వైయస్‌ జగన్‌ను కలిసిన లంకపల్లి రైతులు

600 ఎకరాల లంక భూముల వ్యవహారంపై ఫిర్యాదు 

తమకు న్యాయం జరిగేలా అండగా నిలవాలని విజ్ఞప్తి

600 ఎకరాల లంక భూముల వ్యవహారంపై వైయస్‌ జగన్‌కు రైతుల ఫిర్యాదు

1952 నుంచి సాగు చేసుకుంటున్న తమ భూములపై అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారని ఆవేదన

తాడేపల్లి : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన రైతులు బుధవారం వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. గ్రామ పరిధిలోని సుమారు 600 ఎకరాల లంక భూములకు సంబంధించి చోటుచేసుకున్నట్లు చెబుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేసి, తమకు న్యాయం జరిగేలా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

1952 నుంచి తాము లంక భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని రైతులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. తమను పక్కనపెట్టి స్థానిక టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై టీడీపీ నాయకులు, వారి బినామీల పేర్లతో అనధికారికంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారని వారు ఆరోపించారు. రాజకీయ ప్రాబల్యంతో తమ హక్కులను కాదని భూములను ఇతరుల పేర్లకు మార్చినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారమంతా పమిడిముక్కల తహసీల్దార్‌ కె.నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిందని వారు ఆరోపించారు.

లంక భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, తమకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలవాలని రైతులు వైయస్‌ జగన్‌ను కోరారు. రైతుల సమస్యలను, వారి ఆవేదనను సావధానంగా విన్న వైయస్‌ జగన్‌, అవసరమైన న్యాయ సహాయాన్ని పార్టీ తరఫున అందిస్తామని భరోసా ఇచ్చారు. రైతుల హక్కుల పరిరక్షణకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని తెలిపారు.

పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ను కలిసిన వారిలో రైతులు యలమంచిలి గణేష్‌, ముళ్ళపూడి సోమయ్య, కనుమూరి వెంకటేశ్వరరావు, చొప్పరపు నాగేశ్వరరావు, కొడాలి రాంబాబు తదితరులు ఉన్నారు.

Back to Top