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాపైకి ఉసిగొల్పింది. గతంలో సాక్షి కార్యాలయాలపై దాడి చేసిన రౌడీలే నిన్న మా నాయకులపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, గౌతం రెడ్డి, ఎమ్మెల్సీలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. మహిళా నాయకులపై సైతం అసభ్యకర రీతిలో రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. పేపర్ లీకేజీపై సమాధానం చెప్పే ధైర్యం లేదా?.. డీఎస్సీలో రెండు స్పష్టమైన కుంభకోణాలు జరిగాయి. మొదటిది ప్రశ్నాపత్రం లీకేజీ కాగా, రెండోది స్పోర్ట్స్ కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచి అర్హత పరీక్ష లేకుండా తమ అనుయాయులకు ఉద్యోగాలు అమ్ముకోవడం. పేపర్ తయారు చేసిన విభాగంలోని వ్యక్తికే రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మేము ఆధారాలతో ప్రశ్నించగానే తర్వాత ఇచ్చిన మెరిట్ లిస్ట్ నుంచి ఆ మొదటి ర్యాంక్ పేరును ఎందుకు తొలగించారు? పేపర్ లీకేజీ జరగలేదని ముఖ్యమంత్రి గానీ, విద్యాశాఖ మంత్రి గానీ ఎందుకు సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు? 16 వేల ఉద్యోగాలు ఇచ్చామని క్రెడిట్ తీసుకునే లోకేష్, ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా ముందుకు ఎందుకు రారు? కేవలం రికార్డెడ్ వీడియోలు పెట్టుకుని దాక్కోవడం ఎందుకు? ఐఏఎస్ అధికారులను ముందు పెట్టి మాట్లాడిస్తే వారు మింగలేక, కక్కలేక బిత్తరచూపులు చూస్తున్నారు. సర్టిఫికెట్లు నిజమైతే సీబీఐ విచారణకు భయమెందుకు? ఉద్యోగాలు పొందిన కొందరు అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు ఒరిజినల్ అని మీడియా ముందు చూపిస్తున్నారు. మీ సర్టిఫికెట్లు నిజమైనవే అయితే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? విచారణ జరిగితే అవే సర్టిఫికెట్లు సీబీఐకి కూడా చూపించవచ్చు కదా? ఖోఖో, సాఫ్ట్ బాల్, జూడో అసోసియేషన్లు స్వయంగా రంగంలోకి వచ్చి, ఆయా తేదీల్లో జరిగిన పోటీల్లో ఈ అభ్యర్థులు పాల్గొనలేదని శాప్ ఎండీకి అధికారికంగా లేఖలు రాశాయి. ఆ లేఖలకు విద్యాశాఖ గానీ, సంబంధిత అధికారులు గానీ ఏమని సమాధానం చెబుతారు? మేము అసలైన ప్రతిభావంతులను గానీ, ఉపాధ్యాయులను గానీ తక్కువ చేసి మాట్లాడటం లేదు. నిబంధనలను తుంగలో తొక్కి లక్షలాది మంది నిరుద్యోగుల గొంతు కోసిన ప్రభుత్వ అవినీతి వ్యవస్థపైనే ప్రశ్నిస్తున్నాం. స్కామ్ బయటపడితే డైవర్షన్ చేయడమే చంద్రబాబు విధానం చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైనా వివాదాస్పద అంశం బయటకు వచ్చిన ప్రతిసారీ అసలు సమస్యపై సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టిని మరో అంశం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తారు. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, ఓటుకు నోటు వ్యవహారాల్లోనూ ఇదే తరహా రాజకీయ వైఖరి కనిపించింది. గతంలో స్కిల్ స్కామ్‌లో జైలుకు వెళ్లినప్పుడు దోమలు పంపించి చంపేస్తున్నారని డైవర్ట్ చేశారు. హైదరాబాద్ లో ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు ఆత్మాభిమానం అంటూ నాటకమాడారు. నిన్న శాప్ వద్ద వివాదం మొదలుకాకముందే కుప్పం సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులపై దాడి జరిగిందంటూ అబద్ధాలు ప్రచారం చేశారు. అసలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం, బాధితులపైనే కేసులు పెట్టడం లేదా మరో అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా సమస్యను పక్కదారి పట్టించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. లోకేష్ కోసం ఎవరినైనా చంపేస్తామని బహిరంగంగా బెదిరిస్తున్న రౌడీలను గురువులు అని చంద్రబాబు ఎలా సంబోధిస్తారు? బాధితులమైన మా పార్టీ నాయకులపైనే తిరిగి కేసులు బనాయిస్తున్నారు. లోకేష్ కోసం చంపుతాం.. చస్తామన్న వారే గురువులా? నారా లోకేష్‌ను ఎవరైనా విమర్శిస్తే ‘చంపుతాం.. లేకపోతే చస్తాం’ అంటూ బహిరంగ హెచ్చరికలు చేసిన వ్యక్తులే ఇప్పుడు మీకు గురువులుగా కనిపిస్తున్నారా? గతంలో సాక్షి కార్యాలయంపై దాడుల్లో కనిపించిన వారే నిన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన వారిపై దాడులు చేయించి, తిరిగి బాధితులపైనే నిందలు మోపడం ఏ రకమైన రాజకీయమో ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్రంలో హింసను ప్రోత్సహించే వారిని కాపాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే వారిని అణచివేయడం ఎంతకాలం కొనసాగిస్తారో సమాధానం చెప్పాలి. ఈ నేపధ్యంలో డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా ఎంపికపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని, సర్టిఫికెట్లు నిజమైనవైతే విచారణలో అవే తేలుతాయని డాక్టర్ సీదిరి అప్పలరాజు తేల్చి చెప్పారు. ఈలోగా డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు డీఎస్సీ కుంభకోణంతో పాటు, ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై రేపు వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ బృందం గవర్నర్‌ను కలిసి సమగ్ర ఆధారాలతో ఫిర్యాదు చేస్తుందని స్పష్టం చేశారు.