ప్రొద్దుటూరు: స్ధానిక ఎన్నికల్లో లబ్దిపొందాలన్న దురాలోచనతోనే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మళ్లీ దుష్ర్పచారం మొదలుపెట్టారని, చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సునీతమ్మ, ఆమె భర్త రాజశేఖర్ డైరెక్షన్ లోనే ఈ కేసులో నిందితులు దస్తగిరి, సునీల్ యాదవ్ మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. గతంలో సీబీఐ దర్యాప్తు, సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో విచారించడానికి ఇంతకు మించి ఏమీ లేదని తేల్చేసినా, ఇప్పుడు మరోసారి కూటమికి రాజకీయ లబ్ది కోసం ఎల్లో మీడియా సాయంతో దుష్ప్రచారాలు మొదలుపెట్టారని రాచమల్లు ఆక్షేపించారు. ప్రెస్ మీట్లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంకేమన్నారంటే... వివేకా హత్యపై మళ్లీ నిస్సిగ్గుగా రాతలు రెండు, మూడు రోజులుగా ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్స్ మళ్లీ మొదలుపెట్టారు. ఆంధ్రజ్యోతి అయినా, ఈనాడైనా, సాక్షి అయినా, ఏదైనా, ఒక బ్యానర్ ఐటమ్ రాయాలన్నా, ఒక వార్తను ప్రసారం చేయాలన్నా అది 100కి 100 శాతం ప్రజా జీవితానికి అవసరమైనదని ఉండాలి. ప్రజా జీవితానికి భంగం కలిగించే వ్యవహారం ఏదైనా ఉంటే, దాన్ని నివారించే దానికైనా ఉండాలి. కనీసం ప్రజలకు ఉపయోగమైన వ్యవహారం ఉండాలి. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ఓ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసు, మరుసటి రోజు లిక్కర్ కేసు. రెండు రోజులు ఇది, రెండు రోజులు అది. వివేకానంద రెడ్డిని గొడ్డలితో పైశాచికంగా, కిరాతకంగా తాము హత్య చేశాం అని చెప్పి, మీడియా ముందుకు వచ్చి ఒప్పుకున్న దస్తగిరి, సునీల్ యాదవ్ అనే నిందితులు చెప్పే విషయాల్ని వీళ్లు బ్యానర్ ఐటమ్స్ రాస్తున్నారు. వెన్నుపోటు పార్టీ ఆఫీసుల వద్దే సునీల్ యాదవ్, దస్తగిరితో మాట్లాడిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి కలవడానికి వచ్చినట్లు దస్తగిరి చెప్తాడు, నిన్న సునీల్ యాదవ్‌తో మాట్లాడించారు. మాట్లాడించేది సునీత, రాజశేఖర్. వీళ్లకు స్క్రిప్ట్ పంపేది చంద్రబాబు పార్టీ కార్యాలయం. వీరిద్దరూ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి హత్య చేసిన వాళ్లు. ఎక్కడ అబ్బా 40 కోట్లు? 40 కోట్లు ఎక్కడ? డబ్బు ఎక్కడ రీకవరీ చేశారు? ఎవరు ఇచ్చారు? స్పష్టత ఉందా? సీబీఐ దర్యాప్తులో చెప్పిందా ? చార్జ్ షీట్లలో ఎక్కడైనా ఉందా ? పత్రికలలో మీకు ఇష్టం వచ్చినట్టు మీరు రాసేస్తే, అది నిజమవుతుందా? శవాలపైన రాజకీయం చంద్రబాబుదే శవాల పైన రాజకీయాలు చేసేది ఎవరయ్యా? వంగవీటి మోహన్ రంగాను చంపిందెవరు? అన్ని వేళ్లు చంద్రబాబు వైపు చూపించలేదా? హరికృష్ణ ప్రమాదశాత్తూ మరణిస్తే, పరామర్శకు వెళ్లి చంద్రబాబు కేటీఆర్ తో పొత్తుల గురించి మాట్లాడలేదా ? ఇవి కాదా శవాల మీద రాజకీయాలు చేయడం. బాలకృష్ణ ఇంట్లో తుపాకులు కాల్పులు జరిపి, ఇద్దరిని పైకి పంపించారు. ఇది కాదా గన్ కల్చర్? సాక్ష్యంగా మిగిలిన బాలకృష్ణ ఇంటి వాచ్ మెన్ ను బండరాయితో మోది చంపిందెవరు? ఎన్టీఆర్ పైన దాడి చేసింది ఎవరు? మల్లెల బాబ్జీ లాడ్జీలో ఎలా చనిపోయాడు ? పింగళి దశరథ రామయ్యను రిక్షాలో వెళ్తుంటే వేటకొడవళ్లతో నరికి చంపిందెవరు? ఆ వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపించాయి. ఈ హత్యలన్నీ శవాల మీద రాజకీయాలు కాదా? కుట్ర, వెన్నుపోటు రాజకీయాలు మీరు చేసి, ఇతరుల మీద మాట్లాడడం ఏంటి ? వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి సంబంధం ఉందని నమ్మించేందుకు నువ్వు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే.. తిరుపతి లడ్డూలో పంది కొవ్వు కలిసిందని కథ చెప్పినట్లే ఉంది. చంద్రబాబు కోసం వివేకానంద రెడ్డి గారు అవసరమైన ప్రతిసారి హత్యకు గురవుతూనే ఉంటారు. ఇప్పుటికి 700 సార్లు హత్య చేశారు. వివేకానంద రెడ్డి ఆయనకు ఎప్పుడు అవసరమైతే, అప్పుడు హత్యకు గురవుతాడు. చంద్రబాబుకు ఎప్పుడు అవసరం లేకపోతే, అప్పుడు నిశ్శబ్దంగా ఉంటాడు. ఎవరికి అంతిమ లాభం? సత్యగాని ప్రసాద్ గారు, అంతిమ లాభం చంద్రబాబుకు కాదా ? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి లాగుతున్నావంటే.. నీ నోరు, నోరేనా? మున్సిపాలిటీ కాలువ కంటే వరస్ట్. ఈ హత్య వల్ల అంతిమ లాభం వెన్నుపోటు పార్టీకి, దాని అధినేత చంద్రబాబుకు మాత్రమే. ఏడేళ్లుగా వివేకానంద రెడ్డి హత్యను మీ రాజకీయ లబ్ది కోసం, మీ ఓట్ల కోసం, మీ సీట్ల కోసం దిగజారిపోయి హీనంగా వాడుకుంటున్నారు. సునీల్ యాదవ్, దస్తగిరిని మీడియా ముందుకు తెచ్చి చౌకబారు మాటలన్నీ మాట్లాడిస్తోంది వివేకానంద రెడ్డి అల్లుడు రాజశేఖర్ కాదా? వారి కుమార్తె సునీత కాదా? సునీత రాజశేఖర్ లు చంద్రబాబు కంట్రోల్ లో లేరా? చీటికి మాటికి కలుస్తూనే ఉన్నారుగా ? చంద్రబాబు కన్నుసన్నల్లో సునీతమ్మ అడుగులు ఇప్పుడు మళ్లీ కడప జిల్లాలో కొత్త వార్త ప్రచారం అవుతుంది. రేపో మాపో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వివేకానంద రెడ్డి బావమరిది శివప్రకాశ్ రెడ్డి జడ్పీటీసీగా పోటీ చేయబోతున్నారని, లేదా సునీతమ్మ గారికి వైఎస్సార్ కడప జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తరపున కేటాయిస్తున్నారు అని వార్త ప్రచారం అవుతోంది. అది నిజమా అబద్ధమా వెన్నుపోటు పార్టీ చెప్పాలి. లేదంటే సునీతమ్మ చెప్పాలి. లేదంటే మరో 20 రోజుల తర్వాత నామినేషన్ వేసినప్పుడన్నా ప్రజలకు తెలియాలి. దేనికి ఈ రాజకీయ వ్యూహంలో ఈ చదరంగంలో ఇప్పుడు సునీతమ్మ అభ్యర్థిగానో, వారి మేనమామ ప్రకాశ్ రెడ్డి అభ్యర్థిగానో తెరపైకి రావడం అంటే కారణం వివేకానంద రెడ్డి హత్య విషయంలో చంద్రబాబుకు మీరు ఎంత ఉపయోగపడాలో అంత ఉపయోగపడుతున్నారు. మీరు మీరు ఒకటి కాగలిగారు కాబట్టి రాజకీయం కూడా సీట్లను, ఓట్లను పంచుకునే కాడికి వచ్చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నిసార్లు మాట్లాడినా మేం లేవనెత్తిన కోణంలో ఒక్కసారి కూడా సమాధానం చెప్పరు. వివేకానంద రెడ్డి గారికి రెండవ భార్య ఉంది షమీం. ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు. ఈ విషయం యావత్ ప్రపంచం చెబుతోంది. కడప జిల్లా చెప్తోంది, స్వయంగా షమీమే చెప్తుంది. వివేకానంద రెడ్డి ఫోటోలు చెప్తున్నాయి. వారిద్దరికీ కలిగిన సంతానమే ఒక అబ్బాయి. డిఎన్ఏ పరీక్ష చేయించాలని మేం అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి గారి ఆస్తులన్నీ షమీంకి ఎక్కడ చెందుతాయనో, ఆమె కుమారునికి చెందుతాయనే భయంతో సునీతమ్మ గాని, భర్త రాజశేఖర్ గాని ఆయన్ను చంపించే ప్రయత్నం చేసి ఉండకూడదని మేం అడిగాం. విచారణ కూడా ఆ కోణంలో ఎందుకు చేయలేదు అని 100 సార్లు ప్రశ్నించాం. వివేకాను కుటుంబానికి దూరం చేసిందెవరు ? వివేకానంద రెడ్డి గారి శ్రీమతి గాని, కూతురు గాని, వాళ్ళ అల్లుడు గాని అందరూ ఆయన్ను కుటుంబానికి దూరం చేశారు. ఆయనకు చెక్ పవర్ రద్దు చేశారు. 10 రూపాయల డబ్బు కూడా ఆయనకు ముట్టకుండా చేశారు. చివరి దశలో ఆయనకు ఎక్కువ తాగుడుకు బానిసై దిగులుతో ఉండేవారు. ఇవన్నీ మీ కుటుంబ కలహాలు కాదా? వీటిపై విచారణ చేయరా? అసలు అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి మరణించారని చెప్పిందే శివప్రకాశ్ రెడ్డి. ప్రచారంలో ఉన్నప్పుడు శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి బావ చనిపోయినట్లు చెప్పారు. . పీఏ కృష్ణా రెడ్డికి చెప్పి రాజశేఖర్ ఆ లేఖను దాచిపెట్టమని చెప్పాడు. ఎందుకు దీన్ని దాచిపెట్టమన్నాడనేది విచారణ చేయమని మీరు అడగరు. మీ ఇష్టారాజ్యంగా ఇప్పటికే ఏడేళ్లుగా 15 రకాల పిటిషన్లు వేశారు . నీ తండ్రిని చంపిన వాళ్ళను న్యాయస్థానంలో నిలబెట్టి విచారణ చేయించి గొడ్డలతో పైశాచికంగా నరిసిన హంతకులకు శిక్ష వేయించాలనే కోరిక సునీతమ్మకు లేదా ? నిజంగా నీకు ఆ కోరిక ఉంటే ఏడు సంవత్సరాలుగా ఎందుకు జాప్యం చేస్తున్నారు? విచారణకు రాకుండా, ఎంతసేపూ.. ఉన్న ఒకే కోణంలోనే మాట్లాడుతున్నారు తప్ప, మేం చంపాం, మీ తండ్రిని రొమ్ముల మీద కూర్చుని గుద్దాం, ఆయన మర్మాంగాల దగ్గర కాలుతో కొట్టాం, బూతులు తిట్టాం, గొడ్డలితో నరికాం అని ఇంత ఓపెన్ గా చెప్పే వాళ్లకు శిక్ష ఎందుకు వేయించలేకపోయారు? వాళ్లకు క్షమాభిక్ష పెట్టేశారా? క్షమించేశారా ? లేకుంటే వాళ్ళ వెనకల మీరు ఉన్నారా ? లేకుంటే మరొకరు ఉన్నారా? ఇది మాకు అర్థం కావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ ఈ మర్మం అర్దం కావట్లేదు. వివేకాను హత్య చేసిన ఈ దస్తగిరి పైన, సునీల్ యాదవ్ పైన సునీతమ్మకు, వారి భర్తకు, వారి కుటుంబ సభ్యులకు ఇంత అమితమైన ప్రేమ ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. - వీళ్లు సమాజానికి ప్రమాదకరం సునీతమ్మ తండ్రి వివేకా హత్య మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ వద్దకు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. సీబీఐ దర్యాప్తు తర్వాత సుప్రీం కోర్టు కూడా ఈ కేసులో ఇక దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించాల్సిన అవసరం లేదని చెప్పింది. సీబీఐ కూడా ఇదే చెప్పింది. ఇంకా ఎవరు చెప్పాలి మీకు? సుప్రీం కోర్టు కంటే పెద్దది ఏమన్నా ఉందా? ఈ దేశంలో సీబీఐ కంటే పెద్ద సంస్థ ఏమన్నా ఉందా? అయినా మళ్లీ రెడ్డొచ్చే మొదలాయె అన్నట్లుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు బ్యానర్ ఐటమ్స్ వేస్తున్నాయి. ఒక మనిషి మరణాన్ని, హత్యను తన రాజకీయ లబ్ది కోసం ప్రయోజనాల కోసం ఏడేళ్లుగా అబద్ధాలు చెప్పి వాడుకుంటున్న పెద్ద మనిషి చంద్రబాబును ఉరి తీయాలి. వీళ్లు సమాజానికి ప్రమాదకరం. మీ ఇష్టానుసారం పత్రికలు ఉన్నాయని, టీవీ ఛానల్స్ ఉండాయని, వింటారని, చూస్తారని అబద్ధాలను వండి వారుస్తున్నారు. లిక్కర్ స్కాం, వివేకా హత్య రెండు చంద్రబాబు జీవితంలో టీవీ సీరియల్స్ లాగా సశేషమైన స్టోరీలు. ఈ రెండు టీవీ సీరియల్స్ లాగా అంతం లేదు, ముగింపు లేదు, సశేషమే. దస్తగిరి, సునీల్ యాదవ్ చేతిలో ఉండే గొడ్డలికి పిడి మాత్రం వెన్నుపోటు పార్టీదే. చేతులు మాత్రమే వీళ్లవి. ఈ కేసు విచారణ జరగాలనే మేం కోరుుకుంటున్నాం. మేం తప్పించుకొని పారిపోయే వాళ్ళమైతే భయపడకుండా విచారణకు ఎందుకు హాజరు అవుతాం, ఆ నేరం చేయలేదు కాబట్టి కోర్టులో క్లీన్ షీట్ వస్తుందని భావిస్తున్నాం. డబ్బులు తీసుకుని నరికిన వాళ్లకు మాత్రం క్షమాభిక్ష పెడుతూ, హత్యతో సంబంధం లేని వాళ్లను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. వందల రూపాయలు కూడా ఖర్చుపెట్టలేని నిందితులు.. ఇప్పుడు కోట్లు పెట్టి లాయర్లు పెట్టుకుంటున్నారు. అంటే ఏం జరుగుతోందో ప్రజలకు అర్దమవుతూనే ఉంది. హత్య చేసిన ముద్దాయిలకు శిక్ష పడేలాగా చూడాలి, విచారణ ఆలస్యం కాకుండా చూడాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.