ఏలూరు : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్), పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు డి.వి.ఆర్.కె. చౌదరి, కైకలూరు నియోజకవర్గ పరిశీలకులు నూకపెయ్యి సుధీర్‌బాబు, చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు దాసరి రమేష్, నగర పార్టీ అధ్యక్షులు గుడిదేసి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు ముందస్తుగా సిద్ధం కావాలని సమావేశంలో సూచించారు. ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేసేలా ముందస్తు చర్యలు చేపట్టి, నామినేషన్లు దాఖలు చేసే విధంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.