బీసీ రిజర్వేషన్ల పేరుతో పదే పదే వంచన

కమిషన్ నివేదికపై చర్చ, ఆమోదం లేకుండానే నాలుగు రోజుల్లో ప్రకటన

వైఎస్సార్సీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ధ్వజం

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్

 జగన్ హయాంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం.. చంద్రబాబు పాలనలో హామీలకు తూట్లు

 బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై రెండేళ్లుగా కాలయాపన

 స్థానిక సంస్థల ఎన్నికల కోసం డెడికేటెడ్ కమిషన్ పేరుతో డ్రామా

 బీసీలకు వెన్నుపోటు పొడిచిందే కాకుండా టీడీపీ నేతల సంబరాలు

 జీవోల పేరుతో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం.. చట్టబద్ధ రిజర్వేషన్లే మా డిమాండ్

 రమేష్ గౌడ్ స్పష్టీకరణ

తాడేపల్లి:రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికపై ఎటువంటి చర్చ జరగకుండా, అసెంబ్లీలో లేదా మంత్రివర్గంలో ఆమోదం లభించకుండా కేవలం నాలుగు రోజుల్లోనే నేరుగా ప్రకటన చేయడం చంద్రబాబు మోసపూరిత రాజకీయాలకు నిదర్శనమని వైఎస్సార్సీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 14న నివేదిక ఇచ్చిన తర్వాత, దానిపై సమగ్ర చర్చ జరగకుండా, తగిన ఆమోద ప్రక్రియ పూర్తయిందా అన్న స్పష్టత లేకుండానే ఆగస్టు 18న ప్రభుత్వం ప్రకటన చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు 19న జీవోలు జారీ చేసి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్పడం, మరోవైపు టీడీపీ నాయకులు పాలాభిషేకాలు, ఊరేగింపులు, సంబరాలు చేసుకోవడం బీసీ సమాజాన్ని అవమానించడమేనని విమర్శించారు. బీసీల రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు ఆడుతున్న డ్రామాల వల్ల యావత్ బీసీ సమాజం తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చట్టబద్ధంగా అమలు చేయకుండా బీసీలను వంచించారని, న్యాయస్థానాల్లో ఎదురైన పరిణామాల తర్వాత కూడా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోలేదని ఆరోపించారు. బీసీలకు నిజంగా న్యాయం చేయాలంటే పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి, రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ గారి హయాంలో బీసీలకు కల్పించిన రాజకీయ ప్రాధాన్యం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశాల కోసం తీసుకొచ్చిన చట్టం వంటి చర్యలను గుర్తుచేస్తూ, బీసీల హక్కుల కోసం వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే...

ఎన్నికలొస్తేనే చంద్రబాబుకి బీసీలు గుర్తొస్తారు:

టీడీపీకి ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు గుర్తుకొస్తారు, ఎన్నికలు అయిపోయాక ఇచ్చిన హామీలను మర్చిపోయి బీసీలను మోసం చేయడం అలవాటుగా మారింది. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు చట్టపరంగా 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రెండేళ్ల పాటు కాలయాపన చేసి, చివరకు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌ను నియమించి, ఆ కమిషన్ నివేదికపై సమగ్ర చర్చ జరపకుండా, తగిన ఆమోద ప్రక్రియపై స్పష్టత ఇవ్వకుండా హడావుడిగా ప్రకటనలు చేశారు. నివేదికపై చర్చ లేదు, ఆమోదం లేదు, కానీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేశామని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా, కోర్టుకు వెళ్లే ప్రమాదం ఉందని ఆయనే అసెంబ్లీలో చెప్పారంటే, న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిసి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించకుండా, పార్టీ పరంగా 34 శాతం ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం మోసం కాదా? ఇచ్చిన హామీని అమలు చేయకుండా, కోర్టుల్లో ఎదురైన పరిణామాల తర్వాత కూడా బీసీలకు క్షమాపణ చెప్పకుండా పాలాభిషేకాలు చేయించుకోవడం బీసీలను వంచించడం కాక ఇంకేమిటి?

మంత్రులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?:

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి జీవోలు జారీ చేయడం, ఆ తర్వాత న్యాయస్థానాల్లో ఎదురైన పరిణామాలతో సమస్య పరిష్కారం కాకపోవడం, ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం ద్వారా బీసీలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే చట్టబద్ధమైన హక్కులు వచ్చినట్లా, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వు చేసిన స్థానాల్లో అన్ని పార్టీల అభ్యర్థులకు, స్వతంత్ర అభ్యర్థులకు కూడా వర్తించేలా చట్టం ఉంటేనే నిజమైన న్యాయం జరిగినట్లా.. సమాధానం చెప్పాలి. బీసీలకు నిజంగా చిత్తశుద్ధితో న్యాయం చేయాలంటే పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి, 9వ షెడ్యూల్‌లో చేర్చే దిశగా ఎందుకు ప్రయత్నించడం లేదు?  చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం కోసం ఒక్కసారైనా గట్టిగా అడిగారా? కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సత్యప్రసాద్, పార్థసారథి వంటి నాయకులు న్యాయ నిపుణులతో చర్చిస్తామని చెప్పిన తర్వాత సాధించిన ఫలితం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీసీలకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా, కేబినెట్ సమావేశాల్లో కొత్త కొత్త రిజర్వేషన్ల లెక్కలు ప్రకటిస్తూ కాలయాపన చేయడం ఆపి, చట్టబద్ధమైన పరిష్కారం చూపాలి. బీసీలను ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వాడుకొని, ఆ తర్వాత వారి హక్కులను విస్మరిస్తే ఈ సమాజం మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉండదు.

జగన్ హయాంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం:

ఇన్నాళ్లూ బీసీలను ఎన్నిసార్లు మోసం చేసినా చెల్లుబాటవుతుందని చంద్రబాబు అనుకున్నారు, కానీ వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు రాజకీయ గుర్తింపు, గౌరవం, ప్రాతినిధ్యం కల్పించి నోరు లేని కులాలకు సైతం మాట్లాడే అవకాశం ఇచ్చారు. జగన్ గారి హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు దాదాపు 50 శాతం వరకు రాజకీయ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారు; 13 మేయర్ పదవుల్లో తొమ్మిది, 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో ఆరు, 636 ఎంపీపీ స్థానాల్లో 239, 84 మున్సిపల్ చైర్‌పర్సన్ పదవుల్లో 44 స్థానాలు బీసీలకు దక్కేలా ప్రాధాన్యం కల్పించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం అవకాశాలు కల్పించే చట్టాన్ని తీసుకొచ్చారు, ఆ చట్టం ఇప్పటికీ అమల్లో ఉంది. బీసీలకు రాజకీయంగా మాత్రమే కాకుండా విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లోనూ అవకాశాలు కల్పించేందుకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేదలకు అండగా నిలిచారు. 2019లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఉపముఖ్యమంత్రి పదవుల్లోనూ ప్రాతినిధ్యం కల్పించిన జగన్ గారి విధానానికి, ఇప్పుడు ఒకే సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి పరిమితం చేసిన చంద్రబాబు వైఖరికి మధ్య తేడాను బీసీ నాయకులు ఆలోచించాలి. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వారి కోసం పనిచేసిన వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, మళ్లీ బీసీల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలి. బీసీలకు చట్టబద్ధమైన 34 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు, వారికి దక్కాల్సిన రాజకీయ గౌరవం, హక్కులు సాధించే వరకు వైఎస్ జగన్ గారి నాయకత్వంలో వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుంది. ఇప్పటికైనా బీసీ సమాజం ఈ మోసపూరిత రాజకీయాలను తిప్పికొట్టి వైఎస్సార్సీపీ వైపు నిలవాలని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు.

Back to Top